Share News

Damodara Rajanarasimha: ఫర్టిలిటీ కేంద్రాలపై నియంత్రణ

ABN , Publish Date - Aug 03 , 2025 | 04:48 AM

పిల్లల కోసం తపిస్తున్న దంపతుల ఆశను ఆసరాగా చేసుకొని, ఐవీఎఫ్‌, సరోగసిని వ్యాపారంగా మార్చి దందాకు పాల్పడుతున్న సంతాన సాఫల్య కేంద్రాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులను ఆ శాఖా మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు.

Damodara Rajanarasimha: ఫర్టిలిటీ కేంద్రాలపై నియంత్రణ

ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటు.. 10 రోజుల్లో నివేదికివ్వాలని ఆదేశం.. గ్రేటర్‌లో 70కిపైగా కేంద్రాల్లో తనిఖీలు

హైదరాబాద్‌, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): పిల్లల కోసం తపిస్తున్న దంపతుల ఆశను ఆసరాగా చేసుకొని, ఐవీఎఫ్‌, సరోగసిని వ్యాపారంగా మార్చి దందాకు పాల్పడుతున్న సంతాన సాఫల్య కేంద్రాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులను ఆ శాఖా మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. సృష్టి తరహా ఘటనలు పునరావృతం కాకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. సంతాన సాఫల్య కేంద్రాలలో తనిఖీలు, నియంత్రణ కోసం ఉన్నతాధికారులతో కమిటీని నియమించాలని ఆరోగ్యశాఖ కార్యదర్శికి మంత్రి సూచించారు. ఈ మేరకు హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ కమిషనర్‌ నేతృత్వంలో ఆరోగ్యశ్రీ సీఈవో, వైద్యవిద్య సంచాలకులు సభ్యులుగా కమిటీని నియమిస్తూ హెల్త్‌ సెక్రటరీ క్రిస్టినా చోంగ్థు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఐవీఎఫ్‌ కేంద్రాలు చట్టాలను ఉల్లంఘించి అనైతిక చర్యలకు పాల్పడుతున్నట్లు సర్కారు దృష్టికి వచ్చిన నేపథ్యంలో ఈ కమిటీ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ఐవీఎఫ్‌, ఫర్టిలిటీ కేంద్రాల పనితీరును పరిశీలిస్తుంది. ఆయా సెంటర్లకు నిబంధనల ప్రకారం రిజిస్ట్రేషన్‌ ఉందా, డాక్యుమెంటేషన్‌ అంతా పక్కాగా ఉందా అన్న విషయాలను నిర్ధారిస్తుంది. ఈ కేంద్రాలపై ఇది వరకు ఏమైనా కేసుల నమోదయ్యాయా, ఏమైనా చర్యలు తీసుకున్నారా, వీటి బారిన పడి ఎవరైనా మోసపోయారా అన్న వివరాలను సేకరించనుంది. అలాగే ఈ కేంద్రాలపై మెడికల్‌ కౌన్సిల్‌ ఏమైనా చర్యలు తీసుకుందా అన్న వివరాలను పరిశీలిస్తుంది. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా వాటిని నివారించేందుకు ఇప్పటికే ఉన్న నియమ నిబంధనలేమిటి, పర్యవేక్షణ పద్ధతులేంటి..? అన్న దానిపై సమీక్ష నిర్వహిస్తుంది. పై అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ ప్రక్రియను పది రోజుల్లో పూర్తి చేసి, సమగ్ర నివేదిక అందించాలని కమిటీని ప్రభుత్వం ఆదేశించింది.


తొలి రోజు 70కి పైగా కేంద్రాల్లో తనిఖీలు...

రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్‌ ఆదేశాల మేరకు గ్రేటర్‌ పరిధిలోని ఫర్టిలిటీ కేంద్రాలలో శనివారం తనిఖీలు ప్రారంభమయ్యాయి. సుమారు 70కి పైగా కేంద్రాలను తనిఖీ చేసినట్లు వైద్యవర్గాలు వెల్లడించాయి. గ్రేటర్‌ పరిధిలో 157 ఫర్టిలిటీ కేంద్రాలున్నాయి. మొత్తం 35 బృందాలను రంగంలోకి దించారు. ఒక్కో తనిఖీ బృందం రోజుకు సగటున 4-5 కేంద్రాలను తనిఖీ చేయాలని కమిషనర్‌ ఆదేశించారు. కాగా, మొదటిరోజు ఒకటి రెండు కేంద్రాలు తనిఖీ బృందాలకు పూర్తిగా సహకరించలేదని సమాచారం. ఆది, సోమవారాల్లో మొత్తం కేంద్రాల్లో తనిఖీల పర్వం ముగుస్తుందని ఉన్నతాధికారులు వెల్లడించారు. మంగళవారం ప్రభుత్వానికి నివేదిక అందించనున్నట్లు వారు తెలిపారు. కాగా, ఒకవైపు ఈ తనిఖీలు కొనసాగుతుండగానే, మరోవైపు ప్రభుత్వం కమిషనర్‌ ఆఫ్‌ ఫ్యామిలీ వేల్ఫెర్‌ ఆధ్వర్యంలో ఒక కమిటీని వేసింది.


ఈ వార్తలు కూడా చదవండి..

కాంగ్రెస్‌ మాత్రమే మోదీని కుర్చీ నుంచి దింపగలదు: రేవంత్‌రెడ్డి

ప్రభుత్వ సొమ్ము తిన్నవాళ్లను తిరిగి కక్కిస్తాం.. మహేష్ గౌడ్ స్ట్రాంగ్ వార్నింగ్

Read latest Telangana News And Telugu News

Updated Date - Aug 03 , 2025 | 04:48 AM