Congress: రేపు కాంగ్రెస్ ఢిల్లీ యాత్ర
ABN , Publish Date - Aug 03 , 2025 | 04:17 AM
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లు ఆమోదం కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు కాంగ్రెస్ ఢిల్లీ పర్యటనకు సిద్ధమైంది.

హైదరాబాద్ నుంచి ప్రత్యేక రైలులో పయనం
బీసీ రిజర్వేషన్ల కోసం కేంద్రంపై ఒత్తిడికి సన్నద్ధం
హైదరాబాద్, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లు ఆమోదం కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు కాంగ్రెస్ ఢిల్లీ పర్యటనకు సిద్ధమైంది. సోమవారం ఉదయం హైదరాబాద్ నుంచి ప్రత్యేక రైలులో పార్టీ నేతలతో పాటు బీసీ సంఘాల ప్రతినిధులు ఢిల్లీకి బయలుదేరుతున్నారు. మంగళవారం సీఎం రేవంత్‌రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్‌గౌడ్‌తో పాటు బీసీ మంత్రులు, బీసీ సంఘాల ప్రతినిధులు ఢిల్లీలో సమావేశమై రిజర్వేషన్ల బిల్లుపై పార్లమెంటులో చర్చ కోసం కాంగ్రెస్, మిత్ర పక్షాల ఎంపీలతో వాయిదా తీర్మానాలు ఇప్పించనున్నారు.
బుధవారం జంతర్‌మంతర్ వద్ద రేవంత్, మహేశ్ గౌడ్ నేతృత్వంలో జరిగే ధర్నాలో రాష్ట్రానికి చెందిన బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలు, బీసీ సంఘాల నాయకులు పాల్గొంటారు. అగ్రనేత రాహుల్ గాం ధీ, ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో పాటు కాంగ్రెస్ మిత్ర పక్ష పార్టీల నాయకులు దీనికి సంఘీభావం తెలుపుతారు. బీసీ రిజర్వేషన్ల బిల్లును ఆమోదించాలని రాష్ట్రపతి ముర్ముకు గురువారం వినతిపత్రం సమర్పించనున్నారు.