Congress: బీసీల నోటి కాడి బువ్వను కాజేసేందుకు బీజేపీ కుట్రలు
ABN , Publish Date - Jul 26 , 2025 | 03:58 AM
బీసీల నోటి కాడి బువ్వను బీజేపీ నేతలు తన్నే కుట్రలు చేస్తున్నారని మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, వాకిటి శ్రీహరి దుయ్యబట్టారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి బీసీ వ్యతిరేకి అని, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు ఫ్యూడలిస్టు అని మండిపడ్డారు.

బీసీ రిజర్వేషన్లు అడ్డుకుంటే సకల జనుల సమ్మెను మించి పోరాటం
మంత్రులు పొన్నం, కొండా సురేఖ, వాకిటి శ్రీహరి
ఢిల్లీలో భాగీదారీ న్యాయ సమ్మేళనంలో పాల్గొన్న నేతలు
న్యూఢిల్లీ, జూలై 25 (ఆంధ్రజ్యోతి): బీసీల నోటి కాడి బువ్వను బీజేపీ నేతలు తన్నే కుట్రలు చేస్తున్నారని మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, వాకిటి శ్రీహరి దుయ్యబట్టారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి బీసీ వ్యతిరేకి అని, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు ఫ్యూడలిస్టు అని మండిపడ్డారు. శుక్రవారం ఢిల్లీలోని థల్ కటోరా స్టేడియంలో ఏఐసీసీ బీసీ సంఘం నేతృత్వంలో ‘భాగీదారీ న్యాయ సమ్మేళన్’ కార్యక్రమంలో మంత్రులు పాల్గొని ప్రసంగించారు. అనంతరం తెలంగాణభవన్‌లో మంత్రులు పొన్నం, కొండా సురేఖ, వాకిటి మీడియాతో మాట్లాడారు. సామాజిక న్యాయానికి కాంగ్రెస్ బ్రాండ్ అంబాసిడర్ అని.. ఎట్టి పరిస్థితుల్లోనూ స్థానిక ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఆనాడు సొంత పార్టీతోనే పోరాడామని, దమ్ముంటే బీజేపీ రాష్ట్ర నేతలు కేంద్రంపై ఒత్తిడి తేవాలని సవాల్ విసిరారు.
బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీల్లోని బీసీ నేతలు ఆ పార్టీల తీరుపై ఆలోచించాలని, అధిష్ఠానాలను ప్రశ్నించాలని సూచించారు. కిషన్ రెడ్డిది ద్వంద వైఖరి అని, ఆయన బీసీ వ్యతిరేకి అని మండిపడ్డారు. బిల్లులపై స్పష్టత ఇవ్వకుండా మతం పేరుతో తాత్సారం చేయాలనుకుంటే బీజేపీ నేతలను బీసీలు బయట తిరగనివ్వబోరని హెచ్చరించారు. బీసీ రిజర్వేషన్లను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే సకల జనుల సమ్మెను మించిన ఉద్యమాన్ని చూస్తారన్నారు. ఇకనైనా కిషన్‌రెడ్డి బీసీ రిజర్వేషన్లపై చర్చించేందుకు ప్రధాని అపాయింట్‌మెంట్ కోరాలని, తెలంగాణ ప్రజలు ఓట్లేసి గెలిపిస్తేనే కేంద్రమంత్రి అయ్యాననే విషయాన్ని గుర్తుంచుకోవాలని హితబోధ చేశారు. కులగణనలో భాగం కాని కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావులకు బీసీ రిజర్వేషన్లపై మాట్లాడే హక్కే లేదని వ్యాఖ్యానించారు. కాగా, భాగీదారీ న్యాయ సమ్మేళన్ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్ ఠాకూర్, షబ్బీర్ అలీ, వి.హన్మంతరావు, కైలాశ్ నేతతో పాటు తెలంగాణ నుంచి పలువురు నేతలు హాజరయ్యారు.
ఈ వార్తలు కూడా చదవండి..
నా జోలికొస్తే అడ్డంగా నరికేస్తా..
బాలికపై అత్యాచారం.. గర్భం దాల్చిందని బతికుండగానే..
For Telangana News And Telugu News