Share News

ACB Operations: అవినీతి ఉద్యోగుల ఆటకట్టు

ABN , Publish Date - Aug 02 , 2025 | 05:38 AM

ప్రభుత్వ కార్యాలయాలకు పని నిమిత్తం వచ్చే వారిని లంచాలు అడుగుతున్న అక్రమార్కులకు ఏసీబీ గట్టి షాక్‌ ఇస్తోంది. జూలైలో ప్రత్యేక ఆపరేషన్‌ చేపట్టి పలువురు లంచగొండుల ఆటకట్టించింది.

ACB Operations: అవినీతి ఉద్యోగుల ఆటకట్టు

  • ఏడు నెలల్లో 168 ఏసీబీ కేసులు

  • 145 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్టు

  • లంచం అడిగితే.. టోల్‌ ఫ్రీ నం.1064

హైదరాబాద్‌, ఆగస్టు 1(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ కార్యాలయాలకు పని నిమిత్తం వచ్చే వారిని లంచాలు అడుగుతున్న అక్రమార్కులకు ఏసీబీ గట్టి షాక్‌ ఇస్తోంది. జూలైలో ప్రత్యేక ఆపరేషన్‌ చేపట్టి పలువురు లంచగొండుల ఆటకట్టించింది. ఒక్క నెలలోనే మెరుపు దాడులు చేసి 22 కేసులు నమోదు చేసింది. ఇందులో 13 ట్రాప్‌ కేసులు, ఆదాయానికి మించిన ఆస్తుల కేసు, అధికార దుర్వినియోగం కేసు, సాధారణ తనిఖీ కేసు, ఆరు ఆకస్మిక తనిఖీ కేసులు ఉన్నాయని ఏసీబీ విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. ఈ ఆపరేషన్లలో 20 మంది ప్రభుత్వ అధికారులు, ఇద్దరు ప్రైవేటు వ్యక్తులను ఏసీబీ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని అరెస్ట్‌ చేసింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ అధికారులు రూ.11.50లక్షల విలువైన అక్రమ ఆస్తులను గుర్తించారు. అంతేకాకుండా రిజిస్ట్రార్‌ కార్యాలయాలపై జరిపిన ఆకస్మిక దాడుల్లో లెక్కల్లో చూపని రూ.1,49,880 నగదును సీజ్‌ చేశారు.


ఏడు నెలల్లో రూ.కోట్ల ఆస్తులు స్వాధీనం..

ఈ ఏడాది జనవరి నుంచి జూలై వరకు ఏసీబీ 168 కేసులను నమోదు చేసింది. ఇందులో 15 అక్రమ ఆస్తుల కేసులు, 11 అధికార దుర్వినియోగం కేసులు, 17 సాధారణ తనిఖీలు, 3 విచక్షణాధికార పరిశీలనలు, 145 మంది ప్రభుత్వ ఉద్యోగులను అరెస్ట్‌ చేసిన ట్రాప్‌ కేసులు ఉన్నాయి. ఈ ఏడు నెలల్లో ఏసీబీ రూ.39,16,60,526 విలువైన అక్రమ ఆస్తులను బయటపెట్టింది. జూలైలో 21 కేసులను పూర్తి చేసి తుది నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. అవినీతిని నిర్మూలించడానికి ప్రజల సహకారం కూడా అవసరమని ఏసీబీ అధికారులు పేర్కొన్నారు. ప్రభుత్వ అధికారులు లంచం డిమాండ్‌ చేస్తే టోల్‌ ఫ్రీ నంబరు 1064కు ఫోన్‌ చేయాలని కోరారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ప్రజలకు అవగాహన కల్పించడానికి ఏసీబీ పోస్టర్లు, స్టిక్కర్లను కూడా ప్రదర్శిస్తోంది.


4 వేలు తీసుకుంటూ చిక్కిన ఏఆర్‌ఐ

36.jpg

భూత్పూర్‌, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): కల్యాణ లక్ష్మి ఫైల్‌ కదలాలంటే డబ్బులు ఇవ్వాలని డిమాండ్‌ చేసిన ఏఆర్‌ఐ ఏసీబీకి చిక్కాడు. మహబూబ్‌నగర్‌ జిల్లా భూత్పూర్‌ మండల వాసి ఒకరు తన కూతురు వివాహానికి కల్యాణ లక్ష్మి కింద లబ్ధి పొందడానికి దరఖాస్తు చేసుకున్నాడు. ఆ దరఖాస్తును పరిశీలించి పంచనామా నివేదిక ఇవ్వడానికి భూత్పూర్‌ తహసీల్దార్‌ కార్యాలయంలోని ఏఆర్‌ఐ బాలసుబ్రమణ్యం రూ.8,000 లంచం డిమాండ్‌ చేశాడు. తన దగ్గర అంత డబ్బు లేదని బాధితుడు చెప్పాడు. కనీసం రూ.6,000 అయినా ఇవ్వాలని బేరమాడి.. రూ.4,000కు అంగీకరించాడు. అనంతరం బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచన మేరకు శుక్రవారం భూత్పూర్‌కు సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద బాలసుబ్రమణ్యానికి బాధితుడు రూ.4,000 ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

Updated Date - Aug 02 , 2025 | 05:38 AM