Microbrewery Expansion: మరిన్ని మైక్రోబ్రూవరీలు
ABN , Publish Date - Jul 31 , 2025 | 05:42 AM
రాష్ట్రంలో మరిన్ని మైక్రోబ్రూవరీల ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు నిబంధనల సవరణకు

హైదరాబాద్‌లో 25కి పెరగనున్న బ్రూవరీలు.. మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోనూ అవకాశం
నిబంధనల సవరణకు సర్కారు ఆమోదం
వచ్చే నెలలో నోటిఫికేషన్ జారీకి సిద్ధం
హైదరాబాద్, జూలై 30 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మరిన్ని మైక్రోబ్రూవరీల ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు నిబంధనల సవరణకు పచ్చజెండా ఊపింది. దీంతో హైదరాబాద్‌కే పరిమితమైన మైక్రోబ్రూవరీలు ఇకపై రాష్ట్రంలోని మునిసిపల్ కార్పొరేషన్లకు విస్తరించనున్నాయి. కార్పొరేషన్లలో ఒకటి కంటే ఎక్కువ బ్రూవరీలు ఏర్పాటుకానున్నాయి. నిజానికి వరంగల్ కార్పొరేషన్ పరిధి నుంచి 2017లోనే దరఖాస్తులు వచ్చాయి. ఇప్పుడు ప్రభుత్వం ఇతర ప్రాంతాల్లో.. ముఖ్యంగా మునిసిపల్ కార్పొరేషన్ల పరిధుల్లో మైక్రోబ్రూవరీలకు అనుమతివ్వాలని నిర్ణయించింది. దీంతో ఆగస్టులో నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఏమిటీ మైక్రోబ్రూవరీలు?
మైక్రోబ్రూవరీల్లో చిన్న స్థాయిలో బీరు ఉత్పత్తి అవుతుంది. ఇవి భారీ వాణిజ్య బ్రూవరీల్లా కాకుండా పరిమిత పరిమాణంలో తరచుగా వినూత్నమైన, ప్రత్యేక రుచులతో బీర్లను తయారు చేస్తాయి. ఈ బీర్‌ను తరచుగా అదే ప్రాంగణంలో, స్థానికంగానే విక్రయిస్తారు. ప్రస్తుతం రాష్ట్రంలో(హైదరాబాద్‌లో) 18 మైక్రోబ్రూవరీలున్నాయి. ఇవి నగరంలోని క్రాఫ్ట్‌బీర్ ప్రియులకు, యువతకు ప్రధాన వినోద కేంద్రాలుగా మారాయి. లైవ్ మ్యూజిక్, రుచికరమైన ఆహారం, ఆహ్లాదకరమైన వాతావరణం వంటివి వీటి ప్రధాన ఆకర్షణలు. పండుగలు, ప్రత్యేక సీజన్లను బట్టి సీజనల్ బ్రూస్ తయారు చేయడం ఇక్కడి ప్రత్యేకత. బ్రూవరీ్‌సలో బీర్ తయారీ ప్రక్రియను దగ్గరగా చూసే అవకాశం కొన్నిచోట్ల కల్పించారు. ఇది కస్టమర్లకు ఒక ప్రత్యేకమైన అనుభూతిని కలిగిస్తుంది. మరిన్ని బ్రూవరీలను ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని గుర్తించిన ఎక్సైజ్‌శాఖ హైదరాబాద్‌లోనే 25 మైక్రోబ్రూవరీలు ఏర్పాటు చేసుకోవచ్చనే ప్రతిపాదనను ప్రభుత్వం ముందు ఉంచింది. హైదరాబాద్ అంటే కేవలం జీహెచ్‌ఎంసీ పరిధి మాత్రమే కాకుండా.. ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్‌ఆర్) లోపల వరకు పెంచడం వల్ల ఇంకా ఎక్కువగా బ్రూవరీల సంఖ్య పెంచుకోవచ్చనే మరో ప్రతిపాదనను ప్రభుత్వానికి పంపింది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, మహారాష్ట్రతో పోలిస్తే.. తెలంగాణలోనే బీర్ల అమ్మకాలు ఎక్కువగా ఉంటాయి. బీరు వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో బ్రూవరీల విస్తరణ ద్వారా ఆదాయం లభిస్తుందని ఎక్సైజ్‌శాఖ అంచనా వేస్తోంది. ఢిల్లీ, ముంబై, బెంగళూరులో అధిక సంఖ్య లో మైక్రో బ్రూవరీలున్నాయి. డిమాండ్ ఎక్కువగా ఉండే హైదరాబాద్‌లోనూ వీటి సంఖ్యను పెంచుకోవడంపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.
పదేళ్ల క్రితమే..?
నిజానికి 2015-16లో మైక్రోబ్రూవరీల ఏర్పాటుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. 2017లో వరంగల్‌లోనూ వీటిని ఏర్పాటు చేసేందుకు ముగ్గురు వ్యాపారులు ఆసక్తిని కనబరుస్తూ దరఖాస్తు చేసుకున్నారు. హైదరాబాద్‌లోనూ అదనంగా ఆరేడు కంపెనీలు బ్రూవరీలను ఏర్పాటు చేస్తామంటూ ముందుకొచ్చాయి. ఈ వివరాలను ఎక్సైజ్ అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. సోమవారం జరిగిన మంత్రి వర్గ సమావేశంలోనూ మైక్రోబ్రూవరీల విస్తరణ విష యం ప్రస్థావనకు వచ్చింది. ముఖ్యమంత్రితో సహా పలువురు మంత్రులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఎక్సైజ్‌శాఖ రూపొందించిన ప్రతిపాదనలపై చర్చ జరగ్గా.. బ్రూవరీ్‌సను ఓఆర్‌ఆర్ లోపల మాత్రమే ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం కల్పిద్దామని తొలుత నిర్ణయానికి వచ్చారు. మిగిలిన ప్రాంతాల్లోనూ నడిపించుకోవడానికి డిమాండ్ ఉందని.. వాళ్లకు కూడా అవకాశం కల్పించడం వల్ల ఇబ్బంది ఏంటనేదానిపైనా పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడంతో.. మునిసిపల్ కార్పొరేషన్లలోనూ విస్తరించుకోవడానికి అవకాశమివ్వాలని నిర్ణయించారు. గతంలో ఉన్న నిబంధనలు సవరించడానికి ఆమోదం తెలిపారు.
హైదరాబాద్ దాటి..
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, గచ్చిబౌలి, కొండాపూర్ వంటి ప్రాంతాల్లో మైక్రోబ్రూవరీలు ఉన్నాయి. నిబంధనల సవరణకు ప్రభుత్వం పచ్చజెండా ఊపడంతో గ్రేటర్ హైదరాబాద్‌లో మరి న్ని మైక్రోబ్రూవరీలు వచ్చే అవకాశం ఉంది. వరంగల్,నిజామాబాద్, కరీంనగర్, రామగుండం, ఖమ్మం తదితర మునిసిపల్ కార్పొరేషన్ల పరిధిలో స్థానిక ఆసక్తిని బట్టి ఒకటికంటే ఎక్కువ సంఖ్యలో మైక్రోబ్రూవరీల ఏర్పాటుకు మార్గం సుగమం కానుంది. త్వరలోనే దీనిపైన తుది నిర్ణయం తీసుకుని, కొత్త లైసెన్సుల జారీకి మార్గదర్శకాలు రూపొందించే అవకాశం ఉంది. ఆగస్టులోనే నోటిఫికేషన్ జారీ చేయడానికి ఎక్సైజ్‌శాఖ సన్నాహాలు చేస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
తప్పు చేస్తే జగన్ అరెస్ట్ కావడం ఖాయం: ఏపీ బీజేపీ చీఫ్
ఈ ఆకును నాన్ వేజ్‌తో కలిపి వండుకుని తింటే ..
For More International News And Telugu News