Persistence Of Students Pays Off: ఆ పిల్లల పట్టుదల ఫలించింది
ABN , Publish Date - Aug 01 , 2025 | 05:15 AM
ఆ విద్యార్థులు సాధించారు. తామెదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం కోసం కలెక్టర్ కార్యాలయానికి పాదయాత్రగా

గద్వాల జిల్లా పుల్లూరు గురుకులానికి కదలివచ్చిన కలెక్టర్
డిప్యూటీ వార్డెన్, సూపర్‌వైజర్ సస్పెన్షన్
ప్రిన్సిపల్ సహా ముగ్గురికి మెమోలు జారీ
హాస్టల్ భవన యజమానిపైనా చర్యలకు ఆదేశం
సమస్యలన్నీ పరిష్కరిస్తానని విద్యార్థులకు హామీ
అలంపూరు చౌరస్తా, జూలై 31 (ఆంథ్రజ్యోతి): ఆ విద్యార్థులు సాధించారు. తామెదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం కోసం కలెక్టర్ కార్యాలయానికి పాదయాత్రగా వెళ్లేందుకు రోడెక్కిన ఆ పిల్లల పట్టుదల ఫలించింది. ఆ చిన్నారుల వద్దకే కలెక్టర్ వచ్చారు. వారితో మాట్లాడారు. అన్ని సమస్యలనూ పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. తాగేందుకు సరైన నీళ్లు లేవని, అన్నంలో పురుగులొస్తున్నాయని, మరుగుదొడ్లు లేక ఇబ్బందులు పడుతున్నామంటూ చాన్నాళ్లుగా చెబుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదంటూ గద్వాల జిల్లా ఉండవల్లి మండలం పుల్లూరు గ్రామ శివారు అలంపూర్ చౌరస్తాలోని బాలుర గురుకుల పాఠశాల విద్యార్థులు బుధవారం గద్వాల కలెక్టర్ కార్యాలయం వైపు పాదయాత్రగా కదలడం సంచలనమైన సంగతి తెలిసిందే. గురువారం కలెక్టర్ బీఎం సంతోష్ ఆ గురుకులానికి వచ్చారు. డైనింగ్ హాల్‌ను, మరమ్మతుల నెపంతో భవన యజమాని మూసివేయించిన మరుగుదొడ్లను పరిశీలించారు. ఆనంతరం పదో తరగతి విద్యార్థులతో కలెక్టర్ ప్రత్యేకంగా మాట్లాడారు. వారు ఏయే సమస్యలు ఎదుర్కొంటున్నారనేది అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరష్కారానికి వెంటనే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కాగా, గురుకులాన్ని కలెక్టర్ పరిశీలించిన తర్వాత విఽధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినందుకు డిప్యూటీ వార్డెన్ రజిత, సూపర్‌వైజర్ నవీన్‌ను అధికారులు సస్పెండ్ చేశారు. ప్రిన్సిపల్ రామకృష్ణ, వార్డెన్, హౌస్‌మాస్టర్‌కు మెమోలు జారీచేసినట్లు వెల్లడించారు. విద్యార్థులను భవన యజమాని బెదిరిస్తున్నాడని విచారణలో తేలడంతో ఆయనపై కేసు నమోదు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రస్తుతం మూసిఉన్న మరుగుదొడ్లను తెరిచి వాడుకోవాలని, నెలలోపు విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా మరుగుదొడ్లను నిర్మిస్తామని ఆయన చెప్పారు. మెనూ ప్రకారమే పిల్లలకు భోజనం పెట్టాలని, నాణ్యతలేని బియ్యం వెంటనే వెనక్కి పంపి మంచి బియ్యం తెప్పించుకోవాలని ప్రిన్సిపల్‌ను ఆదేశించారు. చెడిపోయిన ఆర్వోను బాగుచేయించే దాకా బయట నుంచి మినరల్ వాటర్ తెప్పించాలని సూచించారు. అనంతరం కలుగొట్ల కేజీబీవీ పాఠశాలను కలెక్టర్ తనిఖీ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
జగన్ పర్యటన.. ప్రశాంతి రెడ్డి రియాక్షన్
జగన్ జైలుకు వెళ్తారా అంటే.. లోకేష్ ఏమన్నారంటే..
For More Telangana News And Telugu News