Share News

AI - Sundar Pichai: ఏఐని గుడ్డిగా నమ్మొద్దు.. ఆల్ఫబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ హెచ్చరిక

ABN , Publish Date - Nov 18 , 2025 | 10:38 PM

ఏఐ చెప్పిందల్లా నిజమని భావించొద్దని ఆల్ఫబెట్ సంస్థ సీఈఓ సుందర్ పిచాయ్ హెచ్చరించారు. అత్యాధునిక ఏఐ సాంకేతికత కూడా ప్రస్తుతం తప్పులు చేసే అవకాశం ఉందని అన్నారు.

AI - Sundar Pichai: ఏఐని గుడ్డిగా నమ్మొద్దు.. ఆల్ఫబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ హెచ్చరిక
Sundar Pichai on AI Doing Mistakes

ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుతం ఎక్కడ చూసినా ఏఐపై చర్చే. భవిష్యత్తు ఏఐదే అన్న నమ్మకంతో ఇన్వెస్టర్లు ఏఐ కంపెనీల్లో భారీగా పెట్టుబడులు కుమ్మరిస్తున్నారు. ఈ క్రమంలో కంపెనీల మార్కెట్ విలువ అసాధారణ స్థాయిలో పెరుగుతోంది. భవిష్యత్తులో భారీ రాబడులు ఉంటాయన్న అంచనాతో పెట్టుబడిదారులు రిస్క్‌కు వెరవట్లేదు. అయితే, ఈ అంచనాలు తలకిందులై ఆశల బుడగ బద్దలయ్యే రోజు దగ్గర్లోనే ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏఐ సామర్థ్యాలపై కూడా సందేశాలు వెలుగు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో గూగుల్ మాతృసంస్థ ఆల్ఫబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు (Sundar Pichai On AI Mistakes).

బీబీసీకి తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏఐ భవితవ్యంపై సుందర్ పిచాయ్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏఐ ఇచ్చే సమాధానాలను గుడ్డిగా నమ్మొద్దని హెచ్చరించారు. ఏఐతో తప్పులు జరిగే అవకాశం ఉండటంతో ప్రజలు గూగుల్ సెర్చ్‌ను కూడా వినియోగిస్తున్నారని తెలిపారు. తాము ప్రజలకు కచ్చితమైన సమాచారం అందించేందుకే కృషి చేస్తున్నామని తెలిపారు. అయితే, సృజనాత్మక రచనా వ్యాసంగంలో ఏఐతో కొంత మేర ఉపయోగం ఉందని కూడా అన్నారు. అత్యాధునిక ఏఐ సాంకేతికతో కూడా పొరపాట్లు దొర్లే అవకాశం ఉందని చెప్పారు.


ఏఐ రంగంలో ఇబ్బడిముబ్బడిగా వచ్చి పడుతున్న పెట్టుబడులపై కూడా సుందర్ పిచాయ్ హెచ్చరించారు. ఆశల బుడగ ఎప్పుడైనా పేలిపోవచ్చని హెచ్చరించారు. ఆ తరువాత వచ్చే ప్రభావాలు అన్ని సంస్థలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అన్నారు. ఏఐ హైప్ విషయంలో ఇప్పటికే నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, సూపర్ ఇంటెలిజెన్స్ ఏఐ అభివృద్ధిని కూడా కొందరు వ్యక్తిరేకిస్తున్నారు. ఈ ఏఐతో మానవుల మనుగడకు ముప్పు వస్తుందని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆల్ఫబెట్ సంస్థ సీఈఓ హెచ్చరికలకు ప్రాధాన్యం ఏర్పడింది.


ఇవి కూడా చదవండి:

పర్‌ప్లెక్సిటీ ఏఐ సంస్థ విఫలమయ్యే ఛాన్స్ అత్యధికం.. లైవ్‌ పోల్‌లో జనాభిప్రాయం

అమెరికాలో నిపుణులైన వర్కర్ల కొరత ఉంది.. ఫోర్డ్ సీఈఓ ఆందోళన

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Nov 18 , 2025 | 10:49 PM