CM Revanth Reddy: పొట్టి శ్రీరాములు వర్సిటీ పేరు మార్పు పాలనా సౌలభ్యం కోసమే!
ABN , Publish Date - Mar 18 , 2025 | 04:43 AM
పరిపాలనా సౌలభ్యం కోసమే పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాపరెడ్డి యూనివర్సిటీగా నామకరణం చేస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఇది ఒక వ్యక్తి కోసమో, కులం కోసమో, ఒక కుటుంబం కోసమో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కాదని చెప్పారు.

2 రాష్ట్రాల్లో ఒకే పేరుతో ఉంటే ఇబ్బందులు
నిజాంపై పోరాడిన సురవరం పేరు పెట్టాం
చర్లపల్లి టెర్మినల్‌కు పొట్టి శ్రీరాములు పేరు
కేంద్ర మంత్రులిద్దరూ అనుమతులు తేవాలి
వర్సిటీ పేరు మార్పుపై సభలో సీఎం
హైదరాబాద్, మార్చి 17 (ఆంధ్రజ్యోతి): పరిపాలనా సౌలభ్యం కోసమే పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాపరెడ్డి యూనివర్సిటీగా నామకరణం చేస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఇది ఒక వ్యక్తి కోసమో, కులం కోసమో, ఒక కుటుంబం కోసమో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కాదని చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకే పేరుతో యూనివర్సిటీని కొనసాగించడం వల్ల పాలనాపరమైన సమస్యలు వస్తున్నాయని, గందరగోళం తలెత్తుతున్నాయని తెలిపారు. ఈ సమస్యల్లేకుండా చేసేందుకు వర్సిటీ పేరును మార్చాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. అయితే ఇది పొట్టి శ్రీరాములుపై తమకు గౌరవం లేకపోవడం కాదని, ఆయనపై అపారమైన గౌరవం ఉన్నాయని స్పష్టం చేశారు. సోమవారం శాసనసభలో ప్రభుత్వం ‘పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ(సవరణ) బిల్లు-2025’ను ప్రవేశపెట్టి ఆమోదించింది. ఈ సందర్భంగా యూనివర్సిటీ పేరును ఎందుకు మార్చాల్సివచ్చిందో సీఎం వివరించారు. ‘‘తెలుగు విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరాములు స్థానంలో సురవరం ప్రతాపరెడ్డి పేరును పెట్టాల్సిందిగా సీపీఐ సభ్యుడు కూనంనేని సాంబశివరావు గత శాసనసభా సమావేశాల్లో ప్రతిపాదించారు. గత పదేళ్లుగా ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు, విధివిధానాలను పరిశీలించిన తర్వాతనే ఈ ప్రతిపాదనను ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చింది. పొట్టి శ్రీరాములు చేసిన పోరాటం, ప్రాణత్యాగం ద్వారా 1953లో మద్రాసు నుంచి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన విషయాన్ని ఎవరూ తక్కువగా చూడడం లేదు. ఆయన ప్రాణత్యాగాన్ని అందరం గుర్తుంచుకుని, స్మరించుకోవాలి. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక పాలనాపరమైన కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఆనాడు తెలంగాణ కోసం పోరాడిన గొప్ప వ్యక్తులను స్మరించుకోవడం, వారి పేర్లను విద్యాసంస్థలకు పెట్టుకోవడం జరుగుతోంది. కానీ, కొంతమంది కొన్ని వర్గాలకు అపోహలు కలిగించే ప్రయత్నాలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంలో బాధ్యతలు నిర్వహిస్తున్నవారు ఇలా మాట్లాడడం సరికాదు’’ అని సీఎం అన్నారు.
పలు సంస్థల పేర్ల మార్పు..
ఏపీ, తెలంగాణకు తమ భౌగోళిక ప్రాంతాన్ని బట్టి విశ్వవిద్యాలయాలు వచ్చాయని సీఎం రేవంత్ పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఏపీకి వెళ్లడంతో తెలంగాణలో 2014లో హెల్త్ యూనివర్సిటీని ఏర్పాటు చేసుకుని.. కాళోజీ పేరు పెట్టుకున్నామని గుర్తు చేశారు. దీని అర్థం ఎన్డీఆర్ పట్ల తెలంగాణ ప్రజలకు గౌరవం లేదనో, చిన్నచూపు చూడాలనో కాదన్నారు. దాంతోపాటు ఇక్కడి ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి ప్రొఫెసర్ జయశంకర్ పేరును, డా.వైఎస్సార్ ఉద్యానవన యూనివర్సిటీకి కొండా లక్ష్మణ్ పేరును పెట్టుకున్నామని అన్నారు. తిరుపతిలో ఉన్న వెంకటేశ్వర వెటర్నిటీ యూనివర్సిటీని తెలంగాణలోనూ ఏర్పాటు చేసుకుని, పీవీ నర్సింహారావు పేరు పెట్టుకున్నామన్నారు. ఆ కోవలోనే తెలంగాణలో ఉన్న పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీకి సురవరం ప్రతాపరెడ్డి యూనివర్సిటీగా పేరు పెట్టుకున్నామని వివరించారు. సురవరం ప్రతాపరెడ్డి తెలంగాణ సాయుధ పోరాటానికి అందించిన సేవలు, నిజాంకు వ్యతిరేకంగా చేసిన పోరాటాన్ని మరువలేమన్నారు. ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి.. ఒక వ్యక్తి పట్ల, ఒక కులం పట్ల ప్రత్యేక అభిమానం ఉందంటూ కొంత మంది బయట మాట్లాడుతున్నారని సీఎం తప్పుబట్టారు. తనకు అలాంటి అభిమానమే ఉంటే.. మహిళా యూనివర్సిటీకి వీరనారి చాకలి ఐలమ్మ పేరును ఎందుకు పెడతానని ప్రశ్నించారు. ఉమ్మడి రాష్ట్రంలోని నెల్లూరులో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ(ఐఐహెచ్‌టీ) ఉంటే.. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఐఐహెచ్‌టీని మంజూరు చేయించుకుని, కొండా లక్ష్మణ్ బాపూజీ పేరును పెట్టామని అన్నారు. విజ్ఞతతో, విశాల ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను బాధ్యత గల వ్యక్తులు కులానికి ఆపాదించి మాట్లాడడం భావ్యం కాదన్నారు. అహ్మదాబాద్‌లో ఒక స్టేడియానికి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ పేరును మార్చి, ప్రధాని నరేంద్రమోదీ పేరును పెట్టారని, తాము అలాంటి తప్పులు చేయబోమని చెప్పారు.
చర్లపల్లి టెర్మినల్‌కు పొట్టి శ్రీరాములు పేరు..!
పొట్టి శ్రీరాములు, మాజీ ముఖ్యమంత్రి రోశయ్యతోపాటు ఆర్యవైశ్య సమాజం పట్ల తమ ప్రభుత్వానికి అపారమైన గౌరవం, విశ్వాసం ఉన్నాయని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఇటీవల ప్రారంభించిన చర్లపల్లి రైల్వే టెర్మినల్‌కు పొట్టి శ్రీరాములు పేరు పెట్టాల్సిందిగా కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డికి, బండి సంజయ్‌కు లేఖ రాస్తానన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వారే అనుమతులు తీసుకురావాలన్నారు. ఇక బల్కంపేట నేచర్ క్యూర్ ఆస్పత్రికి రోశయ్య పేరును పెట్టాలని నిర్ణయించామని ప్రకటించారు. అనంతరం బీజేపీ పక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. అహ్మదాబాద్‌లోని స్టేడియానికి ఉన్న సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ పేరును మార్చలేదని తెలిపారు. అక్కడి గ్రౌండుకు మాత్రమే ప్రధాని మోదీ పేరు పెట్టారన్నారు. నిజాంకు వ్యతిరేకంగా పోరాడారంటున్న సురవరం ప్రతాపరెడ్డి పేరును నిజాం నవాబు పేరు ఉన్న ఉస్మానియా యూనివర్సిటీకి పెట్టాలని సూచించారు. కాగా, పొట్టి శ్రీరాములు పేరును మార్చడం తెలుగువారిని అవమానించడమేనని బీజేపీ సభ్యుడు ధన్‌పాల్ సూర్యనారాయణ అన్నారు. యూనివర్సిటీ పేరు మార్పును బీజేపీ వ్యతిరేకించింది. సీపీఐ ఎమ్మెల్యే సమర్థించారు.
సభలో ఐదు బిల్లులు
శాసనసభలో సోమవారం ఐదు బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ‘తెలంగాణ షెడ్యూల్డు కులాలు(రిజర్వేషన్ల హేతుబద్ధీకరణ) బిల్లు-2025’ను మంత్రి దామోదర రాజనర్సింహ, ‘తెలంగాణ బీసీ, ఎస్సీ, ఎస్టీ(విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు) బిల్లు-2025’, ‘తెలంగాణ బీసీ(స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు) బిల్లు-2025’ను రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ‘తెలంగాణ చారిటబుల్ అండ్ రెలీజియస్ ఇన్‌స్టిట్యూషన్స్ అండ్ ఎండోమెంట్(సవరణ) బిల్లు-2025’ను మంత్రి కొండా సురేఖ ప్రవేశపెట్టారు. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ(సవరణ) బిల్లు-2025’ను ప్రవేశపెట్టి ఆమోదించారు.