Congress: 6నే ఢిల్లీలో కాంగ్రెస్ ధర్నా.. బీసీ రిజర్వేషన్లపై జంతర్‌మంతర్ వద్ద తలపెట్టిన ధర్నా యథాతథం
ABN , Publish Date - Jul 31 , 2025 | 04:32 AM
బీసీ రిజర్వేషన్ల ఆమోదం కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన

బీసీ రిజర్వేషన్లపై జంతర్‌మంతర్ వద్ద తలపెట్టిన ధర్నా యథాతథం.. కాంగ్రెస్ పాదయాత్ర షెడ్యూల్‌లో మార్పు
నేటి నుంచే జనహిత యాత్ర షురూ..
వచ్చే నెల 4 తర్వాత విరామం.. ఢిల్లీ టూర్
5న ఢిల్లీకి సీఎం,మంత్రులు, ప్రజాప్రతినిధులు
బీసీ బిల్లుల ఆమోదం కోసం ఉభయసభల్లో వాయిదా తీర్మానాలు
6న ధర్నా.. 7న రాష్ట్రపతికి వినతిపత్రం
సీఎం రేవంత్, మీనాక్షి, మహేశ్‌గౌడ్ భేటీలో నిర్ణయం
హైదరాబాద్, జూలై 30 (ఆంధ్రజ్యోతి): బీసీ రిజర్వేషన్ల ఆమోదం కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యాచరణ ముందుగా నిర్ణయించుకున్న ప్రణాళిక ప్రకారమే జరగనుంది. వచ్చే నెల (ఆగస్టు) 5న పార్లమెంటులో కాంగ్రెస్ ఎంపీలతో బీసీ బిల్లులపై వాయిదా తీర్మానాలు ఇప్పించి చర్చ కోసం పట్టుబట్టడం, 6న జంతర్‌మంతర్ వద్ద ధర్నా, 7న రాష్ట్రపతిని కలిసి వినతిపత్రం సమర్పించడం యథాతథంగా కొనసాగనున్నాయి. ఈ మేరకు గురువారం నుంచి ఆగస్టు 6 వరకు టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ నేతృత్వంలో నిర్వహించాల్సిన పాదయాత్ర షెడ్యూల్‌లో మార్పులు చేశారు. 4వ తేదీ తర్వాత యాత్రకు విరామం ఇవ్వాలని, ఢిల్లీ పర్యటన ముగిశాక తిరిగి కొనసాగించాలని బుధవారం తన నివాసంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, మహేశ్‌కుమార్‌గౌడ్‌లతో నిర్వహించిన భేటీలో సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. నిజానికి ఆపరేషన్ సింధూర్ సహా కీలక అంశాలపై పార్లమెంటులో చర్చ కొనసాగుతుండటం, మరోవైపు 6వ తేదీ వరకు రాష్ట్రంలో పాదయాత్ర నేపథ్యంలో ఢిల్లీలో చేపట్టాల్సిన కార్యాచరణను 11వ తేదీకి వాయిదా వేయాలని భావించారు. కానీ ఆపరేషన్ సిందూర్‌పై చర్చ మంగళవారమే ముగియడంతో ఢిల్లీలో కార్యాచరణ యథాతథంగా నిర్వహించాలన్న నిర్ణయానికి వచ్చారు.
ప్రత్యేక రైల్లో ఢిల్లీకి బీసీ నేతలు
ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద మహాధర్నాలో పాల్గొనేందుకు రాష్ట్రం నుంచి బీసీ ప్రతినిధులు ఈ నెల 5న ప్రత్యేక రైల్లో వెళ్లనున్నారు. రాష్ట్రంలో నియోజకవర్గానికి 50మంది చొప్పున బీసీ నేతలను సమీకరించి తీసుకెళ్లాలని మీనాక్షి, మహేశ్‌గౌడ్, సీఎం రేవంత్‌ల భేటీలో నిర్ణయించారు. సీఎం, మంత్రులు, ప్రజా ప్రతినిధులు కూడా 5వ తేదీనే ఢిల్లీకి వెళ్లి మూడు రోజులు మకాం వేయనున్నారు. ధర్నాలో సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కాంగ్రెస్ ముఖ్యనేతలు, బీసీ సంఘాల నాయకులు పాల్గొంటారు. 7న రాష్ట్రపతిని కలిసి హైదరాబాద్‌కు రానున్నారు.
వీలైనంత త్వరగా నామినేటెడ్ పోస్టుల భర్తీ!
సీఎం రేవంత్, మీనాక్షి, మహేశ్‌గౌడ్‌ల భేటీలో నామినేటెడ్ పోస్టుల భర్తీ, పార్టీ కమిటీల ఏర్పాటుపైనా చర్చించారు. మంగళవారం ఉమ్మడి జిల్లాల వారీగా అబ్జర్వర్లు, పార్టీ ముఖ్య నేతలు ఇచ్చిన నివేదికలపై సమీక్షించారు. వీలైనంత త్వరగా నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించారు.
నేటి నుంచే జనహిత పాదయాత్ర
మహేశ్‌గౌడ్ నేతృత్వంలో మీనాక్షి నటరాజన్ ముఖ్యఅతిథిగా జనహిత పేరిట టీపీసీసీ తలపెట్టిన పాదయాత్ర గురువారం పరిగిలో ప్రారంభం కానుంది. 4వ తేదీన ఖానాపూర్‌లో శ్రమదానం, కార్యకర్తలతో సమావేశం తర్వాత విరామం ఇవ్వనున్నారు. ఢిల్లీ పర్యటన ముగిశాక చొప్పదండి, వర్ధన్నపేటల్లో పాదయాత్ర నిర్వహించి మళ్లీ విరామం ఇస్తారు. ఆగస్టు 15 తర్వాత పాదయాత్ర తిరిగి ప్రారంభం కానుంది.