Bhatti Vikramarka: ఇందిరమ్మ ఇళ్లు.. దేశానికే ఆదర్శం
ABN , Publish Date - Jul 07 , 2025 | 02:10 AM
ప్రజాప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు.

ఏడాదిలోనే పథకానికి రూ.22 వేల కోట్ల ఖర్చు
వచ్చే మూడేళ్లలో మరెన్నో పథకాలు అందిస్తాం
పుట్టగతులుండవనే ప్రతిపక్షాల ఆందోళన
కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నాయు: భట్టి విక్రమార్క
మధిరటౌన్, జూలై 6 (ఆంధ్రజ్యోతి): ప్రజాప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఒక్క ఏడాదిలోనే ఈ పథకానికి రూ.22 వేల కోట్లు ఖర్చు చేసి 4.5 లక్షల మంది పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ఖమ్మం జిల్లా మధిరలో ఆదివారం మధిర, బోనకల్, ఎర్రుపాలెం మండలాలకు చెందిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు పట్టాలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత పదేళ్లు అధికారంలో ఉన్న వారు ‘డబుల్‌బెడ్ రూం’ పేరుతో ప్రజలను మోసం చేశారని ఆరోపించారు.
ప్రజా ప్రభుత్వంలో పేదవాడి సొంత ఇంటి కల నెరవేర్చేందుకు సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రిగా తాను, సహచర మంత్రులమంతా ధృడసంకల్పంతో పనిచేస్తున్నామని తెలిపారు. రానున్న మూడున్నరేళ్లలో మరిన్ని అద్భుతమైన పథకాలు తీసుకువస్తామని చెప్పారు. తాము రోజుకు 18 గంటలు కష్టపడి పనిచేస్తూ గత పాలకులు చేసిన అప్పులు చెల్లిస్తూనే సంక్షేమాన్ని, అభివృద్ధిని ముందుకు తీసుకెళుతున్నామన్నారు. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలతో తమకు పుట్టగతులు ఉండవని ప్రతిపక్షాలు అందోళన చెంది కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నాయని ఆరోపించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా తాము ప్రజల కోసం నిటారుగా నిలబడతామని ఆయన పేర్కొన్నారు.