Share News

Uppal Stadium: ఉప్పల్‌ స్టేడియానికి దారేదీ

ABN , Publish Date - Jul 09 , 2025 | 05:17 AM

హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌కు చెందిన ఉప్పల్‌ క్రికెట్‌ స్టేడియానికి పెద్ద కష్టం వచ్చిపడింది.

Uppal Stadium: ఉప్పల్‌ స్టేడియానికి దారేదీ

  • స్టేడియం పక్కనున్న స్థలం కార్పొరేట్‌ సంస్థ చేతికి

  • స్టేడియంలో ఐదు గేట్లు మూస్తూ గోడ నిర్మాణం

  • పార్కింగ్‌ స్థలం గల్లంతు

ఉప్పల్‌, జూలై 8 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌కు చెందిన ఉప్పల్‌ క్రికెట్‌ స్టేడియానికి పెద్ద కష్టం వచ్చిపడింది. భవిష్యత్తులో ఇక్కడ మ్యాచ్‌లు జరపడం కుదురుతుందా? అనే పరిస్థితి తలెత్తుతోంది. స్టేడియం చుట్టూ ఖాళీగా ఉన్న స్థలం ఓ కార్పొరేట్‌ సంస్థ చేతికి వెళ్ళిపోయింది. స్టేడియంలోకి వెళ్ళేందుకు ఉపయోగిస్తున్న కొన్ని దారులతో పాటు, పార్కింగ్‌ కోసం ఉపయోగిస్తున్న స్థలాన్ని కూడా ఆ సంస్థ ఒక బ్యాంకు నిర్వహించిన వేలంలో కొనేసింది. తాజాగా ఆ దారులను మూస్తూ చకచకా ప్రీకాస్ట్‌ వాల్‌తో ప్రహరీగోడను నిర్మిస్తోంది. స్టేడియం చుట్టూ 11 గేట్లు ఉంటే సుమారు 5 గేట్లు మూస్తూ ప్రహరీ గోడ నిర్మాణం చేపట్టారు. ఇప్పటిదాకా క్రికెట్‌ మ్యాచ్‌లు జరుగుతున్న సమయంలో ప్రేక్షకుల కార్లు, బైకులు పార్కు చేస్తున్న స్థలాన్ని కూడా సదరు కంపెనీ స్వాధీనం చేసుకోవడంతో ఇప్పటిదాకా దేశంలో అత్యంత సౌకర్యవంతమైన స్టేడియాల్లో ఒకటైన ఉప్పల్‌ క్రికెట్‌ స్టేడియం ఇక ఇరుకు స్టేడియంగా మారనుంది.

అసలు స్థల వివాదం ఏంటి?

ఉప్పల్‌ పారిశ్రామిక వాడ కోసం 500 ఎకరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఏసీఐఐసీకి కేటాయించింది. స్థలాన్ని అభివృద్ధి చేసి, కంపెనీలకు ఇచ్చినపుడు పెంగ్విన్‌ టెక్స్‌టైల్స్‌ 46 ఎకరాలు దక్కించుకుంది. చాలా సంవత్సరాలు నడిచిన కంపెనీ తర్వాత కాలంలో మూత పడింది. చేసిన అప్పును తీర్చలేక యాజమాన్యం భూమితో సహా ఫ్యాక్టరీని బ్యాంకుకు వదిలి వెళ్లింది.


స్థలాన్ని బ్యాంక్‌ వేలం వేసింది. అప్పటికే అందులో 16 ఎకరాలను ఏపీఐఐసీ ఉప్పల్‌ క్రికెట్‌ స్టేడియానికి కేటాయించడంతో బ్యాంకు మిగిలిన 30 ఎకరాలు వేలం వేసింది. 2019లో జరిగిన వేలంలోనే బిల్డ్‌ బ్రిక్స్‌ అనే సంస్థ ఆ 30 ఎకరాలు కొనుగోలు చేసింది. అయితే, హెచ్‌ఏసీ 23.5 ఎకరాల స్థలంలో స్టేడియాన్ని నిర్మించినట్లు చెబుతున్నారు. హెచ్‌సీఏ అదనంగా ఆక్రమించుకున్న స్థలంలో కొంత ప్రభుత్వం రెగ్యులరైజ్‌ చేసిందని టీఎ్‌సఐఐసీ అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మిగిలిన 22.5 ఎకరాల స్థలాన్ని సొంతం చేసుకున్న సంస్థ దానిని రక్షించుకొనే క్రమంలో స్టేడియం గేట్లను, దారిని మూసేస్తూ ప్రహరీగోడ నిర్మిస్తుండడం వివాదాస్పదం కానుంది. ఈ చర్యతో క్రికెట్‌ స్టేడియం భవిష్యత్తే ప్రమాదంలో పడే ప్రమాదం ఉందని క్రీడాభిమానులు వాపోతున్నారు. హెచ్‌సీఏ అధికారులు ఇప్పటి వరకు బహిరంగంగా ఎక్కడాస్పందించలేదు. టీఎస్ఎస్ఐసీ ఉప్పల్‌ కమిషనర్‌ ప్రభాకర్‌ను వివరణ కోరగా స్టేడియం పక్కనే పెంగ్విన్‌ టెక్స్‌టైల్స్‌ కంపెనీ స్థలాన్ని బిల్డ్‌ బ్రిక్‌ అనే సంస్థ కొనుగోలు చేసిందని చెప్పారు. ఆ సంస్థ ప్రహరీ నిర్మాణానికి ఎలాంటి అనుమతులు తీసుకోలేదని సమాచారం. పూర్తి స్థాయిలో గోడ నిర్మించి, పార్కింగ్‌ ఎత్తేస్తే ఉప్పల్‌ స్టేడియంలో క్రికెట్‌ మ్యాచ్‌లు నిర్వహించడం కష్టతరంగా మారనున్నది. ఇప్పటికే క్రికెట్‌ మ్యాచ్‌లు జరుగుతున్నప్పుడు ప్రేక్షకుల వాహనాలతో ఉప్పల్‌ రోడ్లన్నీ అక్రమ పార్కింగ్‌తో నిండిపోతుండగా ఇక భవిష్యత్తులో మరింత కష్టంగా మారునున్నది. క్రీడలకు ప్రాధాన్యం ఇస్తున్న ప్రభుత్వం స్టేడియం దారులు, పార్కింగ్‌ స్థలాన్ని రక్షించే విషయంలో చొర వ తీసుకోవాలని క్రీడాభిమానులు కోరుతున్నారు.

Updated Date - Jul 09 , 2025 | 05:17 AM