Dalit Youth love Affair: కులోన్మాద హత్య
ABN , Publish Date - Jul 18 , 2025 | 03:38 AM
తమ అమ్మాయితో ప్రేమలో ఉన్నాడని గ్రామంలోని దళిత యువకుడిపై ఓ వర్గం వారు కోపం పెంచుకున్నారు. నచ్చజెబితే వినడం లేదని అతడిపై పోలీసు స్టేషన్‌లో కేసు పెట్టారు.

ప్రేమించిన పాపానికి దళిత యువకుడు బలి
జగిత్యాల జిల్లా కిషన్‌రావుపేటలో దారుణం
యువతి తండ్రి, బాబాయి దాడిలో ప్రాణాలు కోల్పోయిన మల్లేశ్
వెల్గటూర్, జూలై 17 (ఆంధ్రజ్యోతి): తమ అమ్మాయితో ప్రేమలో ఉన్నాడని గ్రామంలోని దళిత యువకుడిపై ఓ వర్గం వారు కోపం పెంచుకున్నారు. నచ్చజెబితే వినడం లేదని అతడిపై పోలీసు స్టేషన్‌లో కేసు పెట్టారు. అయితే, యువతికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారనే సమాచారంతో ఆ యువకుడు కోపోద్రిక్తుడయ్యాడు. వెనకా ముందు చూడకుండా వాళ్ల ఇంటికి వెళ్లి గొడవ చేశాడు. దీంతో అమ్మాయి కుటుంబ సభ్యుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. గొడవ జరిగిన గంటల వ్యవధిలోనే కత్తులతో పొడిచి అతడిని అంతమొందించారు. జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండల కేంద్రంలో గురువారం ఈ దారుణం జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వెల్గటూర్ మండలం కిషన్‌రావుపేటకు చెందిన దళిత యువకుడు సల్లూరి మల్లేశ్(26) అదే గ్రామంలోని బీసీ వర్గానికి చెందిన యువతి కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. విషయం తెలిసిన అమ్మాయి కుటుంబ సభ్యులు గతంలో మల్లేశ్‌పై వెల్గటూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టారు. ప్రస్తుతం కోర్టులో ఆ కేసు నడుస్తోంది. ఇద్దరి కులాలు వేరు వేరు కావడంతో యువతి బంఽధువులు వారి ప్రేమను అంగీకరించలేదు. అమ్మాయికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారనే విషయం తెలిసి గురువారం ఉదయం 11 గంటల ప్రాంతంలో మల్లేశ్ వారి ఇంటికి వెళ్లి గొడవ చేశాడు.
ఆ సమయంలో యువతి తండ్రి ఇంటి వద్ద లేడు. అనంతరం ఆ కుటుంబ సభ్యులు అమ్మాయి తండ్రి, బంధువులకు సమాచారం ఇచ్చారు. మల్లేశ్ వెల్గటూర్ వస్తున్న క్రమంలో యువతి తండ్రి, బాబాయి, మరో వ్యక్తి వెల్గటూర్ మండల కేంద్రంలోని పెద్ద వాగు బ్రిడ్జి పైన మాటు వేసి దాడి చేశారు. ఈ చర్యను ప్రత్యక్ష సాక్షులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో అతడిని తీవ్రంగా కొట్టి, అక్కడి నుంచి కిలోమీటరు దూరంలో కోటిలింగాల వెళ్లే రహదారి పక్కన పాత వైన్స్ వెనుకకు తీసుకెళ్లి కత్తులతో పొడిచి హతమార్చారు. యువకుడిపై బ్రిడ్జి సమీపంలో కొందరు దాడి చేశారనే సమాచారాన్ని ఒకరు 100 నంబరుకు ఫోన్ చేసి చెప్పారు. దీంతో ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు సమీప ప్రాంతంలో గాలించగా కిలోమీటరు దూరంలో రక్తపు మడుగులో పడి ఉన్న మల్లేశ్ మృతదేహాన్ని గుర్తించారు. ఘటనా స్థలాన్ని డీఎస్పీ రఘుచందర్, ధర్మపురి సీఐ రాం నరసింహారెడ్డి, ఎస్‌ఐ ఉమాసాగర్ పరిశీలించారు. కాగా, తమ కొడుకును అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారని, వారిని కఠినంగా శిక్షించాలని మల్లేశ్ తండ్రి రాజయ్య డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి
స్వచ్ఛ సర్వేక్షణ్ 2024-25లో ఏపీకి ఐదు ప్రతిష్ఠాత్మక పురస్కారాలు..
యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి