Share News

Raja Singh: బీజేపీకి రాజాసింగ్‌ గుడ్‌బై

ABN , Publish Date - Jul 01 , 2025 | 04:03 AM

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి సోమవారం పార్టీ కార్యాలయంలో స్వయంగా అందజేశారు.

Raja Singh: బీజేపీకి రాజాసింగ్‌ గుడ్‌బై

పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా.. కిషన్‌రెడ్డికి రాజీనామా లేఖ అందజేత

  • నన్ను నామినేషన్‌ వేయనివ్వలేదు

  • అధ్యక్షుడి ఎన్నికపై క్యాడర్‌లో నిరాశ

  • హిందుత్వకు కట్టుబడిఉంటా: రాజాసింగ్‌

హైదరాబాద్‌/హైదరాబాద్‌ సిటీ, జూన్‌ 30 (ఆంధ్రజ్యోతి): బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి సోమవారం పార్టీ కార్యాలయంలో స్వయంగా అందజేశారు. పార్టీకి రాజీనామా చేసినందున ఎమ్మెల్యేగా తనను అనర్హుడిగా ప్రకటించాలంటూ స్పీకర్‌కు లేఖ రాయాలని కిషన్‌రెడ్డిని కోరారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. అధ్యక్ష పదవికి తాను కూడా నామినేషన్‌ వేస్తానని రెండు రోజుల క్రితమే ప్రకటించిన రాజాసింగ్‌.. ఈ మేరకు సోమవారం రాష్ట్ర కార్యాలయానికి వచ్చారు. అయితే తనకు మద్దతిచ్చే వారిని ‘పదవిలో ఉంటారా? సస్పెండ్‌ చేయాలా?’ అంటూ కొందరు బెదిరించారని, తద్వారా నామినేషన్‌ వేయకుండా తనను అడ్డుకున్నారని ఆరోపించారు. రాజీనామా అనంతరం రాజాసింగ్‌ మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ సంస్థాగత నియమావళి ప్రకారం తన అభ్యర్థిత్వానికి మద్దతిచ్చేందుకు 10 మంది రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యులు సిద్ధమయ్యారని, ముగ్గురు సంతకాలు చేశారని తెలిపారు. బెదిరింపుల కారణంగా మిగిలిన వారు సంతకాలు చేయలేదని చెప్పారు. ఎంతో మంది అర్హులైన నాయకులు ఉన్నా రాంచందర్‌రావును పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించాలనుకోవడం క్యాడర్‌ను నిరాశకు గురి చేసిందన్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్న సందర్భంలో ఈ నిర్ణయం ఎన్నో అనుమానాలకు తావిస్తోందని ఆరోపించారు. కొంతమంది ముఖ్యనేతలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం జాతీయ నాయకత్వాన్ని తప్పుదోవ పట్టించారన్నారు.


మీకో దండం.. మీ పార్టీకో దండం..

‘‘రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నా.. రావొద్దని కోరుకునే కొంతమంది పెద్దలు పార్టీలో జమ అయ్యారు. ఆ ఆకాంక్ష వారికే లేనప్పుడు మేమెంత కష్టపడ్డా లాభం లేదు. అందుకే అయ్యా మీకో దండం.. మీ పార్టీకో దండమని చెప్పాను’’ అని రాజాసింగ్‌ వివరించారు. పార్టీలో తాను 2014 నుంచి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని రాజీనామా లేఖలో పేర్కొన్నారు. తనతోపాటు తన కుటుంబం మొత్తం ఉగ్రవాదులకు టార్గెట్‌గా ఉందన్నారు. తాను బీజేపీకి రాజీనామా చేసినా.. హిందుత్వ సిద్ధాంతానికి మాత్రం కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. కాగా, రాజాసింగ్‌ను బుజ్జగించేందుకు కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ప్రయత్నించినా.. తన నిర్ణయంలో మార్పులేదని చెప్పి వెళ్లిపోయారు. రాజాసింగ్‌ రాజీనామాపై స్పందించేందుకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి నిరాకరించారు. అయితే ఆయన రాజీనామా లేఖను కిషన్‌రెడ్డి జాతీయ నాయకత్వానికి నివేదించనున్నారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ తెలిపారు. రాజాసింగ్‌ అభ్యర్థిత్వానికి పది మంది కూడా రాలేదని, అందుకే పార్టీని బద్‌నాం చేసి వెళ్లిపోయారని ఆరోపించారు. కాగా, పార్టీ నియమావళికి అనుగుణంగా అధ్యక్ష ఎన్నిక జరుగుతోందని బీజేపీ ఎమ్మెల్యే పాయల శంకర్‌ అన్నారు.


అప్పుడు సస్పెన్షన్‌.. ఇప్పుడు రాజీనామా

బీజేపీలో రాజాసింగ్‌ రూటే సెపరేటు అన్నట్లుగా ఉంటుంది. పార్టీ నిబంధనలకు విరుద్ధంగా సొంత అభిప్రాయాలు వ్యక్తపరుస్తుంటారు. పరోక్షంగా సీనియర్‌ నాయకులపైనే విమర్శలు చేస్తుంటారు. గతంలో కిషన్‌రెడ్డి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇద్దరి మధ్య పొసగలేదు. దీంతో ఆయన పార్టీ రాష్ట్ర కార్యాలయానికి రానని భీష్మించుకున్నారు. బండి సంజయ్‌ను అధ్యక్షుడిగా నియమించేంత వరకు పార్టీ ఆఫీసులోకి రాలేదు. పలుమార్లు రాష్ట్ర అధ్యక్షుడు, పార్టీ తీసుకున్న నిర్ణయాలను రాజాసింగ్‌ తప్పుబట్టారు. కార్పొరేషన్‌ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తన సూచించిన వారికి టికెట్‌ ఇవ్వలేదని ఆగ్రహించారు. పార్లమెంట్‌ ఎన్నికల సమయంలో కూడా పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. ఎన్నికల ప్రచారానికీ దూరంగా ఉన్నారు. ఓ వర్గం వారిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో పార్టీ ఆయనను సస్పెండ్‌ చేసింది. 14 నెలలపాటు పార్టీకి దూరంగా ఉంచింది. చివరికి ఎన్నికల టికెట్‌ కేటాయింపు సమయంలో సస్పెన్స్‌ను ఎత్తివేసి టికెట్‌ కేటాయించింది. తిరిగి ఎమ్మెల్యేగా గెలిచాక కూడా రాజాసింగ్‌ తీరు మారలేదు. సీనియర్లపై విమర్శలు ఆపలేదు. ఈ క్రమంలోనే రాష్ట్ర అధ్యక్ష పదవిపైనా కన్నేశారు. అది నెరవేరే అవకాశం కనిపించకపోవడం, రాష్ట్ర నాయకత్వం నిర్ణయం రుచించకపోవడంతో పార్టీకి రాజీనామా చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం..

పాశమైలారంలో పరిశ్రమ వద్ద ఉద్రిక్తత.. భారీగా పోలీసులు మోహరింపు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jul 01 , 2025 | 04:03 AM