Sundar Pichai: టెక్ రంగంలో ఏఐ తరువాత రాబోయే విప్లవం ఏదో చెప్పిన గూగుల్ సీఈలో
ABN , Publish Date - Feb 15 , 2025 | 10:10 PM
ఏఐ తరువాత టెక్ రంగంలో క్వాంటమ్ కంప్యూటింగ్‌యే అతి పెద్ద విప్లవమని సుందర్ పిచాయ్ అన్నారు. ఈ మేరకు భవిష్యత్తులో రాబోయే పెను మార్పుల గురించి తన బ్లాగ్‌లో వివరించారు.

ఇంటర్నెట్ డెస్క్: ఏఐ రాకతో ప్రపంచం వేగంగా మారుతోంది. మానవ సమాజంపై తీవ్ర ప్రభావం చూపునున్న సాంకేతికత ఇదేనని టెక్ పండితులు చెబుతున్నారు. అయితే, ఏఐతో పాటు మరో విప్లవం కూడా మానవ సమాజాన్ని ముంచెత్తనుందని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ తాజాగా తెలిపారు. మానవుల భవిష్యత్తును సమూలంగా మార్చే సాంకేతిక విప్లవాల గురించి ఆయన తాజాగా తన బ్లాగ్‌లో పేర్కొన్నారు.
మానవుల భవిష్యత్తును మూడు అంశాలు తీవ్రంగా ప్రభావితం చేయనున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. క్వాంటమ్ కంప్యూటింగ్‌లో పురోగతి టెక్నాలజీని కొత్త పుంతలు తొక్కిస్తుందని అన్నారు. ప్రజారోగ్యం, భద్రత, సైన్స్ వంటి రంగాల్లో క్లిష్టమైన సమస్యలకు క్వాంటమ్ కంప్యూటింగ్‌తో పరిష్కారాలు లభిస్తాయని అన్నారు (Sundar Pichai).
సరికొత్త ఔషధాలు, ఫ్యూజన్ టెక్నాలజీ, ఎలక్ట్రిక్ట్ కార్ల కోసం మరింత మెరుగైన బ్యాటరీలు వంటి వాటిని శాస్త్రవేత్తలు క్వాంటమ్ కంప్యూటింగ్ సాయంతో కనుగొనగలుగుతారని గూగుల్ సీఈఓ అన్నారు. కంప్యూటర్ రంగంలో తదుపరి రాబోయే భారీ మార్పు క్వాంటం కంప్యూటింగే అని అన్నారు. ఇటీవల గూగుల్ రూపొందించిన విల్లో క్వాంటమ్ చిప్ గురించి కూడా ఆయన ప్రస్తావించారు.
ఇక ఏఐ మరిన్ని నైపుణ్యాలు సామర్థ్యాలు సంతరించుకుంటుందని అన్నారు. ధరలు కూడా తగ్గుతాయని, సులువగా వినియోగించే స్థాయికి వస్తుందని చెప్పారు. త్వరలో ఏఐ మన జీవితంలో ఒక ముఖ్య భాగం అవుతుందని చెప్పారు.
Whatsapp Alert : వాట్సాప్ యూజర్లకు హెచ్చరిక.. 24 దేశాల్లో కొత్త రకం స్పైవేర్ గుర్తింపు..
ఇక చివరిగా టెక్నాలజీని మానుషులు వినియోగించే విధానమే పూర్తిగా మారిపోతుందని అన్నారు. కంప్యూటర్‌లు మనల్ని మరింతగా అర్థం చేసుకుని స్పందించే స్థితికి వస్తాయని చెప్పారు. భవిష్యత్తులో ఎలక్ట్రానిక్ ఉపకరణాలు మనతో సహజమైన పద్ధతిలో స్పందించే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు.
కాగా, ఆయా మార్పుల దిశగా గూగుల్ ఇప్పటికే పెద్ద ఎత్తున పరిశోధనలు చేస్తోంది. ఏఐతో పాటు క్వాంటమ్ కంప్యూటింగ్ అభివృద్ధిపై పెద్ద ఎత్తున పెట్టుబడులు కుమ్మరిస్తోంది. ఈ నేపథ్యంలో తదుపరి విప్లవం మనుషుల అంచనాల కంటే ముందే రావచ్చని కూడా సుందర్ పిచాయ్ అన్నారు.
మరిన్ని టెక్నాలజీ వార్తలు కోసం క్లిక్ చేయండి..