Bhatti Vikramarka: ‘తెలంగాణ రైజింగ్’.. : భట్టి
ABN , Publish Date - Apr 26 , 2025 | 04:30 AM
రాష్ట్రంలోకి పెట్టుబడులను ఆహ్వానించేందుకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క విదేశీ ప్రతినిధులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ‘తెలంగాణ రైజింగ్’ నినాదంతో రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధి పనులను వెల్లడించారు.

రాష్ట్రంలోకి పెట్టుబడులను ఆహ్వానించేందుకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క విదేశీ ప్రతినిధులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ‘తెలంగాణ రైజింగ్’ నినాదంతో రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధి పనులను వెల్లడించారు. యంగ్ ఇండియా సమీకృత గురుకుల విద్యాలయాలు, స్కిల్స్ యూనివర్సిటీ, హరిత ఇంధన పాలసీ ద్వారా 2035 నాటికి 40 వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి, రీజనల్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్డు మధ్య ఏర్పాటు చేస్తున్న క్లస్టర్లు, ఫ్యూచర్ సిటీ, మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు, నాలెడ్జ్ ఐటీ హబ్, ఇందిరా గిరి జల వికాసం, రాజీవ్ యువ వికాసం తదితర అంశాలను వివరించారు. అభివృద్ధి విషయంలో దేశానికే రోల్ మోడల్‌గా నిలవబోతున్నామని చెప్పారు. దావోస్, జపాన్‌లలో సీఎం రేవంత్ పర్యటించి వేల కోట్ల విదేశీ పెట్టుబడులను ఆహ్వానించారని తెలిపారు. తెలంగాణలో పెట్టుబడుల కోసం లైఫ్ సైన్సెస్, టూరిజం, ఐటీ వంటి రంగాలు అనుకూలంగా ఉన్నాయని వివరించారు. విదేశీ ప్రతినిధులు తమ దేశాలు, సంస్థల ద్వారా తెలంగాణలో పెట్టుబడులు పెట్టించాలని కోరారు. వారికి ఎలాంటి సమస్యలు లేకుండా అన్ని రకాల అనుమతులను సులభంగా అందిస్తామని తెలిపారు.
ఈ సదస్సు చరిత్రలో నిలిచిపోతుంది..
కాంగ్రెస్ మూల సిద్ధ్దాంతాలైన సత్యం, అహింస, సామాజిక న్యాయం ఆధారంగా ప్రపంచ దేశాలకు దిశానిర్దేశం చేసేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం భారత్ సదస్సును నిర్వహిస్తోందని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. తొలిరోజు కార్యక్రమాలు ముగిశాక ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సదస్సు చరిత్రలో నిలిచిపోతుందన్నారు. రాష్ట్రంలో అభివృద్థి, సంక్షేమ కార్యక్రమాల అమలును ప్రపంచ దేశాలకు చాటి చెప్పామని తెలిపారు. సామాజిక న్యాయం, అభివృద్థిని మేళవించి కాంగ్రెస్ పార్టీ మూల సిద్థాంతాలను ఏ విధంగా ముందుకు తీసుకుపోతున్నామో వివరించామని చెప్పారు.
ప్రభుత్వ అభివృద్థి, సంక్షేమ కార్యక్రమాల పట్ల ప్రతినిధులు సంతోషాన్ని వ్యక్తం చేశారని భట్టి పేర్కొన్నారు. కాంగ్రెస్ అగ్రనేత సల్మాన్ ఖుర్షీద్ మాట్లాడుతూ.. ‘రైజింగ్ తెలంగాణ..’ ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు. సామాజిక న్యాయం అమలు దిశగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు.