Addanki Dayakar: సమానత్వం రాజ్యాంగంతోనే సాధ్యం
ABN , Publish Date - May 26 , 2025 | 04:44 AM
సమానత్వం భారత రాజ్యాంగంతోనే సాధ్యమని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు. రాజ్యాంగంలో 70శాతం హిందూ సనాతన ధర్మాలున్నాయని పేర్కొన్నారు.

రాముడిని దళితులకు దూరం చేసే కుట్ర: అద్దంకి దయాకర్
భద్రాచలం, మే 25 (ఆంధ్రజ్యోతి): సమానత్వం భారత రాజ్యాంగంతోనే సాధ్యమని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు. రాజ్యాంగంలో 70శాతం హిందూ సనాతన ధర్మాలున్నాయని పేర్కొన్నారు. భద్రాచలంలో ఆదివారం నిర్వహించిన రాజ్యాంగ పరిరక్షణ సదస్సులో ఆయన మాట్లాడారు. మన రాజ్యాంగం హైందవ ధర్మానికి దూరంగా ఉండదని, కానీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దాన్ని మరో రకంగా ప్రజల్లోకి తీసుకెళుతోందని ఆరోపించారు. రాముని దగ్గరకు రావడం అంటే ప్రజాస్వామ్యం దగ్గరకు రావడమేనన్నారు.
రాముడిని దళితులకు దూరం చేసే కుట్రలకు పాల్పడుతున్నారని, రాముడు మూలవాసుల దేవుడని పేర్కొన్నారు. జై శ్రీరామ్.. జై సీతారామ్ అనే నినాదాలను కొన్ని పార్టీలు తమ సొంతం చేసుకుంటున్నాయని, కానీ రాముడు అందరి దేవుడని అన్నారు. ఏపీలో విలీనం చేసిన ఐదు పంచాయతీలను తిరిగి తెలంగాణలోకి తేవాలని వినతులు అందాయని, ఈ అంశాన్ని సీఎం, సంబంధిత మంత్రుల దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. అంతకు ముందు అద్దంకి దయాకర్ దంపతులు భద్రాద్రి రామయ్యను దర్శించుకున్నారు.