Basara: ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా బాసర
ABN , Publish Date - Jul 13 , 2025 | 04:18 AM
బాసర సరస్వతీదేవి క్షేత్రాన్ని దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందేలా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర దేవాదాయ, అటవీశాఖ మంత్రి కొండా సురేఖ, కార్మికశాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు.

మంత్రులు కొండా సురేఖ, వివేక్ వెంకటస్వామి
నిర్మల్, జూలై 12 (ఆంధ్రజ్యోతి): బాసర సరస్వతీదేవి క్షేత్రాన్ని దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందేలా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర దేవాదాయ, అటవీశాఖ మంత్రి కొండా సురేఖ, కార్మికశాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. బాసరలో టీటీడీ ఆధ్వర్యంలో రూ.9.30 కోట్ల వ్యయంతో నిర్మించిన వంద గదుల ధార్మిక వసతి గృహాలను, రూ.3.48 కోట్లతో నిర్మించిన కార్యనిర్వాహక అధికారి (ఈవో) కార్యాలయ నూతన భవనాన్ని మంత్రులు శనివారం ప్రారంభించారు. సరస్వతి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మంత్రులు మీడియాతో మాట్లాడారు.
వ్యాస మహర్షి తపస్సు చేసిన ఈ ప్రాంతాన్ని ఆధ్యాత్మికతతో పాటు పర్యాటక హబ్‌గా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా సీఎం రేవంత్‌రెడ్డి చర్యలు తీసుకుంటున్నారని మంత్రి కొండా సురేఖ తెలిపారు. త్వరలోనే ఆలయానికి రెగ్యులర్ ఈవోను, అవసరమైన సిబ్బందిని నియమించనున్నట్టు వెల్లడించారు. మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ... బాసర పుణ్యక్షేత్రాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం పటిష్ఠ చర్యలు తీసుకుంటోందని తెలిపారు. కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని వారికి ఉద్యోగ భద్రత, కనీస వేతనాలు అందించేలా చర్యలు చేపడతామని, అందుకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు.