Mahabubabad: మానుకోటలో ఏసీబీ దాడులు
ABN , Publish Date - Apr 26 , 2025 | 05:08 AM
మహబూబాబాద్ జిల్లా ఇన్‌చార్జ్ రవాణాశాఖ అధికారి(డీటీవో)గా పని చేస్తూ.. గతంలో సస్పెండైన మహ్మద్ గౌస్‌పాషా నివాసంతో పాటు ఆయన బంధువులు, కుటుంబసభ్యుల ఇళ్లలో శుక్రవారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు.

సస్పెండైన డీటీవో ఇంట్లో సోదాలు
కోట్ల విలువైన ఆస్తుల పత్రాలు స్వాధీనం
మహబూబాబాద్, ఏప్రిల్ 25(ఆంధ్రజ్యోతి) : మహబూబాబాద్ జిల్లా ఇన్‌చార్జ్ రవాణాశాఖ అధికారి(డీటీవో)గా పని చేస్తూ.. గతంలో సస్పెండైన మహ్మద్ గౌస్‌పాషా నివాసంతో పాటు ఆయన బంధువులు, కుటుంబసభ్యుల ఇళ్లలో శుక్రవారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ వివరాలను ఖమ్మం ఏసీబీ డీఎస్పీ రమేష్ విలేకరులకు వివరించారు. 2017ఏప్రిల్‌లో భద్రాది కొత్తగూడెం ఎంవీఐగా విధులు నిర్వహిస్తున్న సమయంలో గౌస్‌పాషాపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో ఏసీబీ అధికారులు దాడులు చేసి, ఆయనను అరెస్టు చేశారు. 2024 మే, ఆగస్టు నెలల్లో మహబూబాబాద్ ఎంవీఐగా, ఇన్‌చార్జ్ డీటీవోగా పనిచేస్తున్న సమయంలో మరోమారు ఏసీబీ దాడులు నిర్వహించారు. అప్పుడు ఆయన కారు డ్రైవర్ వద్ద నగదు లభించడంతో గౌస్‌పాషాను అరెస్టు చేశారు.
తాజాగా ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఫిర్యాదు రావడంతో శుక్రవారం మహబూబాబాద్‌లో ఆయన అద్దెకుంటున్న ఇంటితో పాటు కరీంనగర్, హైదరాబాద్‌లలోని గౌస్‌పాషా కుమారుడు, కుమార్తె, బంధువులు, స్నేహితుల ఇళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది బృందాలు ఏకకాలంలో దాడులు నిర్వహించాయి. సుమారు రూ.26.85 లక్షల విలువ చేసే రెండు ఇళ్లు, రూ.2.28 కోట్ల విలువ ఉండే 25 ఓపెన్ పాట్లు, రూ.55.98 లక్షల విలువైన 10.36 ఎకరాల వ్యవసాయ భూములు, రూ.32.90 లక్షల విలువ ఉండే కారు, రెండు ద్విచక్రవాహనాలు, రూ.7.03 లక్షల విలువైన గృహోపకరణాలను గుర్తించారు. ఆ పత్రాలను స్వాధీనం చేసుకుని గౌస్‌పాషాను అరెస్టు చేశారు.