Share News

Chamala Kiran Kumar Reddy: ‘స్థానికం’ తర్వాతే మంత్రివర్గ విస్తరణ!

ABN , Publish Date - Feb 13 , 2025 | 03:24 AM

స్థానిక సంస్థల ఎన్నికల తర్వాతే రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ చేపట్టే అవకాశం ఉందని కాంగ్రెస్‌ ఎంపీ చామల కిరణ్‌ కుమార్‌రెడ్డి తెలిపారు. రేపో.. మాపో మంత్రి వర్గ విస్తరణ జరగనుందన్న ఊహాగానాలను ఆయన కొట్టిపారేశారు.

Chamala Kiran Kumar Reddy: ‘స్థానికం’ తర్వాతే మంత్రివర్గ విస్తరణ!

  • త్వరలోనే రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ మార్పు

  • వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పదవిస్తే మరింత సమర్థంగా పనిచేస్తా

  • మీడియాతో చిట్‌చాట్‌లో కాంగ్రెస్‌ ఎంపీ చామల కిరణ్‌

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల తర్వాతే రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ చేపట్టే అవకాశం ఉందని కాంగ్రెస్‌ ఎంపీ చామల కిరణ్‌ కుమార్‌రెడ్డి తెలిపారు. రేపో.. మాపో మంత్రి వర్గ విస్తరణ జరగనుందన్న ఊహాగానాలను ఆయన కొట్టిపారేశారు. గ్రామ పంచాయతీ, ఎంపీసీటీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై ఇప్పటికే పార్టీ తరపున ఎమ్మెల్యేల అభిప్రాయాలు సేకరించినట్లు చెప్పారు. ఢిల్లీలో బుధవారం ఆయన మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడారు. టీపీసీసీ కమిటీలపై కసరత్తు చివరి దశకు చేరిందని, ఇప్పటికే పీసీసీ తరఫున అభ్యర్థుల పేర్లను అధిష్ఠానానికి సూచించినట్లు పేర్కొన్నారు. టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా మీ పేరు వినిపిస్తుంది కదా? అనే ప్రశ్నకు స్పందిస్తూ.. అవకాశం వస్తే మరింత సమర్థవంతంగా పనిచేస్తానని బదులిచ్చారు.


‘‘ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జిగా ఉన్న దీపాదాస్‌ మున్షినే కేరళ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జిగా ఉన్నారు. వచ్చే ఏడాది కేరళ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నందున.. త్వరలోనే తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జిగా మరొకరిని నియమించే అవకాశం ఉంది’’ అని వివరించారు. తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అద్భుతంగా పని చేస్తోందని, దేశంలో ఎక్కడా లేని పథకాలను ఏడాదిలోనే అమలు చేసి చూపించామని తెలిపారు. ఏకకాలంలో రైతు రుణమాఫీ చేశామని, రైతు భరోసా ఇచ్చామని, మహిళలకు ఉచిత బస్సు.. ఇలా ఎన్నో పథకాలను విజయవంతంగా అమలు చేసినట్లు చెప్పారు. పీసీసీ, డీసీసీ, నియోజకవర్గ, మండల కమిటీల నియామకం పూర్తయితే.. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్లే అవకాశం ఉంటుందన్నారు. పథకాల ద్వారా లబ్ధి పొందిన వాళ్లు ప్రతీ గ్రామంలో ఉన్నారని, సోషల్‌ మీడియాలో అసత్య ప్రచారాన్ని వాళ్లు పట్టించుకోరని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌ అత్యధిక స్థానాలు గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌ మాదిరిగా తామూ వ్యవహరించి ఉంటే.. ఐదేళ్ల క్రితమే అధికారంలోకి వచ్చి ఉండే వాళ్లమని అభిప్రాయపడ్డారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ములుగు మన్నెంలో జాతరల సందడి

శ్రీశైలం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఆర్జిత సేవలు రద్దు

మేడారం మినీజాతర.. మొక్కులు చెల్లించకోనున్న భక్తులు

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Feb 13 , 2025 | 03:24 AM