Urban Bio Diversity Scam: ఏసీబీ వలలో బయో డైవర్సిటీ విభాగం డీడీ
ABN , Publish Date - Apr 16 , 2025 | 04:04 AM
శేరిలింగంపల్లి బయో డైవర్సిటీ విభాగ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్ రూ.70 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. మొక్కల పెంపకం బిల్లుపై సంతకం కోసం కాంట్రాక్టర్ వద్ద రూ.2.20 లక్షలు డిమాండ్ చేశారు

గచ్చిబౌలి, ఏప్రిల్15(ఆంధ్రజ్యోతి): కాంట్రాక్టరు నుంచి రూ.70వేలు లంచం తీసుకున్న శేరిలింగంపల్లి అర్బన్ బయో డైవర్సిటీ విభాగం డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివా్‌సను మంగళవారం ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. శ్రీనివాస్ చాంద్రాయణగుట్ట సర్కిల్ అర్బన్ బయో డైవర్సిటీ విభాగం ఇన్‌చార్జిగా కూడా విధులు నిర్వహిస్తున్నారు. చాంద్రాయణగుట్ట సర్కిల్‌లో మొక్కల పెంపకం, పార్కు అభివృద్ధి పనులు చేసిన ఓ కాంట్రాక్టర్‌కు రూ.44 లక్షల బిల్లులు రావాల్సి ఉంది. ఆయన శ్రీనివా్‌సను సంప్రదించగా ఫైల్‌పై సంతకం చేయాలంటే రూ. 2.20 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంగీకరించిన ఆ కాంట్రాక్టర్ రూ. లక్ష చెల్లించాడు. మరో రూ. 50 వేలు తన స్నేహితుడి ఫోన్ పే ద్వారా చెల్లించాడు. మిగతా రూ.70 వేలు తీసుకుని మంగళవారం శేరిలింగంపల్లి కార్యాలయానికి రావాలని శ్రీనివాస్ చెప్పాడు. దాంతో ఆ కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులను సంప్రదించాడు. ఆయన నుంచి శ్రీనివాస్ డబ్బులు తీసుకోగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ తెలిపారు.