Bandi Sanjay: కరీంనగర్‌లో రాజకీయాలు చేయను
ABN , Publish Date - Jul 27 , 2025 | 05:02 AM
కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో రాజకీయాలు చేయబోనని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు.

పొన్నంతో కలిసి అభివృద్ధికి కృషి చేస్తా
కేంద్ర మంత్రి సంజయ్
హుస్నాబాద్, జూలై 26 (ఆంధ్రజ్యోతి): కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో రాజకీయాలు చేయబోనని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. శనివారం ఆయన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో మోదీ గిఫ్ట్ పేరిట నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల పదో తరగతి విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ ప్లాస్టిక్ నిర్మూలనకు మంత్రి పొన్నం నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో స్టీల్ బ్యాంకులు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.
తాను కూడా పేదరికంలో పుట్టానని, శిశుమందిర్‌లో చదువుకుంటున్నప్పుడు సైకిల్ కొనే స్థోమత లేక కిరాయికి తీసుకునేవాడినని గుర్తుచేసుకున్నారు. విద్యార్థులు గల్లా ఎగురేసుకునేలా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తానని చెప్పారు. అతి త్వరలో నర్సరీ నుంచి 6వ తరగతి వరకు చదివే విద్యార్థులకు మోదీ కిట్లు ఇవ్వబోతున్నామని తెలిపారు. గత యూపీఏ ప్రభుత్వం విద్యారంగానికి 2014-15 బడ్జెట్‌లో రూ.68,728 కోట్లు కేటాయిస్తే.. గడచిన 11 ఏళ్లలో మోదీ ప్రభుత్వం రూ.8 లక్షల కోట్లు కేటాయించిందని చెప్పారు.