CRPF: ఒకే సీఆర్‌పీఎఫ్ బెటాలియన్‌కు సాగర్ రక్షణ..!
ABN , Publish Date - Apr 09 , 2025 | 05:12 AM
నాగార్జున సాగర్ డ్యామ్ రక్షణ బాధ్యతను ఇక నుంచి ఒక సీఆర్‌పీఎఫ్ బెటాలియన్‌కే పరిమితం చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్నది.

ములుగు బయలుదేరి వెళ్లిన 39వ బెటాలియన్
తెలంగాణ వైపు అదనంగా ఎస్పీఎఫ్ కాపలా
నాగార్జునసాగర్, ఏప్రిల్ 8 (ఆంధ్రజ్యోతి): నాగార్జున సాగర్ డ్యామ్ రక్షణ బాధ్యతను ఇక నుంచి ఒక సీఆర్‌పీఎఫ్ బెటాలియన్‌కే పరిమితం చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్నది. ఇప్పటి వరకూ తెలంగాణ వైపు సీఆర్‌పీఎఫ్ ములుగు బెటాలియన్, ఏపీ వైపు విశాఖ బెటాలియన్ బలగాలు కాపలా కాస్తున్నాయి. కానీ, కేంద్రం ఖర్చును తగ్గించుకోవడానికి సీఆర్‌పీఎఫ్ ములుగు బెటాలియన్‌ను ఉపసంహరించి.. సాగర్ డ్యామ్ రక్షణ బాధ్యతను పూర్తిగా విశాఖ బెటాలియన్‌కు అప్పగించింది. 39వ (ములుగు) బెటాలియన్ సిబ్బందిని వెనక్కి వెళ్లిపోవాలని ఈ నెల 6న కేఆర్‌ఎంబీ ఆదేశించింది.
ఎడమ వైపు డ్యాం రక్షణ బాధ్యతలు కూడా స్వీకరించాలని 234వ (విశాఖ) బెటాలియన్‌కు మంగళవారం కేఆర్‌ఎంబీ ఆదేశాలు జారీసింది. దీంతో డ్యామ్ రక్షణ బాధ్యతను 234వ బెటాలియన్ అధికారి శ్రీనివాసరావుకు ములుగు బెటాలియన్ అధికారి వీర రాఘవయ్య అప్పగించారు. కాగా, ములుగు బెటాలియన్ బలగాలు సాయంత్రం ములుగుకు బయలుదేరాయి. తెలంగాణ వైపు సీఆర్‌పీఎఫ్ విశాఖ బెటాలియన్‌తోపాటు ఎస్పీఎఫ్ బలగాలు కాపలా ఉంటాయి.