AI: కృత్రిమ మేధతో కలుపుతీసే యంత్రం
ABN , Publish Date - Apr 22 , 2025 | 04:07 AM
కృత్రిమ మేధ(ఏఐ)తో కలుపు తీసే రోబోట్‌ను సంగారెడ్డి జిల్లా రుద్రారంలో ఉన్న గీతం విశ్వవిద్యాలయం బీటెక్ చివరి ఏడాది విద్యార్థి సి.అమూల్య, ఆమె బృంద సభ్యులు అభివృద్ధి చేశారు.

స్వయం ప్రతిపత్తి రోబోను ఆవిష్కరించిన గీతం విద్యార్థిని
పటాన్‌చెరు రూరల్, ఏప్రిల్ 21 (ఆంధ్రజ్యోతి ) : కృత్రిమ మేధ(ఏఐ)తో కలుపు తీసే రోబోట్‌ను సంగారెడ్డి జిల్లా రుద్రారంలో ఉన్న గీతం విశ్వవిద్యాలయం బీటెక్ చివరి ఏడాది విద్యార్థి సి.అమూల్య, ఆమె బృంద సభ్యులు అభివృద్ధి చేశారు. ఇది హానికరమైన కలుపు మందులపై ఆధారపడటాన్ని తగ్గించడమే కాక మానవ శ్రమను గణనీయంగా తగ్గిస్తుంది. సెన్సార్ ఫ్లో లైట్ ద్వారా కలుపు మొక్కలను గుర్తించి తొలగించేలా స్వయంప్రతిపత్తి రోబోను తమ బృందం అభివృద్ధి చేసినట్టు అమూల్య వివరించారు.
దీన్ని మెరుగుపరిచి జీపీఎస్ సాయంతో, సౌరశక్తితో పనిచేసేలా, మరిన్ని పంట రకాలకు అనుకూలంగా అభివృద్ధి చేయనున్నామని వెల్లడించారు. ఈ ప్రాజెక్టుకు ఈఈసీఈ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సీహెచ్. ప్రవీణ్ కుమార్ మార్గదర్శనం చేయగా తన బృంద సభ్యులు కె.మణికంఠ, శివ ధనుష్ ముసునూరి సహకరించినట్లు ఆమె తెలిపారు.