Aarogyasri: ఆరోగ్యశ్రీ సేవలు పునఃప్రారంభం
ABN , Publish Date - Jan 21 , 2025 | 03:39 AM
రాష్ట్రవ్యాప్తంగా పది రోజులుగా నిలిచిపోయిన రాజీవ్ ఆరోగ్యశ్రీ సేవలు సోమవారం రాత్రి పునఃప్రారంభమయ్యాయి. ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రులతో సర్కారు జరిపిన చర్చలు సఫలం కావడంతో.. సేవలను యథావిధిగా కొనసాగించనున్నట్లు ఆస్పత్రులు ప్రకటించాయి.

నెట్‌వర్క్ ఆస్పత్రుల యాజమాన్యాలతో వైద్యశాఖ మంత్రి దామోదర చర్చలు సఫలం
నెలవారీగా బిల్లుల చెల్లింపునకు అంగీకారం
నాలుగైదు నెలల్లో బకాయిల చెల్లింపునకు హామీ
హైదరాబాద్, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా పది రోజులుగా నిలిచిపోయిన రాజీవ్ ఆరోగ్యశ్రీ సేవలు సోమవారం రాత్రి పునఃప్రారంభమయ్యాయి. ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రులతో సర్కారు జరిపిన చర్చలు సఫలం కావడంతో.. సేవలను యథావిధిగా కొనసాగించనున్నట్లు ఆస్పత్రులు ప్రకటించాయి. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ.. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కార్యాలయంలో నెట్‌వర్క్ ఆస్పత్రుల సంఘం ప్రతినిధులతో సోమవారం చర్చలు జరిపారు. ప్రతినెలా విఽధిగా ప్రైవేటు ఆస్పత్రులకు ఆరోగ్యశ్రీ బిల్లులను చెల్లించేలా చర్యలు తీసుకుంటామని, ఐదారు నెలల్లో బకాయులను పూర్తిగా చెల్లిస్తామని వారికి హామీ ఇచ్చారు. ఇక ప్రైవేటు ఆస్పత్రుల ఎంప్యానెల్ ఎంవోయూ, ప్యాకేజీ ధరల పెంపునకుసంబంధించిన సమస్యలపై ఒక కమిటీ వేస్తామని మంత్రి పేర్కొన్నారు. ఇతర సమస్యలపై చర్చించేందుకు ఆరోగ్యశాఖ కార్యదర్శి, ఆరోగ్యశ్రీ సీఈవోతో సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పారు.
కాగా, దంత వైద్యశాలలకు సంబంధించి 18 నెలల బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని ఆయా ఆస్పత్రుల యాజమాన్యాలు మంత్రి దృష్టికి తీసుకువచ్చాయి. దీంతో వాటిని కూడా వీలైనంత త్వరగా చెల్లించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు. మంత్రితో చర్చల అనంతరం తెలంగాణ నెట్‌వర్క్ ఆస్పత్రుల సంఘం ప్రతినిఽధులు మీడియాతో మాట్లాడుతూ.. పెండింగ్ బకాయుల చెల్లింపుపై మంత్రి దామోదర స్పష్టమైన హామీ ఇచ్చారని తెలిపారు. రానున్న 4-5 నెలల్లో బకాయిలు చెల్లిస్తామని చెప్పారని, నెలవారీగా బిల్లులు చెల్లిస్తామన్నారని వెల్లడించారు. మంత్రి హామీతో సోమవారం రాత్రి పది గంటల నుంచే ఆరోగ్యశ్రీ, ఈహెచ్‌ఎ్‌స, జేహెచ్‌ఎ్‌స సేవలను యథావిధిగా అందిస్తామని నెట్‌వర్క్ ఆస్పత్రుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ రాకేశ్ తెలిపారు. వైద్యశాఖ మంత్రి స్వయంగా తమతో చర్చలు జరపడం సంతోషంగా ఉందన్నారు. గతంలో ఆరోగ్యశ్రీ కింద నెలకు సగటున రూ.50 కోట్ల వరకు విడుదల చేయగా, ప్రస్తుతం నెలకు రూ.100 కోట్ల వరకు ఇస్తున్నారని, ఇందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకొంటున్నామని చెప్పారు.