Share News

Bandi Sanjay: నేషనల్‌ హెరాల్డ్‌ ఆస్తులను కాజేసేందుకు.. డూప్లికేట్‌ గాంధీ కుటుంబం కుట్ర

ABN , Publish Date - Apr 19 , 2025 | 05:25 AM

సోనియాగాంధీ కుటుంబం డూప్లికేట్‌ గాంధీ కుటుంబమని, నేషనల్‌ హెరాల్డ్‌కు చెందిన రూ.వేల కోట్ల ఆస్తులను కాజేసేందుకు కుట్ర పన్నిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ ఆరోపించారు.

Bandi Sanjay: నేషనల్‌ హెరాల్డ్‌ ఆస్తులను కాజేసేందుకు.. డూప్లికేట్‌ గాంధీ కుటుంబం కుట్ర

  • రాజ్యాంగానికి, చట్టాలకు వారేమైనా అతీతులా?

  • విచారణ ప్రారంభమైంది యూపీఏ హయాంలోనే

  • మజ్లిస్‌ సభకు రేవంత్‌ సర్కారు ఆర్థికసాయం

  • బెంగాల్‌ తరహా పరిస్థితులు తలెత్తే ప్రమాదం

  • అల్లర్లు జరిగితే ప్రభుత్వానిదే బాధ్యత: బండి సంజయ్‌

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 18 (ఆంధ్రజ్యోతి): సోనియాగాంధీ కుటుంబం డూప్లికేట్‌ గాంధీ కుటుంబమని, నేషనల్‌ హెరాల్డ్‌కు చెందిన రూ.వేల కోట్ల ఆస్తులను కాజేసేందుకు కుట్ర పన్నిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ ఆరోపించారు. ఆ కుటుంబం ఏమైనా రాజ్యాంగానికి అతీతమా? ఇటలీ మూలాలున్నందున భారతీయ చట్టాలు వర్తించవనుకుంటున్నారా? అని మండిపడ్డారు. నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో హీరో, విలన్‌, జోకర్‌, బ్రోకర్‌ అంతా కాంగ్రెస్సేనన్నారు. శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సంజయ్‌ మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘‘కాంగ్రెస్‌ పార్టీ వాళ్లదే. నేషనల్‌ హెరాల్డ్‌ పేపర్‌ వాళ్లదే. యంగ్‌ ఇండియా ట్రస్ట్‌ వాళ్లదే. నష్టాల పేరుతో రూ.90 కోట్లు అప్పు ఇచ్చింది వాళ్లే. యంగ్‌ ఇండియా ట్రస్ట్‌ పెట్టి ఆ సంస్థ ఆస్తులను కొట్టేయాలనుకుంది వాళ్లే. దీనిపై ఈడీ, సీబీఐ విచారణ ప్రారంభమైందీ యూపీఏ హయాంలోనే. కోర్టుకు వెళ్లి బెయిల్‌ తెచ్చుకుందీ వారి హయాంలోనే. ఇందులో ప్రధాని మోదీకి, బీజేపీకి ఏం సంబంధం?’’ అని అన్నారు. 2013లో యూపీఏ ప్రభుత్వ ఆదేశాల మేరకే సీబీఐ ఈ కేసులో దర్యాప్తు ప్రారంభించిందని, అరెస్ట్‌ కాకుండా బెయిల్‌ తెచ్చుకుని బయట ఉన్న నిందితులు సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీలేనని సంజయ్‌ తెలిపారు. ఈ కేసు విచారణ పూర్తి చేసిన ఈడీ.. ఇటీవల చార్జిషీట్‌ దాఖలు చేసిందన్నారు. నేషనల్‌ హెరాల్డ్‌ పత్రికలో 5వేల మంది స్వాతంత్య్ర సమరయోధులు వాటాదారులుగా ఉన్నారని, ఆ ఆస్తుల్లో కాంగ్రెస్‌ కార్యకర్తలకు సైతం వాటా ఉందని అన్నారు. కాంగ్రెస్‌ నేతలు ధర్నా చేయాల్సింది ఈడీ ఆఫీస్‌ ముందు కాదని, ఆ ఆస్తులను కాజేసేందుకు కుట్ర చేసిన సోనియాగాంధీ నివాసం ఎదుట అని సూచించారు. హైదరాబాద్‌లో ధర్నా సందర్భంగా ప్రధాని పట్ల, కేంద్రమంత్రి పట్ల గౌరవం లేకుండా బూతులు మాట్లాడిన కాంగ్రెస్‌ నేతలను ఏమి అనాలో మీనాక్షి నటరాజన్‌, డిప్యూటీసీఎం భట్టివిక్రమార్క సమాధానంచెప్పాలన్నారు. తెలంగాణలో కూడా యంగ్‌ ఇండియా బ్రాండ్‌ లాగా ఫోర్త్‌ సిటీ పేరుతో 50 వేల కోట్ల దోపిడీకి రంగం సిద్ధం చేశారని ఆరోపించారు.


ఇక్కడా బెంగాల్‌ తరహా అల్లర్లకు అవకాశం..

వక్ఫ్‌ చట్ట సవరణకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ పార్టీ ఆర్థికసాయంతోనే ఎంఐఎం ఆందోళనలు చేస్తోందని బండి సంజయ్‌ ఆరోపించారు. శనివారం ఎంఐఎం నిర్వహించనున్న సభకు కర్త, కర్మ, క్రియ.. రేవంత్‌ సర్కారేనన్నారు. పశ్చిమ బెంగాల్‌లో అక్కడి సీఎం మమతా బెనర్జీ కూడా ఈ చట్ట సవరణను వ్యతిరేకించారని, ఫలితంగా అక్కడ అల్లర్లు చెలరేగాయని తెలిపారు. తెలంగాణలో కూడా అలాంటి పరిస్థితి తలెత్తే ప్రమాదం ఉందని, దానిని రేవంత్‌ సర్కార్‌ కూడా నియంత్రించే అవకాశం ఉండదని హెచ్చరించారు. శాంతిభద్రతలకు భంగం వాటిల్లితే రేవంత్‌ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ముఖ్యమంత్రికి దమ్ముంటే తెలంగాణలో వక్ఫ్‌ ఆస్తులు, ఆదాయంపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. వక్ఫ్‌ ఆస్తుల్లో మజ్లిస్‌ నేతలు నిర్మించిన ఆస్పత్రుల్లో వైద్యం ఉచితంగా ఎందుకు అందించడం లేదని ప్రశ్నించారు. పైగా ఆ ఆస్పత్రుల నుంచి ఉగ్రవాదులను తయారు చేస్తున్నారని ఆరోపణ చేశారు. హైదరాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ కార్పొరేటర్లు మజ్లి్‌సకు వ్యతిరేకంగా ఓటేస్తేనే ఆ పార్టీకి దూరంగా ఉన్నట్లు అని పేర్కొన్నారు. ఇక సీఎం రేవంత్‌ జపాన్‌ పర్యటన కూడా దావోస్‌ పర్యటన లాగే అవుతుందని ఎద్దేవా చేశారు. దావోస్‌ వెళ్లివచ్చిన తర్వాత రూ.లక్ష కోట్ల పెట్టుబడులు తెచ్చినట్లు ప్రకటించుకున్నారని, కానీ.. ఎంతమేర వచ్చాయో అందరికీ తెలుసునని వ్యాఖ్యానించారు. కాగా, బండి సంజయ్‌ రాజ్‌భవన్‌లో గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మను కలుసుకున్నారు. సుమారు అరగంటపాటు భేటీ అయ్యారు. ఈ భేటీ మర్యాదపూర్వకమేనని సంజయ్‌ కార్యాలయం వెల్లడించింది.

Updated Date - Apr 19 , 2025 | 05:25 AM