Share News

Property Dispute: ఆస్తులు రాయించుకొని గెంటేశారు

ABN , Publish Date - Jul 08 , 2025 | 04:03 AM

కన్న కొడుకు రెండేళ్ల క్రితం ఎటో వెళ్లిపోగా, అతని కుమారులు (మనుమళ్లు) తన పేరిట ఉన్న ఆస్తిని రాయించుకొని ఇంట్లో నుంచి బయటకు గెంటివేశారంటూ ఓ నాన్నమ్మ కలెక్టర్‌కు ఫిర్యాదు చేసింది.

Property Dispute: ఆస్తులు రాయించుకొని గెంటేశారు

  • మనుమళ్లపై కలెక్టర్‌కు నాన్నమ్మ ఫిర్యాదు

నిజామాబాద్‌ అర్బన్‌, జూలై 7 (ఆంధ్రజ్యోతి): కన్న కొడుకు రెండేళ్ల క్రితం ఎటో వెళ్లిపోగా, అతని కుమారులు (మనుమళ్లు) తన పేరిట ఉన్న ఆస్తిని రాయించుకొని ఇంట్లో నుంచి బయటకు గెంటివేశారంటూ ఓ నాన్నమ్మ కలెక్టర్‌కు ఫిర్యాదు చేసింది. నిజామాబాద్‌ జిల్లా నవీపేట మండలం గాంధీనగర్‌కు చెందిన మేడగం వెంకటలక్ష్మి అనే 80 ఏళ్ల వృద్ధురాలు సోమవారం తన కుమార్తెతో కలిసి వీల్‌చైర్‌లో నిజామాబాద్‌ కలెక్టరేట్‌కు వచ్చి ఫిర్యాదు అందజేసింది. తన భర్త బాల నాగిరెడ్డి చనిపోయాడని, పెద్ద కుమారుడు రెండేళ్ల క్రితం ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయాడని ఆమె చెప్పింది.


అతని కుమారులు రమే్‌షరెడ్డి, నరేందర్‌రెడ్డిలు తనకు పెన్షన్‌ ఇప్పిస్తామని చెప్పి.. తనతో సంతకాలు చేయించుకున్నారని తెలిపింది. ఇళ్లు, ఏడు ఎకరాల పొలాన్ని వారి పేరు మీదకు మార్చుకున్నారని, తనను ఇంట్లో నుంచి గెంటేశారని వృద్ధురాలు ఆవేదన వ్యక్తం చేసింది. బ్యాంకు బుక్కు, ఆధార్‌కార్డు, పాస్‌బుక్కులు బలవంతంగా లాక్కొన్నారని తెలిపింది. అదేంటని అడిగితే పెట్రోల్‌ పోసి తగలబెడతామని బెదిరింపులకు పాల్పడుతున్నారని వాపోయింది. పోలీసులకు ఫిర్యాదు చేస్తే సివిల్‌ కేసు అయినందు వల్ల కోర్టులో తేల్చుకోవాలని చెబుతున్నారని పేర్కొంది. ఫిర్యాదును పరిశీలించిన జిల్లా కలెక్టర్‌.. సీనియర్‌ సిటిజన్‌ యాక్ట్‌ కింద ఆమెకు న్యాయం చేయాలని ఆర్డీవోను ఆదేశించారు.


ఇవి కూడా చదవండి

జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాలు.. నెలకు లక్షా 12 వేల జీతం,


యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 08 , 2025 | 04:03 AM