కొత్త పెన్షన్లు ఇవ్వండి!
ABN , Publish Date - Apr 21 , 2025 | 03:53 AM
చేయూత పథకం కింద కొత్తగా అర్హులైన వారిని గుర్తించి.. ప్రభుత్వం వారికి పెన్షన్లు మంజూరు చేయాలని యోగేంద్ర యాదవ్ నేతృత్వంలో భారత్ జోడో అభియాన్ బృందం సూచన చేసింది.

కౌలు రైతులు, కార్మికుల సమస్యలు పరిష్కరించండి
కులగణన సర్వే, ప్రజావాణి భేష్
గ్యారెంటీల అమలుపై ప్రజల్లో సంతృప్తి
టీపీసీసీ చీఫ్ మహే్‌షగౌడ్‌తో భేటీలో భారత్ జోడో అభియాన్ బృందం
హైదరాబాద్, ఏప్రిల్ 20 (ఆంధ్రజ్యోతి): చేయూత పథకం కింద కొత్తగా అర్హులైన వారిని గుర్తించి.. ప్రభుత్వం వారికి పెన్షన్లు మంజూరు చేయాలని యోగేంద్ర యాదవ్ నేతృత్వంలో భారత్ జోడో అభియాన్ బృందం సూచన చేసింది. అలాగే కౌలు రైతుల సమస్యల పరిష్కారంపైనా దృష్టి పెట్టాలంది. గిగ్ వర్కర్ల తరహాలో అసంఘటిత రంగ కార్మికుల సమస్యల పరిష్కారం కోసమూ ఒక చట్టాన్ని తీసుకురావాలని కోరింది. టీపీసీసీ చీఫ్ మహే్‌షకుమార్ గౌడ్‌ను కలిసిన యోగేంద్రయాదవ్ బృందం.. ఈమేరకు సూచనలు చేసింది. యోగేంద్ర యాదవ్‌తో పాటు ఈ సమావేశంలో బృందం సభ్యులు విస్సా కిరణ్‌కుమార్, గిగ్, ప్లాట్‌ఫాం వర్కర్స్ యూనియన్ నేత సలావుద్దీన్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం పనితీరుపై క్షేత్రస్థాయిలో తాము సేకరించిన వివరాలను టీపీసీసీ చీఫ్‌తో వారు పంచుకున్నారు. కొన్ని అంశాలు మినహాయిస్తే ఆరు గ్యారెంటీల అమలుపై ప్రజల్లో సంతృప్తి నెలకొని ఉందని యోగేంద్ర యాదవ్ బృందం సభ్యులు తెలిపారు. గతంతో పోలిస్తే సమస్యలపై అధికారులను కలిసినప్పుడు వారు మెరుగ్గా స్పందిస్తున్నారన్న భావన ప్రజ ల్లో వ్యక్తమవుతోందన్నారు.
ప్రజలు సమస్యలు చెప్పుకోవడానికి ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమం నిర్వహణ పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. దీన్ని వికేంద్రీకరించి జిల్లా, మండల స్థాయుల్లోనూ నిర్వహించాలని సూచించారు. ఎన్నికల ముందు కౌలు రైతుల సమస్యల పరిష్కారంపై స్పష్టమైన హామీలు ఇచ్చార ని, వాటి పరిష్కారంపై దృష్టి పెట్టాలని సూచించారు. వారికి ఎల్‌ఈసీ కార్డుల మంజూరుపై దృష్టి పెట్టాలన్నారు. ప్రజాసంఘాలు, విద్యార్థులకు నిరసనలు తెలి పే స్వేచ్ఛ కల్పించాలన్నారు. గత ప్రభుత్వంతో పోలి స్తే మెరుగ్గా ఉన్నప్పటికీ.. పలు సందర్భాల్లో నిరసనకారుల పట్ల పాత పద్ధతిలోనే వ్యవహరించారని, అలాంటివి పునరావృతం కాకుండా చూడాలన్నారు. ప్రభుత్వం నిర్వహించిన ఆర్థిక, సామాజిక, రాజకీయ కులగణన సర్వేను తాము స్వాగతిస్తున్నామని చెప్పారు. సర్వే వివరాలను ప్రకటించి.. పరిష్కారం కోసం ప్రభుత్వం ఏం చేయనుందో కూడా వెల్లడించాలని సూచించారు. ఈ విషయంలో ప్రభుత్వం కోరితే తమ వంతు సహకారమూ ఉంటుందన్నారు. మహిళల సమస్యలపైనా ప్రత్యేకంగా దృష్టి పెట్టాలన్నారు. కాగా.. వృద్ధాప్య.. వితంతు, వికలాంగ తదితర పెన్షన్లకు కొత్తగా అర్హులైన వారు రాష్ట్రంలో లక్షల సంఖ్యలో ఉన్నారని, ముందుగా వారిని గుర్తించి పెన్షన్లు జారీ చేయాలని సూచించారు. యోగేంద్ర యాదవ్ బృందం సూచనలు సావధానంగా విన్న టీపీసీసీ చీఫ్.. సంబంధిత శాఖల మంత్రులతో సమావేశాన్ని ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు.
Also Read:
క్రికెట్ ఆడుతోండగా పిడుగు పడి.. యువకులు మృతి
థాకరే, రాజ్ మధ్య సయోధ్యపై బీజేపీ ఆసక్తికర వ్యాఖ్యలు
గుజరాత్‌లో పటేల్ విగ్రహాన్ని పరిశీలించిన మంత్రి
For More Telangana News and Telugu News..