Share News

Central Cabinet Reshuffle: త్వరలో కేంద్ర క్యాబినెట్‌ పునర్వ్యవస్థీకరణ!

ABN , Publish Date - Aug 02 , 2025 | 04:27 AM

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ముగిశాక (ఆగస్టు 20 తర్వాత).. ఏ రోజైనా కేంద్ర మంత్రివర్గాన్ని పెద్ద ఎత్తున పునర్వ్యవస్థీకరించే అవకాశం ఉందని విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది.

Central Cabinet Reshuffle: త్వరలో కేంద్ర క్యాబినెట్‌ పునర్వ్యవస్థీకరణ!

  • పలువురు మంత్రులకు ఉద్వాసన?.. కూర్పుపై ఆరెస్సెస్‌ ప్రభావం

  • ఆగస్టు 15 తర్వాత బీజేపీ అధ్యక్షుడి ఎంపిక

  • దక్షిణాది నుంచి బీసీకి ఉపరాష్ట్రపతి పదవి లభించే అవకాశం?

  • మంత్రివర్గం నుంచి విముక్తి కల్పించండి: బండి సంజయ్‌

న్యూఢిల్లీ, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ముగిశాక (ఆగస్టు 20 తర్వాత).. ఏ రోజైనా కేంద్ర మంత్రివర్గాన్ని పెద్ద ఎత్తున పునర్వ్యవస్థీకరించే అవకాశం ఉందని విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. ఈ పునర్వ్యవస్థీకరణలో పలువురు మంత్రులకు ఉద్వాసన పలుకుతారని.. ముఖ్యంగా కొంతమంది మాజీ బ్యూరోక్రాట్లను పక్కన పెడతారని భావిస్తున్నారు. వారి స్థానంలో.. పార్టీలో చిరకాలం పనిచేసిన, సంఘ్‌కు సన్నిహితులైన వారికి స్థానం లభిస్తుందని, మంత్రివర్గ కూర్పుపై సంఘ్‌ ప్రభావం ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. విదేశాంగమంత్రి జైశంకర్‌తో పాటు హర్దీప్‌ పురి, అర్జున్‌ రాం మేఘ్వాల్‌, అశ్వినీ వైష్ణవ్‌.. బ్యూరోక్రసీ నుంచి వచ్చి మోదీ ప్రభుత్వంలో మంత్రులుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. వీరిలో ఎవరిని తప్పిస్తారన్న విషయం చర్చనీయాంశంగా మారింది. వీరు కాక అనేకమందిని పనితీరు ఆధారంగా తప్పించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. వారిలో కొందరికి జాతీయ స్థాయిలో, రాష్ట్రాల్లో పార్టీ బాధ్యతలను అప్పగించాలని యోచిస్తున్నారు. కాగా.. ఉపరాష్ట్రపతి పదవికి నామినేషన్లు దాఖలు చేసేందుకు తుది గడువు ఆగస్టు 21 కావడం వల్ల.. బీజేపీ తరఫున నామినేషన్‌ దాఖలు చేసేది ఎవరనే అంశంపై మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగేలోపే స్పష్టతరానుంది. ఆ పదవికి.. రాజ్‌నాథ్‌ సింగ్‌, జగత్‌ ప్రకాశ్‌ నడ్డా వంటివారి పేర్లు వినిపించడంతోపాటు దక్షిణాది నుంచి బీసీని నియమించాలనే ప్రతిపాదనపైనా మంతనాలు జరుగుతున్నాయి. ఇక ఆగస్టు 15 తర్వాత బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ కూడా ప్రారంభమవుతుందని, ఈ విషయంపై పార్టీ అగ్రనేతలకు మధ్య అవగాహన దాదాపు కుదిరినట్లేనని పార్టీ వర్గాలు తెలిపాయి. పార్టీ అధ్యక్ష పదవికి సంబంధించి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌, ధర్మేంద్రప్రధాన్‌, మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌, ప్రహ్లాద్‌ జోషి తదితరుల పేర్లు చర్చకు వస్తున్నాయి.


నాకొద్దీ మంత్రి పదవి..

కేంద్ర మంత్రివర్గం నుంచి తనకు విముక్తి కల్పించాల్సిందిగా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌.. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌ షాను కోరినట్లు తెలిసింది. ఈ బాధ్యతల కారణంగా తాను పార్టీలో క్రియాశీలంగా వ్యవహరించలేకపోతున్నానని.. తెలంగాణలో పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు పూర్తిస్థాయిలో కృషి చేయాలనుకుంటున్నానని వారికి ఆయన చెప్పినట్లు సమాచారం. సంఘ్‌ పెద్దల వద్ద కూడా బండి సంజయ్‌ తన మనోగతాన్ని వెల్లడించి వారి ఆమోదాన్ని పొందినట్టు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో మంత్రివర్గ పునర్వ్యస్థీకరణలో భాగంగా ఆయన స్థానంలో లక్ష్మణ్‌కు అవకాశం కల్పించే అవకాశం ఉన్నట్లు ఆ వర్గాలు వెల్లడించాయి. తెలంగాణలో ఇటీవల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన రాంచందర్‌రావుకు అండగా బండి సంజయ్‌ విస్తృతంగా రాష్ట్ర పర్యటనలు చేపడతారని.. ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణలో పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు ఆయన కృతనిశ్చయంతో ఉన్నారని ఆ వర్గాలు పేర్కొన్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

కాళేశ్వరంపై పీసీ ఘోష్ నివేదిక.. సీఎం రేవంత్‌రెడ్డికి సమర్పణ

సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌పై కొనసాగుతున్న విచారణ.. కస్టడీలో డాక్టర్ నమ్రత

Read latest Telangana News And Telugu News

Updated Date - Aug 02 , 2025 | 04:27 AM