Bhatti Vikramarka: కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కొందరికే కొలువులు
ABN , Publish Date - Apr 22 , 2025 | 03:06 AM
కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కొందరికే కొలువులు దక్కాయని, గత పదేళ్లు అధికారంలో ఉన్నవారు యువతకు ఉద్యోగాలు కల్పించకుండా నిర్లక్ష్యం చేశారని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విమర్శించారు.

ఉద్యోగాల కల్పనలో గత పాలకుల నిర్లక్ష్యం
ప్రజా ప్రభుత్వంలో ఉపాధి అవకాశాలు
మధిర జాబ్‌మేళాలో డిప్యూటీ సీఎం భట్టి
మధిర టౌన్, ఏప్రిల్ 21 (ఆంధ్రజ్యోతి): కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కొందరికే కొలువులు దక్కాయని, గత పదేళ్లు అధికారంలో ఉన్నవారు యువతకు ఉద్యోగాలు కల్పించకుండా నిర్లక్ష్యం చేశారని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విమర్శించారు. ఖమ్మం జిల్లా మధిరలో సోమవారం ఏర్పాటు చేసిన మెగా జాబ్‌మేళాను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ప్రజాప్రభుత్వం మూడంచెల వ్యూహం అమలు చేస్తోందన్నారు. అందులో భాగంగా మొదటి దశలో ఇప్పటికే 56వేల ఉద్యోగాలను భర్తీ చేశామని, మరో 30వేల ఉద్యోగాల భర్తీకి కసరత్తు చేస్తున్నామని తెలిపారు.
రెండో దశలో మల్టీనేషనల్ కంపెనీలకు రాష్ట్రంలో అవసరమైన వనరులు కల్పించి భారీగా పెట్టుబడులను ఆకర్షించి తద్వారా యువతకు ఉద్యోగ అవకాశాలు లభించేలా చేస్తామన్నారు. మూడో దశలో రాజీవ్ యువ వికాసం ద్వారా రూ.9వేల కోట్లతో యువత తమకు నచ్చిన రంగంలో ఉపాధి పొందేందుకు అవకాశాలు కల్పించి, వారికి అవసరమైన శిక్షణ ఇప్పిస్తామన్నారు. జూన్ 2 నుంచి ఈ పథకాన్ని ప్రారంభిస్తామని తెలిపారు. ఈ జాబ్‌మేళా ద్వారా ఉద్యోగాలు పొందిన వారు జీవితంలో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని భట్టి ఆకాంక్షించారు. జాబ్ మేళాకు 5,287మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా వంద కంపెనీలు 2,235 మందికి నియామక పత్రాలు అందజేశాయి.