Nirmal: బిల్లుల కోసం బడికి తాళం వేసి కాంట్రాక్టర్ ఆందోళన
ABN , Publish Date - Jun 17 , 2025 | 05:44 AM
చేసిన కాంట్రాక్ట్ పనుల తాలూకు బిల్లులు మంజూరు చేయాలంటూ ఓ కాంట్రాక్టర్ తాను నిర్మించిన పాఠశాలకు తాళం వేసి ఆత్మహత్యకు యత్నించిన ఘటన నిర్మల్ జిల్లాలో సోమవారం చోటు చేసుకుంది.

ఒంటిపై పెట్రోలు పోసుకొని ఆత్మహత్యాయత్నం
చివరికి పోలీసుల జోక్యంతో తెరుచుకున్న పాఠశాల
ఖానాపూర్, జూన్ 16 (ఆంధ్రజ్యోతి) : చేసిన కాంట్రాక్ట్ పనుల తాలూకు బిల్లులు మంజూరు చేయాలంటూ ఓ కాంట్రాక్టర్ తాను నిర్మించిన పాఠశాలకు తాళం వేసి ఆత్మహత్యకు యత్నించిన ఘటన నిర్మల్ జిల్లాలో సోమవారం చోటు చేసుకుంది. ఖానాపూర్ మండలం రాజుర గ్రామానికి చెందిన గడ్డం శ్రీనివాస్ కాంట్రాక్టర్. ఇతను గత ప్రభుత్వ హయాంలో గ్రామంలోని పాఠశాలలో రూ. 37 లక్షల నిధులతో భవనాన్ని నిర్మించగా.. రూ. 14 లక్షల బిల్లులు చేతికి వచ్చాయి. మిగిలిన రూ. 23 లక్షల బిల్లులు మూడేళ్లుగా మంజూరు కాలేదు. దీంతో కొద్ది రోజులుగా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. దీంతో సోమవారం పాఠశాల వద్దకు వచ్చి.. తనకు చెల్లించాల్సిన బిల్లులు వచ్చే వరకూ పాఠశాల భవనంలోకి ఎవరినీ వెళ్లనిచ్చేది లేదంటూ తాళం వేసి.. ఆందోళన చేశాడు. ఆ తర్వాత గేటు బయట పెట్రోల్ డబ్బాతో కూర్చున్నాడు.
ప్రభుత్వం, అధికారులు వెంటనే స్పందించి.. తనకు రావాల్సిన రూ. 23 లక్షల బిల్లులు మంజూరు చేయాలని డిమాండ్ చేశాడు. లేని పక్షంలో పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడతానంటూ పోలీసుల ఎదుటే పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. అక్కడే ఉన్న గ్రామస్థులు, పార్టీల నాయకులు అతడి చేతిలోంచి పెట్రోల్ డబ్బాను లాక్కొని పక్కన పడేశారు. పోలీసులు సమస్యను జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇవ్వడంతో పాఠశాల గేట్లను తెరిచాడు. అనంతరం అతడు మాట్లాడుతూ.. పాఠశాల భవన నిర్మాణానికి అప్పులు చేసి తాను తీవ్ర ఇబ్బందులు పడుతున్నానన్నారు. అధికారులు వారం రోజుల్లోపు తనకు రావాల్సిన బిల్లులను చెల్లించకపోతే.. మరోసారి పాఠశాలకు తాళం వేస్తానని హెచ్చరించి వెళ్లిపోయాడు.