Osmania Study: పిల్లల కిడ్నీల్లో రాళ్లు
ABN , Publish Date - Jul 09 , 2025 | 05:49 AM
చిన్న పిల్లలు నీళ్లు తక్కువగా తాగడం... ప్రాసెస్డ్ ఆహారం అధికంగా తీసుకుంటుండడంతో కిడ్నీల్లో రాళ్లు ఏర్పడుతున్నట్లు ఉస్మానియా ఆస్పత్రి యూరాలజీ విభాగం తన ప్రాథమిక పరిశీలనలో గుర్తించింది.

తక్కువ నీళ్లు తాగడం.. ప్రాసెస్డ్ ఫుడ్ కారణం
ఉస్మానియా యూరాలజీ విభాగం పరిశీలన
ఏడాదిన్నరలో 109 మంది పిల్లలకు సర్జరీలు
ఆరు నెలల శిశువుకూ విజయవంతంగా చికిత్స
హైదరాబాద్ సిటీ, జూలై 8 (ఆంధ్రజ్యోతి): చిన్న పిల్లలు నీళ్లు తక్కువగా తాగడం... ప్రాసెస్డ్ ఆహారం అధికంగా తీసుకుంటుండడంతో కిడ్నీల్లో రాళ్లు ఏర్పడుతున్నట్లు ఉస్మానియా ఆస్పత్రి యూరాలజీ విభాగం తన ప్రాథమిక పరిశీలనలో గుర్తించింది. ఏడాదిన్నరలో రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి ఉస్మానియాకు చికిత్స కోసం వచ్చిన దాదాపు 109 మంది పిల్లలకు కిడ్నీలో రాళ్లను తొలగించారు. వీరంతా 12 ఏళ్లలోపు వారు. పిల్లలకు వారి వయసుకు అనుగుణంగా వివిధ ఆధునిక పద్ధతుల్లో చికిత్స అందించామని, దీనికి వారిని మూడు విభాగాలు (0-5, 6-10, 11-17)గా విభజించామని ఉస్మానియా యూరాలజిస్టు డాక్టర్ ఎస్.ఆనంద్ తెలిపారు. పిల్లలకు కూడా తక్కువ కోతతో శస్త్రచికిత్స చేయడం సురక్షితమేనని పేర్కొన్నారు. ప్యాకెట్లలో లభించే చిప్స్ లాంటి ప్రాసెస్డ్ ఫుడ్‌లో ఉప్పు ఎక్కువగా ఉండడం, దానికి తోడు తక్కువ నీళ్లు తాగుతుండడంతో పిల్లల కిడ్నీల్లో రాళ్లు ఏర్పడుతున్నాయని చెప్పారు. ఈ అలవాట్ల వల్ల యూరిక్ యాసిడ్ పెరుగుతుందని, జీవక్రియలో సమస్యలు తలెత్తుతాయని తెలిపారు. అయిదారుగురు పిల్లల్లో రెండు కిడ్నీల్లో రాళ్లు ఏర్పడ్డాయన్నారు. చిన్నపిల్లలకు సర్జరీ చేయడం సవాళ్లతో కూడకున్నదని, ఏడాదిలోపు శిశువులకు కూడా విజయవంతంగా చేయడం గర్వకారణవని ఆయన అన్నారు. ఇన్‌ఫెక్షన్ వల్ల కూడా పిల్లలకు రాళ్లు ఏర్పడుతున్నట్లు గుర్తించామని డాక్టర్ ఎస్.ఆనంద్ తెలిపారు.