Share News

Cancer Treatment: బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రి విస్తరణ

ABN , Publish Date - Feb 16 , 2025 | 04:55 AM

పెరుగుతున్న క్యాన్సర్‌ రోగుల సంఖ్యను దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్‌లోని బసవతారకం ఇండో అమెరికన్‌ క్యాన్సర్‌ ఆస్పత్రిని విస్తరిస్తున్నామని, త్వరలోనే ఆంధ్రప్రదేశ్‌ రాజధాని ప్రాంతంలో ఆస్పత్రి నిర్మాణం ప్రారంభిస్తామని ఆ ఆస్పత్రి, రీసెర్చి ఇన్‌స్టిట్యూట్‌ చైర్మన్‌ నందమూరి బాలకృష్ణ తెలిపారు.

Cancer Treatment: బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రి విస్తరణ

  • పీడియాట్రిక్‌ ఐసీయూ, వార్డు ప్రారంభం

  • చిన్నారుల కోసం ప్రత్యేకంగా సహాయ నిధి

  • త్వరలో ఏపీలోనూ ఆస్పత్రి నిర్మాణం

హైదరాబాద్‌ సిటీ, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి): పెరుగుతున్న క్యాన్సర్‌ రోగుల సంఖ్యను దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్‌లోని బసవతారకం ఇండో అమెరికన్‌ క్యాన్సర్‌ ఆస్పత్రిని విస్తరిస్తున్నామని, త్వరలోనే ఆంధ్రప్రదేశ్‌ రాజధాని ప్రాంతంలో ఆస్పత్రి నిర్మాణం ప్రారంభిస్తామని ఆ ఆస్పత్రి, రీసెర్చి ఇన్‌స్టిట్యూట్‌ చైర్మన్‌ నందమూరి బాలకృష్ణ తెలిపారు. ప్రపంచ చిన్నారుల క్యాన్సర్‌ రోజును పురస్కరించుకుని శనివారం ఆస్పత్రిలో కొత్త పీడియాట్రిక్‌ ఐసీయూ, వార్డును, క్యాన్సర్‌తో పోరాడుతున్న చిన్నారుల కోసం ప్రత్యేక సహాయ నిధిని ప్రారంభించారు. ఈ నిధి ద్వారా పేద కుటుంబాల చిన్నారుల చికిత్సకు ఆర్థిక సహాయం అందించనున్నారు.


దాతలు ఈ నిధికి తోడ్పాటు అందించాలని బాలకృష్ణ విజ్ఞప్తి చేశారు. 12 పడకలతో ప్రారంభమైన పీడియాట్రిక్‌ వార్డును ప్రస్తుతం 120 పడకలకు విస్తరించామని చెప్పారు. సాధారణ కీమోథెరపీ నుంచి అత్యాధునిక బీఎంటీ చికిత్స వరకూ ఆస్పత్రిలో అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. క్యాన్సర్‌తో పోరాడుతున్న చిన్నారులకు దాదాపు 200పైగా బీఎంటీ చికిత్సలు అందించామని, ఇది దేశంలోనే అత్యధికమని తెలిపారు. చికిత్స పొందుతున్న చిన్నారులకు బాలకృష్ణ బహుమతులు అందజేశారు.

Updated Date - Feb 16 , 2025 | 04:55 AM