Share News

TRAI New Rating System: ఇంటర్నెట్ స్పీడ్ లేక బాధపడుతున్నారా.. ట్రాయ్ కొత్త రేటింగ్‌తో పరిష్కారం

ABN , Publish Date - Jun 09 , 2025 | 12:39 PM

ప్రస్తుత డిజిటల్ యుగంలో ఇంటర్నెట్ అనేది గాలి, నీరు మాదిరిగా అయిపోయింది. ఇది లేకుండా ఉండలేని పరిస్థితి వచ్చింది. అయితే మీ ప్రాంతంలో నెట్ లేదా నెట్‌వర్క్ (TRAI New Rating System) సౌకర్యంతో ఇబ్బంది పడుతున్నారా. అలాంటి వారి కోసం టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) కొత్త రేటింగ్ వ్యవస్థను ప్రవేశపెట్టింది.

TRAI New Rating System: ఇంటర్నెట్ స్పీడ్ లేక బాధపడుతున్నారా.. ట్రాయ్ కొత్త రేటింగ్‌తో పరిష్కారం
TRAI New Rating System

ప్రస్తుత రోజుల్లో అనేక మంది కూడా ఇంట్లో వైఫై వినియోగిస్తున్నారు. దీంతోపాటు మొబైల్ నెట్ కూడా వాడుతున్నారు. కానీ, మీ ఇంట్లో లేదా సొసైటీలో ఇంటర్ నెట్ లేదా నెట్‌వర్క్ సమస్యలు ఎదురవుతున్నాయా (TRAI New Rating System). అయితే, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) కొత్త డిజిటల్ కనెక్టివిటీ రేటింగ్ వ్యవస్థ మీకు సహాయం చేయబోతోంది. ఎలాగంటే ఈ వ్యవస్థ ద్వారా మీ ఇల్లు, అపార్ట్‌మెంట్ లేదా కమర్షియల్ భవనం ఎంత బాగా డిజిటల్‌గా కనెక్ట్ అయిందో తెలుసుకోవచ్చు.


డిజిటల్ కనెక్టివిటీ రేటింగ్ అంటే ఏంటి

మనం ఇళ్లను కొనేటప్పుడు లొకేషన్, సౌకర్యాలు, ధర వంటివి చూస్తాం. ఇప్పుడు దీనికి తోడు ఇంటర్నెట్ కనెక్టివిటీ కూడా చాలా ముఖ్యమైన అంశంగా మారింది. TRAI తీసుకొచ్చిన ఈ కొత్త వ్యవస్థ భవనాలకు 1 నుంచి 5 స్టార్‌ల వరకు రేటింగ్ ఇస్తుంది. ఇది గ్రీన్ బిల్డింగ్ రేటింగ్ ‌లాంటిదే. కానీ ఇక్కడ డిజిటల్ సౌకర్యాలపై ఫోకస్ చేస్తారు. అంటే మీ ఇంట్లో ఇంటర్నెట్ స్పీడ్, వైఫై కవరేజ్, మొబైల్ సిగ్నల్, ఫైబర్ కనెక్షన్ వంటి అంశాల ఆధారంగా ఈ రేటింగ్ అందిస్తారు.


ఈ రేటింగ్ ఎలా ఇస్తారు?

  • మీ ఇల్లు లేదా భవనం ఎంత డిజిటల్‌గా సిద్ధంగా ఉందో తెలుసుకోవడానికి కొన్ని ముఖ్యమైన అంశాలను పరిశీలిస్తారు.

  • ఫైబర్ కనెక్టివిటీ: మీ భవనంలో ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ ద్వారా హై స్పీడ్ ఇంటర్నెట్ అందుబాటులో ఉందా లేదా అనేది పరిశీలిస్తారు.

  • మొబైల్ నెట్‌వర్క్: మీ ఇంట్లో మొబైల్ సిగ్నల్ బలంగా ఉందా? కాల్ డ్రాప్స్, నెట్‌వర్క్ లేకపోవడం వంటి సమస్యలు ఉన్నాయా అని చెక్ చేస్తారు.

  • ఇన్ బిల్డింగ్ సొల్యూషన్స్: ఇంటర్నెట్ సిగ్నల్‌ను బలోపేతం చేసే బూస్టర్లు లేదా ఇతర సాంకేతిక సదుపాయాలు ఉన్నాయా అని చూస్తారు.

  • వైఫై సౌకర్యాలు: మీ భవనంలో వైఫై హాట్‌స్పాట్‌లు లేదా రూటర్లు సమర్థవంతంగా పనిచేస్తున్నాయో పరిశీలిస్తారు.

  • ఈ అంశాలన్నీ పరిగణనలోకి తీసుకుని ఒక భవనానికి 1 స్టార్ (అతి తక్కువ కనెక్టివిటీ) నుంచి 5 స్టార్‌ల (అత్యుత్తమ కనెక్టివిటీ) వరకు రేటింగ్ ఇవ్వబడుతుంది.


ఈ రేటింగ్ ప్రక్రియ ఎలా జరుగుతుంది?

  • TRAI ఈ వ్యవస్థను సులభంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ఒక ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ను రూపొందించింది. ఈ ప్రక్రియలో 3 ముఖ్యమైన వ్యవస్థలు పనిచేస్తాయి.

  • డిజిటల్ కనెక్టివిటీ రేటింగ్ ఏజెన్సీ (DCRA): ఈ ఏజెన్సీలు భవనాలను సందర్శించి, డిజిటల్ సౌకర్యాలను పరిశీలించి, రేటింగ్‌ను నిర్ణయిస్తాయి.

  • ప్రాపర్టీ మేనేజర్: ఇంటి యజమాని, అపార్ట్‌మెంట్ సొసైటీ లేదా కమర్షియల్ భవనం నిర్వాహకులు ఈ రేటింగ్ కోసం అప్లై చేసుకోవచ్చు.

  • రేటింగ్ ప్లాట్‌ఫారమ్: TRAI ఆధ్వర్యంలో పనిచేసే ఈ ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్ ద్వారా రేటింగ్ ప్రక్రియ సులభంగా నిర్వహించబడుతుంది.

  • మీ భవనానికి రేటింగ్ పొందాలంటే, ప్రాపర్టీ మేనేజర్ ఈ ప్లాట్‌ఫారమ్‌లో నమోదు చేసుకోవాలి. ఆ తర్వాత, DCRA బృందం సందర్శించి అన్ని అంశాలను పరిశీలించి, రేటింగ్ ఇస్తుంది.


ఈ రేటింగ్‌తో ఏంటి లాభం

  • ఈ రేటింగ్‌తో ఆయా ప్రాంతాల్లోని భవనంలో ఇంటర్నెట్, మొబైల్ సిగ్నల్ ఎలా ఉంటాయో ముందే తెలుసుకోవచ్చు

  • ఇంటి విలువ పెరుగుదల: 4 లేదా 5 స్టార్‌ల రేటింగ్ ఉన్న భవనాలు కొనుగోలుదారులను ఎక్కువగా ఆకర్షిస్తాయి. దీనివల్ల ఆస్తి విలువ కూడా పెరుగుతుంది.

  • డిజిటల్ సౌకర్యాల మెరుగుదల: ఈ రేటింగ్ వల్ల భవన నిర్వాహకులు తమ సొసైటీలో ఇంటర్నెట్ సౌకర్యాలను మెరుగుపరచడానికి ప్రయత్నిస్తారు.


ఇవీ చదవండి:

రెస్టారెంట్‌లో లేట్ సర్వీస్..హోటల్ ధ్వంసం చేసిన కస్టమర్లు

ప్రధానిని పలకరించిన యూనస్..బంగ్లాదేశ్ నుంచి మోదీకి సందేశం

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jun 09 , 2025 | 12:39 PM