Chevella: ‘పైసల వర్షం’... పోయాం మోసం!
ABN , Publish Date - Jul 29 , 2025 | 04:50 AM
పైసల వర్షం.. కట్టలు కట్టలుగా కురుస్తుంది! వేలల్లో డబ్బు పెడితే లక్షల్లో.. లక్షల్లో డబ్బు పెడితే కోట్లలో కురిసి మురిపిస్తుంది! ఇలా ఓ ముఠా, తన మాటల వలలో ఓ వ్యాపారిని పడేసి అతడి నుంచి రూ.21లక్షలతో ఉడాయించింది.

నోట్ల కట్టలు కురిపిస్తామంటూ వ్యాపారి నుంచి రూ.21 లక్షలు తీసుకుని పరార్
చేవెళ్లలో పూజల పేరుతో హడావుడి
చేవెళ్ల, జూలై 28 (ఆంధ్రజ్యోతి): పైసల వర్షం.. కట్టలు కట్టలుగా కురుస్తుంది! వేలల్లో డబ్బు పెడితే లక్షల్లో.. లక్షల్లో డబ్బు పెడితే కోట్లలో కురిసి మురిపిస్తుంది! ఇలా ఓ ముఠా, తన మాటల వలలో ఓ వ్యాపారిని పడేసి అతడి నుంచి రూ.21లక్షలతో ఉడాయించింది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పరిధిలో ఈ ఘటన జరిగింది. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన వర్మ అనే వ్యాపారి.. రంగారెడ్డి జిల్లా మంచిరేవులలో స్థిరపడ్డాడు. వర్మను ఆదిలాబాద్ ప్రాంతానికి చెందిన సింగారే ధర్మేందర్, కోమండ్ల శ్రీనివాస్, పెద్దపల్లి జిల్లాకు చెందిన ములుకుంట్ల సంజయ్‌కుమార్ హైదరాబాద్‌లో కలిసి లక్షలు పెడితే రూ.కోట్లలో రూపాయల వర్షం కురిపిస్తాం అంటూ నమ్మించారు.
మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో సిద్దేశ్వర్‌దత్తా, ప్రకాశ్ మరోత్రా మాధవి, దేవ్రో షిండే, ప్రశాంత్‌పట్టి పూజలు చేసి పైసల వర్షం కురిపిస్తారని చెప్పారు. రూ.21 లక్షలు పెడితే రూ.5 కోట్లు పైౖసల వర్షం కురిపిస్తామని నమ్మించారు. పూర్తిగా విశ్వసించిన వర్మ.. రూ.21 లక్షలు, ఓ బంగారు కాయిన్‌ను వారికిచ్చాడు. ఈనెల 25న చేవెళ్ల మండల పరిధిలోని ముడిమ్యాల్ అటవీ ప్రాంతానికి వర్మ, ముఠా సభ్యులంతా కలిసి కారు వచ్చారు. అప్పటికే అక్కడ వర్మకు తెలియకుండా దుండగులు మరో కారును ముందే తెప్పించుకొని దాచారు. పూజల పేరుతో పసుపు, కుంకుమలతో ముగ్గులు వేసి.. వాటిపై నిమ్మకాయలు, అగరబత్తీలు పెట్టారు. అనంతరం వర్మను పూజలో కూర్చోబెట్టి.. దుండగులు రూ.21లక్షలతో అక్కడి నుంచి పరారయ్యారు. మోసపోయానని గుర్తించిన బాధితుడు అదేరోజు చేవెళ్ల పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు.. ముఠాసభ్యుల్లో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు.