Cricket Stadium: హనుమకొండలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం!
ABN , Publish Date - Jul 21 , 2025 | 03:48 AM
రాష్ట్రంలో మరో అంతర్జాతీయ స్థాయి క్రికెట్ స్టేడియం నిర్మాణానికి సీఎం రేవంత్‌రెడ్డి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలంలోని ఉనికిచర్లలో అంతర్జాతీయ స్థాయి క్రికెట్ స్టేడియం

అనుబంధంగా క్రీడా పాఠశాల కూడా..
వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం
ఉమ్మడి వరంగల్ ఎమ్మెల్యేల విజ్ఞపిౖపై స్పందన
హైదరాబాద్/వరంగల్, జూలై 20 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మరో అంతర్జాతీయ స్థాయి క్రికెట్ స్టేడియం నిర్మాణానికి సీఎం రేవంత్‌రెడ్డి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలంలోని ఉనికిచర్లలో అంతర్జాతీయ స్థాయి క్రికెట్ స్టేడియం, దానికి అనుబంధంగా క్రీడా పాఠశాలను మంజూరు చేస్తామని ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలకు ఆయన హామీ ఇచ్చారు. ఈ మేరకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాయిని రాజేందర్‌రెడ్డి, రేవూరి ప్రకాశ్ రెడ్డి, నాగరాజు, యశస్వినీరెడ్డి ఆదివారం సీఎం రేవంత్‌రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. రాష్ట్రానికి రెండో రాజధానిగా అభివృద్ధి చెందుతున్న వరంగల్‌లో అంతర్జాతీయ స్థాయి క్రికెట్ స్టేడియం, క్రీడా పాఠశాలను ఏర్పాటు చేయాలని వినతిపత్రం సమర్పించారు. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ఉనికిచర్లలో జాతీయ రహదారికి ఆనుకుని 50 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని, క్రికెట్ స్టేడియం, క్రీడా పాఠశాల ఏర్పాటుకు అనువుగా ఉంటుందని సీఎం దృష్టికి తెచ్చారు.
ఉమ్మడి జిల్లాల వారీగా క్రీడా మైదానాలు, క్రీడా పాఠశాలలు ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి.. ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేల విజ్ఞప్తి పట్ల సానుకూలంగా స్పందించారు. ఓరుగల్లు నగరంలో అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్ స్టేడియం, క్రీడా పాఠశాల నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాధనలు, విధివిధానాలు సిద్ధం చేయాలంటూ యువజన, క్రీడల శాఖ కార్యదర్శిని ఆదేశించారు. నెలాఖరులోగా స్టేడియం, క్రీడా పాఠశాల ఏర్పాటుకు సంబంధించిన వివరాలతో నివేదిక ఇవ్వాలని సూచించారు. అతి త్వరలోనే క్రికెట్ స్టేడియం, క్రీడా పాఠశాల మంజూరుకు చర్యలు తీసుకుంటానంటూ ఎమ్మెల్యేలకు హామీ ఇచ్చారు. ఇందుకు సంబంధించి వారం, పది రోజుల్లో ఉత్తర్వులు జారీ కానున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కాగా, తమ విజ్ఞప్తికి వెంటనే సానుకూలంగా స్పందించిన సీఎం రేవంత్‌రెడ్డికి ఎమ్మెల్యేలు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
త్వరలో యాదగిరి ఆధ్యాత్మిక మాసపత్రిక, టీవీ చానల్
రేవంత్ నాటుకోడి.. కేటీఆర్ బాయిలర్ కోడి
Read latest Telangana News And Telugu News