Share News

CPI: మావోయిస్టులు తీవ్రవాదులు కాదు

ABN , Publish Date - Jun 05 , 2025 | 03:44 AM

మావోయిస్టులను తీవ్రవాదులుగా బీజేపీ దుష్ప్రచారం చేయడం దుర్మార్గమని, వారు తీవ్రవాదులు కాదని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు.

CPI: మావోయిస్టులు తీవ్రవాదులు కాదు

  • అమిత్‌షా శీర్షాసనమేసినా ఆ సిద్ధాంతాన్ని తుడిచిపెట్టలేడు

  • రావి నారాయణరెడ్డి జయంతి సభలో కె.నారాయణ

హైదరాబాద్‌ సిటీ, జూన్‌ 4 (ఆంధ్రజ్యోతి): మావోయిస్టులను తీవ్రవాదులుగా బీజేపీ దుష్ప్రచారం చేయడం దుర్మార్గమని, వారు తీవ్రవాదులు కాదని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. తెలంగాణ అమరవీరుల స్మారక ట్రస్ట్‌ ఆధ్వర్యంలో కమ్యూనిస్టు పార్టీ యోధుడు, పద్మవిభూషణ్‌ రావి నారాయణరెడ్డి జయంత్యుత్సవాలు జూబ్లీహిల్స్‌ రావి నారాయణరెడ్డి ఆడిటోరియం వేదికగా బుధవారం జరిగాయి. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ.. దేశంలో అసమానతలు పోవాలన్న లక్ష్యంతో ఒక సిద్ధాంతానికి నిబద్ధులై పోరాడుతున్న వారిని చంపడం అన్యాయమని దుయ్యబట్టారు. వచ్చే ఏడాదికల్లా నక్సల్‌ రహిత దేశంగా మారుస్తామని ప్రకటించిన కేంద్ర హోంమంత్రి అమిత్‌షా శీర్షాసనమేసినా ఆ పని చేయలేరని ఉద్ఘాటించారు. మోదీ ప్రభుత్వానికి దమ్ముంటే మావోయిస్టులను కాదు, ఈ దేశంలోని పేదరికం, నిరుద్యోగం, రైతుల ఆత్మహత్యలు వంటి సమస్యలను నిర్మూలించాలి అని నారాయణ సవాల్‌ విసిరారు.


ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట చరిత్ర పాఠాలను మరోసారి అధ్యయనం చేసైనా, మావోయిస్టులు సాయుధ మార్గాన్ని వీడాలని సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో కమ్యూనిస్టులంతా ఒక్కటి కావాలన్న ఆకాంక్షను వెలిబుచ్చారు. ఎమ్మెల్సీ కోదండరాం మాట్లాడుతూ.. రావి నారాయణరెడ్డి జీవితంపై సమగ్రంగా అధ్యయనం జరగాలని, అలాంటి గొప్ప వ్యక్తుల జీవతగాథలు బయో పిక్‌లుగా రావాలని అభిలషించారు. కొత్తపేటలో నిర్మిస్తున్న అతిపెద్ద మల్టీస్పెషాలిటీ ఆసుపత్రికి నారాయణరెడ్డి పేరు పెట్టాలని మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌ ప్రభుత్వాన్ని కోరారు. జానారెడ్డి మాట్లాడుతూ... రావి నారాయణ రెడ్డి మహోన్నత మానవతామూర్తి, త్యాగశీలి, ఆదర్శనేత అంటూ కొనియాడారు. స్వాతంత్య్ర సమర యోధుడు కందిమళ్ల ప్రతాపరెడ్డి మాట్లాడుతూ.. నారాయణరెడ్డి చొరవ వల్లే నిజాం వ్యతిరేక, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని భారత ప్రభుత్వం స్వాతంత్ర్యోద్యమంగా గుర్తించిందని తెలిపారు.


ఇవీ చదవండి:

రైల్వే టిక్కెట్ల వెనుక బిగ్ స్కాం.. మోసపోయిన లక్షల మంది..

జూన్ నెలలో 12 రోజులు బ్యాంకులు బంద్..

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 05 , 2025 | 03:44 AM