Share News

Sudar Pichai: అమెరికా టెక్ రంగం అభివృద్ధిలో వలసదారుల పాత్ర అద్భుతం: సుందర్ పిచాయ్

ABN , Publish Date - Nov 20 , 2025 | 06:50 PM

అమెరికా టెక్ రంగం అభివృద్ధిలో వలసదారుల పాత్ర అద్భుతమని ఆల్ఫబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ వ్యాఖ్యానించారు. టెక్ రంగంలో సృజనాత్మకతకు వారు చోదకశక్తిగా ఉన్నారని అన్నారు. టెక్ రంగం చరిత్ర చూస్తే ఇది స్పష్టంగా అర్థమవుతుందని అన్నారు.

Sudar Pichai: అమెరికా టెక్ రంగం అభివృద్ధిలో వలసదారుల పాత్ర అద్భుతం: సుందర్ పిచాయ్
Sudar Pichai on Immigrants' Role in Tech Sector

ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలో సృజనాత్మకతకు వలసదారులు చోదకశక్తిగా ఉన్నారని ఆల్ఫబెట్ (గూగుల్ మాతృసంస్థ) సీఈఓ సుందర్ పిచాయ్ ప్రశంసించారు. టెక్ రంగంలో వలసదారుల పాత్ర అద్భుతమని వ్యాఖ్యానించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు హెచ్-1బీ వీసా విధానం రద్దుకు పట్టుబడుతున్న నేపథ్యంలో ఆల్ఫ్‌బెట్ సీఈఓ ఈ వ్యాఖ్యలు చేశారు (Sundar Pichai on Immigration in US).

అమెరికా టెక్ రంగంలో వలసదారుల పాత్రపై బీబీసీ వార్తాసంస్థకు ఆల్ఫబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘టెక్ రంగం అభివృద్ధి చెందిన తీరును మీరు ఓసారి గమనించండి..ఇందులో వలసదారుల పాత్ర చాలా గొప్పది’ అని ఆయన అన్నారు. హెచ్-1బీ వీసాలో లోపాలను సరిదిద్దేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అన్నారు. ప్రతిభావంతులను అమెరికాకు తీసుకొచ్చే విధంగా మార్పులు ఉంటాయని తాను భావిస్తున్నట్టు తెలిపారు (Immigrants' role in Techsector).


పైచదువుల కోసం అమెరికాకు వెళ్లిన సుందర్ పిచాయ్.. హెచ్-1బీ వీసాతోనే తన కెరీర్‌ను ప్రారంభించారు. ఆర్థిక, సాంకేతిక రంగాల్లో అభివృద్ధికి వలసలు అవసరమని కూడా గతంలో ఓసారి స్పష్టం చేశారు.

ఇక టెక్ రంగ వ్యాపారవేత్తలకు రాజకీయ ప్రాముఖ్యత పెరుగుతుండటంపై ఎదురైన ప్రశ్నలకు కూడా సీఈఓ సుందర్ పిచాయ్ స్పందించారు. ట్రంప్ ప్రమాణస్వీకారంలో పలువురు టెక్ రంగ నిపుణులు పాల్గొనడంపై మాట్లాడారు. ‘ఏఐ సాంకేతికత ఎంతో అద్భుతమైనది. ఇది ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుంది. జాతీయ భద్రతా కారణాల దృష్ట్యా కూడా ఏఐకి ఎంతో ప్రాధాన్యం ఉంది. సమాజానికి ఏఐతో ప్రయోజనాలు కలిగేలా ప్రభుత్వంతో కలిసి పనిచేయాలి. సాంకేతికత దుర్వినియోగమయ్యే ముప్పుపై ప్రభుత్వంతో కలిసి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆలోచించాలి’ అని ఆయన కామెంట్ చేశారు.


ఇవి కూడా చదవండి:

ఏఐని గుడ్డిగా నమ్మొద్దు.. ఆల్ఫబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ హెచ్చరిక

పర్‌ప్లెక్సిటీ ఏఐ సంస్థ విఫలమయ్యే ఛాన్స్ అత్యధికం.. లైవ్‌ పోల్‌లో జనాభిప్రాయం

Read Latest and Technology News

Updated Date - Nov 20 , 2025 | 07:47 PM