Share News

Aghori Arrested: చంచల్‌గూడ జైలుకు అఘోరీ

ABN , Publish Date - Apr 24 , 2025 | 05:20 AM

మహిళా సినీ నిర్మాతను మోసగించిన కేసులో అఘోరీని అరెస్టు చేసిన పోలీసులు, లింగనిర్ధారణ పరీక్ష అనంతరం చంచల్‌గూడ జైలుకు తరలించారు. అతని భార్య శ్రీవర్షిని కస్తూర్బా గాంధీ హోంకు తరలించి, అఘోరీ జైలులో ఉంటాడని పేర్కొన్నాడు

Aghori Arrested: చంచల్‌గూడ జైలుకు అఘోరీ

  • హైదర్‌షాకోట్‌లోని కస్తూర్బా గాంధీ హోంకు అఘోరీ భార్య తరలింపు

శంకర్‌పల్లి, కంది, ఏఫ్రిల్‌ 23(ఆంధ్రజ్యోతి): ఓ మహిళా సినీ నిర్మాతను మోసగించిన కేసులో అఘోరీని మోకిల పోలీసులు అరెస్టు చేశారు. భార్య శ్రీవర్షితో కలిసి అఘోరీ కారులో హరిద్వార్‌ వెళ్తుండగా పోలీసులు ఉత్తరప్రదేశ్‌లో అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి నార్సింగి పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు. అఘోరీని ఏసీపీ రమణగౌడ్‌ ఆధ్వర్యంలో రెండు గంటలపాటు విచారించాక చేవెళ్ల ప్రభుత్వాసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించారు. అనంతరం చేవెళ్ల కోర్టులో న్యాయమూర్తి ఎదుట హాజరుపరుచగా, న్యాయమూర్తి 14రోజుల రిమాండ్‌ విధించడంతో సంగారెడ్డి జిల్లా కంది సబ్‌జైలుకు తరలించారు. అంతకు ముందు అఘోరీని ఏ బ్యారక్‌లో ఉంచాలో తేల్చుకోలేక కంది జైలు అధికారులు తలలు పట్టుకున్నారు.


మహిళా ఖైదీలు ఉండే బ్యారెక్‌లో ఉంచాలా.. లేక పురుష ఖైదీలు ఉండే బ్యారక్‌లో ఉంచాలా అనే విషయంపై తేల్చుకోలేక తిరిగి పోలీసులకు అప్పగించారు. దీంతో పోలీసులు చేవెళ్ల ప్రభుత్వాసుపత్రికి తరలించి లింగనిర్ధారణ పరీక్షలు చేయించారు. వైద్యుల పరీక్షల్లో అఘోరీ ట్రాన్స్‌జెండర్‌ అని తేలడంతో కోర్టు సూచన మేరకు చంచల్‌గూడ జైలుకు తరలించారు. అఘోరీ భార్య శ్రీవర్షి తల్లిదండ్రులతో వెళ్లేందుకు నిరాకరించడంతో ఆమెను హైదర్‌షాకోట్‌లో గల కస్తూర్బా గాంధీ హోంకు తరలించారు. అయితే తన భార్య శ్రీవర్శిని తనతోపాటే జైలులో ఉండాలని, విచారణలో పోలీసులకు సహకరిస్తామని అఘోరీ చెప్పడం గమనార్హం.

Updated Date - Apr 24 , 2025 | 05:20 AM