Telangana Congress: పార్టీ నిర్మాణంలో సామాజిక న్యాయం
ABN , Publish Date - Apr 24 , 2025 | 04:45 AM
గ్రామ స్థాయి నుంచి కమిటీ నిర్మాణంలో సామాజిక న్యాయానికి కాంగ్రెస్ ప్రాధాన్యం. మీనాక్షీ నటరాజన్ నేతృత్వంలో గాంధీభవన్‌లో పీసీసీ పరిశీలకుల సమావేశం.

తద్వారా ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుద్దాం..
బీజేపీ, ఆరెస్సెస్‌లా సిద్ధాంతానికి ప్రాధాన్యం ఇవ్వాలి
కాంగ్రెస్‌తో నిమ్న వర్గాలకు న్యాయం: మీనాక్షీ నటరాజన్
గాంధీభవన్‌లో పీసీసీ పరిశీలకులు, డీసీసీ అధ్యక్షులతో భేటీ
హైదరాబాద్, ఏప్రిల్ 23(ఆంధ్రజ్యోతి): క్షేత్ర స్థాయి నుంచీ పార్టీ నిర్మాణంలో సామాజిక న్యాయం పాటించడం ద్వారా ఇతర రాష్ట్రాలకూ ఆదర్శంగా నిలుద్దామని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షీ నటరాజన్ అన్నారు. సామాజిక న్యాయం, రాజ్యాంగ పరిరక్షణే.. కాంగ్రెస్ సిద్ధాంతమని, దీన్నే ఆయుధంగా మార్చుకోవాలని అభిప్రాయపడ్డారు. గ్రామ, మండల, బ్లాకు కమిటీల కూర్పు కోసం నియమితులైన 70 మంది పరిశీలకులు, సహ పరిశీలకులతోపాటు డీసీసీ అధ్యక్షులతో బుధవారం గాంధీ భవన్‌లో మీనాక్షీ నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మీనాక్షీ నటరాజన్ మాట్లాడుతూ రాష్ట్రంలో చేపట్టిన కులగణను కాంగ్రెస్ పార్టీ నమూనాగా దేశానికి చూపుతున్నామని చెప్పారు. గ్రామ స్థాయి నుంచి కమిటీల నిర్మాణంలో సామాజిక న్యాయాన్ని అమలు చేయాలని.. అహ్మదాబాద్ సీడబ్ల్యూసీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారని గుర్తు చేశారు. ఈ నిర్ణయాన్ని తెలంగాణలోనే మొదటగా అమలు చేసి ఆదర్శంగా నిలుద్దామన్నారు. బీజేపీ, ఆరెస్సెస్ సిద్ధాంతాలు ఉన్నత వర్గాలకు ప్రయోజనాన్ని కలిగించేవైతే.. కాంగ్రెస్ సిద్ధాంతం నిమ్న వర్గాలకు న్యాయం చేస్తుందన్నారు.
అయితే, ఈ విషయాన్ని ఆయా వర్గాలకు అర్థమయ్యేట్లు చెప్పలేకపోతున్నామన్నారు. గ్రామ స్థాయి నుంచే కమిటీ నిర్మాణంలో సామాజిక న్యాయాన్ని అమలు చేసి.. ఆయా వర్గాల అభిమానం చూరగొనాలన్నది రాహుల్ ఉద్దేశమన్నారు. బీజేపీ, ఆరెస్సెస్ మాదిరిగానే కాంగ్రెస్ సైతం సిద్ధాంతానికి ప్రాధాన్యం ఇచ్చి ప్రజల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. సిద్ధాంత పోరాటానికి పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. పదవుల దగ్గరి నుంచి వనరుల వరకు అన్ని వర్గాల వారికీ భాగస్వామ్యం కల్పించినప్పుడే పార్టీ, ప్రభుత్వం బలంగా నిలబడతాయన్నారు. పార్టీ, ప్రభుత్వ పదవుల్లో సీనియర్లకు ప్రాధాన్యం ఇస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో పీసీసీ పరిశీలకులు ఏయే అంశాలపై సమీక్షలు నిర్వహించాలన్నది వివరించారు. కాగా, సమావేశానికి నలుగురైదుగురు పరిశీలకులు హాజరు కాకపోవడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత కీలక సమావేశానికి రాలేనంత కారణాలు ఏం ఉంటాయని ప్రశ్నించారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్ మాట్లాడుతూ గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీ ప్రక్షాళనలో పీసీసీ పరిశీలకుల బాధ్యత అత్యంత కీలకమైందన్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణంలో చిత్తశుద్ధితో పని చేయాలని సూచించారు. ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ త్వరలోనే స్థానిక ఎన్నికలు జరగబోతున్నాయని, వేలాది మంది కార్యకర్తలకు పదవులు దక్కే అవకాశం ఉందన్నారు. కాగా, టీపీసీసీ కార్యవర్గం, డీసీసీ అధ్యక్షుల పేర్లు ఇవేనంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం.. నిజం కాదని మహేశ్‌గౌడ్ ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. అనంతరం కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గ నేతలతో మీనాక్షి సమావేశమయ్యారు. అక్కడ పార్టీ ఓటమి గల కారణాలేంటి? అనే వివరాలను నేతలను అడిగి తెలుసుకున్నారు.
మీనాక్షితో ఎమ్మెల్యే రాజ్‌గోపాల్‌రెడ్డి భేటీ
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మరింత క్రియాశీలకంగా వ్యవహరించాలని మీనాక్షి నటరాజన్ సూచించినట్లు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి తెలిపారు. గతంలో ఎంపీగా ఆమెతో కలిసి పని చేశానని, పార్టీ ఇన్‌చార్జిగా నియమితులైన అనంతరం ఆమెను మొదటిసారి కలిసినట్టు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లాల వారీగా ఇన్‌చార్జిలు, పార్టీ నిర్మాణంపై చ ర్చించినట్టు వివరించారు. మంత్రి వర్గంలో చోటు ఆశిస్తున్న రాజ్‌గోపాల్‌రెడ్డి.. పార్టీ ఇన్‌చార్జిను కలవడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు.. పార్టీ కార్యకర్తలకు ప్రాధాన్యం కల్పించడం ద్వారా నియోజకవర్గ స్థాయి ప్రణాళిక, అభివృద్ధి పనుల్లో వారు క్రియాశీలంగా పాల్గొనేందుకు అవకాశం ఏర్పడుతుందని కాంగ్రెస్ ఎంపీలు మల్లురవి,. సురేశ్‌షెట్కార్, రఘురామిరెడ్డి, కావ్య, అనిల్‌కుమార్ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు వారు మీనాక్షికి వినతిపత్రం సమర్పించారు. ఎన్నికల హామీలను అమలు చేస్తుండడంతో కాంగ్రెస్ పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని వివరించారు.
ఇవి కూడా చదవండి
PSR Remand Report: పీఎస్‌ఆర్ రిమాండ్ రిపోర్ట్‌లో విస్తుపోయే వాస్తవాలు
Pahalgam Attack: బైసారన్ నరమేధంపై విస్తుపోయే వాస్తవాలు చెప్పిన మహిళ
Read Latest Telangana News And Telugu News