Share News

AI in Govt Hospitals: ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏఐ

ABN , Publish Date - Apr 07 , 2025 | 04:14 AM

ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృత్రిమ మేధ (ఏఐ)ను వినియోగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సాంకేతికతను ఎక్స్‌రే, ఈసీజీ విశ్లేషణకు ఉపయోగించడానికి కసరత్తు ప్రారంభించారు

AI in Govt Hospitals: ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏఐ

  • కృత్రిమ మేధ సాయంతో ఈసీజీ, ఎక్స్‌రేల విశ్లేషణ

  • కసరత్తు ప్రారంభించిన వైద్య ఆరోగ్య శాఖ

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 6 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులకు మరింత మెరుగైన వైద్యసేవలు అందించడంపై రాష్ట్ర సర్కారు దృష్టి పెట్టింది. వైద్య సిబ్బంది, నిపుణుల కొరత వల్ల రోగులు ఇబ్బంది పడకూడదనే ఆలోచనతో వైద్యసేవల్లో కృతిమ మేధ (ఏఐ)ను వినియోగించాలని నిర్ణయించింది. ఈ మేరకు కసరత్తును ఇప్పటికే ప్రారంభించిన వైద్య, ఆరోగ్య శాఖ.. రాష్ట్ర ఐటీ విభాగం సహకారం తీసుకోవాలని అనుకుంటుంది. వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు ఐటీ విభాగంతో త్వరలోనే సమావేశం కానున్నారు. మరోపక్క, ఏఐని వినియోగిస్తున్న ప్రైవేటు, కార్పొరేట్‌ ఆస్పత్రుల యాజమాన్యాలతో ఇప్పటికే సమావేశమైన వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు వివిధ అంశాలపై చర్చించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏఐ సేవలు అందుబాటులోకి తేవాలని వైద్యఆరోగ్యశాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్‌ చోంగ్థు కూడా పట్టుదలగా ఉన్నారు. వైద్య, ఆరోగ్య శాఖ తొలుత ఎక్స్‌రేలు, ఈసీజీల విశ్లేషణకు ఏఐని వినియోగించాలని భావిస్తోంది. క్రమంగా మిగిలిన విభాగాలకు ఏఐ సేవలను విస్తరించాలని అనుకుంటోంది.


ప్రస్తుతం నిమ్స్‌ ఆస్పత్రి పాథాలజీ విభాగంలో ఏఐ సేవలను వినియోగిస్తున్నారు. రోగుల నివేదికలను ఏఐ విశ్లేషించి, అసాధారణ రిపోర్టులను గుర్తించి వైద్యులకు తెలియజేస్తుంది. ఈ ప్రక్రియలో మరింత కచ్చితత్వం కోసం ఎదురుచూస్తున్నామని నిమ్స్‌ డైరెక్టర్‌ బీరప్ప వెల్లడించారు. అయితే, నిమ్స్‌ మాదిరిగానే ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎక్స్‌రేలు, ఈసీజీల పరిశీలన, విశ్లేషణకు ఏఐను వినియోగించాలని వైద్య శాఖ భావిస్తుంది. ఏదైనా ఆస్పత్రిలో వైద్యులు.. రోగులకు ఎక్స్‌రే, ఈసీజీలు సిఫారసు చేస్తే.. సదరు రిపోర్టులు ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన సాఫ్ట్‌వేర్‌ ద్వారా హైదరాబాద్‌లోని ఐటీ సెల్‌కు వస్తాయి. ఐటీ సెల్‌కు చెందిన ఏఐ ఆ రిపోర్టులను విశ్లేషించి వాటిలో అసాధారణంగా ఉన్న వాటిని గుర్తిస్తుంది. సదరు రిపోర్టు ప్రకారం రోగి ఎదుర్కొంటున్న సమస్యపై పూర్తి విశ్లేషణ చేసి సిఫారసులు చేస్తుంది. ఈ సిఫారసుల ఆధారంగా వైద్యులు లేదా వైద్య సిబ్బంది రోగులకు చికిత్స అందించడం లేదా మెరుగైన వైద్యం కోసం పెద్ద ఆస్పత్రులకు సిఫారసు చేయడమో చేస్తారు. దీంతో వైద్య సేవల్లో వేగం పెరగనుంది.


ఈ వార్తలు కూడా చదవండి..

HCU Land: హెచ్‌సీయూ వివాదంలో నిజాలు ప్రచారం చేయండి

No Exam: ఈ అర్హత చాలు.. పరీక్ష లేకుండా ఉద్యోగం.. నెలకు రూ. 2 లక్షల జీతం

Water Conflict: నీటి పంచాయతీ.. అధికారులతో ఉత్తమ్ కీలక భేటీ

Healthy Soup: ఈ సూప్‌తో మీ శరీరంలో కొన్ని భాగాలకు ఊహించని శక్తి పక్కా

Cotton Clothing: కాటన్ దుస్తులు.. ఒరిజినలా? కాదా? ఎలా గుర్తించాలంటే..

Fake Cardiologist: ఏడుగురి ఉసురు తీసిన వైద్యుడు.. విచారణకు రంగం సిద్ధం

శ్రీలీలకి చేదు అనుభవం.. చెయ్యి పట్టుకుని లాగిన యువకులు

కేసు No.62.. సుప్రీంకోర్టులో మిథున్ రెడ్డి పిటిషన్ పై విచారణ

For Telangana News And Telugu News

Updated Date - Apr 07 , 2025 | 04:14 AM