New trend: మైక్రో హాబిట్స్.. ఇప్పుడొక కొత్త ట్రెండ్..
ABN , Publish Date - Nov 23 , 2025 | 11:07 AM
టీవీ రిమోట్ అందుకోవాలంటే బద్దకం. స్కూల్‌లో పేరెంట్స్ మీటింగ్‌కు వెళ్లాలంటే వాయిదా. పాస్‌పోర్టు రెన్యువల్ చేసుకోవాలంటే ఇల్లు కదలరు. ఇలా.. ప్రతీదీ వాయిదా.. వాయిదా.. ఇలాంటి కాలయాపనే కాలయముడై మన విజయాన్ని అంతమొందిస్తుంది. పనులు వాయిదా వేయడమంటే వైఫల్యాన్ని ఆహ్వానించడమే. ఏరోజు చేయాల్సిన పని ఆ రోజు చేయడం కాదు, ఒక రోజు ముందే పూర్తి చేయగలగాలి. అప్పుడే విజయం వరిస్తుంది.
- మైక్రో.. మార్చేస్తుంది!
సెకను క్షణికమే!. అరవై కలిస్తే నిమిషం అవుతుంది. మరో అడుగువేస్తే గంట ముగుస్తుంది. గంటలు.. రోజులు.. నెలలు గడిచినప్పుడు సంవత్సరం అవుతుంది. అంటే కనురెప్పపాటులో కనిపించకుండా ముందుకెళ్లే సెకను కాలాన్ని ముందుకు తీసుకెళ్లే శక్తివంతమైనది సాధనమే కదా!. మనం జీవితంలో ఆచరించే చిన్న చిన్న మార్పులు కూడా క్షణికం లాంటివే!. రానురాను అవన్నీ కూడితే అద్భుతం అవుతుంది... కొన్నాళ్లకు అత్యద్భుత విజయాలకు మార్గమూ అవుతుంది. అవును.. ఇప్పుడు ప్రపంచమంతా సమయం లేక.. చిన్న చిన్న మార్పులు కోరుకుంటోంది... మైక్రోహాబిట్స్ ఇప్పుడొక కొత్త ట్రెండ్. పెద్ద పెద్ద పనులు ఏమీ అక్కర్లేదు.. ఇదిగో ఇలా చిన్న చిన్న మార్పుల్ని అనుసరిస్తే చాలు.. జీవితం మారిపోవడం ఖాయం...

పని వాయిదా వద్దు....
టీవీ రిమోట్ అందుకోవాలంటే బద్దకం. స్కూల్‌లో పేరెంట్స్ మీటింగ్‌కు వెళ్లాలంటే వాయిదా. పాస్‌పోర్టు రెన్యువల్ చేసుకోవాలంటే ఇల్లు కదలరు. ఇలా.. ప్రతీదీ వాయిదా.. వాయిదా.. ఇలాంటి కాలయాపనే కాలయముడై మన విజయాన్ని అంతమొందిస్తుంది. పనులు వాయిదా వేయడమంటే వైఫల్యాన్ని ఆహ్వానించడమే. ఏరోజు చేయాల్సిన పని ఆ రోజు చేయడం కాదు, ఒక రోజు ముందే పూర్తి చేయగలగాలి. అప్పుడే విజయం వరిస్తుంది. పనులు వాయిదా పడకూడదంటే ముందుగా చేయాల్సిన పనుల జాబితాను రూపొందించుకోవాలి.
రోజు వారీ చేయాల్సిన పనులు లేక ఆ వారంలో పూర్తి చేయాల్సిన పనులను డైరీలో రాస్తే సమయం చాలా కలిసొస్తుంది. ప్రాధాన్య క్రమంలో పనులు పూర్తి చేసుకునే అవకాశం దొరుకుతుంది. లక్ష్యాలను చేరుకోవడం సులువవుతుంది. పక్కా ప్రణాళికతో ఉంటే ఒత్తిడి, ఆందోళన దరి చేరకుండా ఉంటాయి. పనులను ఎఫెక్టివ్‌గా పూర్తి చేయడం సాధ్యమవుతుంది. పెద్ద పెద్ద పనులను చిన్న పనులుగా విడగొట్టడం వల్ల సులువుగా పూర్తి చేయవచ్చు. ఎలాంటి చికాకు లేకుండా పూర్తి చేసే అవకాశం ఉంటుంది. అతి ముఖ్యమైన పనులను ముందుగా పూర్తి చేయడంపై దృష్టి పెట్టవచ్చు. ఈ పని మీకు తెలియకుండానే మీలో చాలా మార్పునకు కారణమవుతుంది. విజయతీరాలకు చేరుస్తుంది. ఇక నుంచీ వాయిదా అనే మాటను మీ మనసులో నుంచి తీసేయండి.
ఐదు నిమిషాలు..
వ్యాయామం.. జీవితంలో అన్నిటికంటే ముఖ్యమైనది ఇదే! ఒకవేళ గంట పాటు చేయలేకపోతే.. కనీసం రోజుకు ఐదు పది నిమిషాలైనా కేటాయించాలి. చిన్న చిన్న స్ట్రెచింగ్ వ్యాయామాలు మీ దైనందిన జీవితంపై అద్భుతమైన ప్రభావాన్ని చూపిస్తాయి. కొన్నాళ్లు ప్రాక్టీస్ చేయండి. ఆ ఫలితం మీకే తెలుస్తుంది. కండరాలు ఫ్లెక్సిబుల్‌గా మారతాయి. ఒత్తిడి తగ్గుతుంది. శరీరంలో రక్తసరఫరా మెరుగుపడుతుంది. కావలసిన విశ్రాంతి లభిస్తుంది. స్ట్రెచింగ్ వ్యాయామాల కోసం జిమ్‌కు వెళ్లనవసరం లేదు. ఎక్కడైనా చేయవచ్చు. బిజీ షెడ్యూల్ ఉన్నా విరామ సమయంలో లేక పడుకునే ముందు స్ర్టెచింగ్ కోసం కొద్ది సమయాన్ని కేటాయించడం ద్వారా ఊహించని మార్పును సొంతం చేసుకుంటారు. ఆ మార్పు శారీరకంగా, మానసికంగా అనుభవంలోకి వస్తుంది. క్రమంగా అదే అలవాటుగా మారుతుంది. ఎంతోకొంత ఆరోగ్యమైతే మెరుగుపడటం ఖాయం.

రోజూ పావుగంట..
మెదడుకు మేత పఠనమే!. ప్రతీ అక్షరం మనలోని కణాలను పునరుత్తేజం చేస్తుంది. ఆ శక్తి పుస్తకానికే ఉంది. డిజిటల్ యుగంలో చదవడం మరవొద్దు. ప్రతిరోజు ఏదైనా ఒక పుస్తకాన్ని పావుగంట పాటు చదివే అలవాటు చేసుకోవాలి. ఇది జీవితంలో గణనీయమైన మార్పును తీసుకొస్తుంది. ఆ పావుగంట విశ్రాంతి దొరకడంతో పాటు ఆలోచించే సామర్థ్యం పెరుగుతుంది. సమస్యలను వేగంగా పరిష్కరించే నైపుణ్యాలు మెరుగుపడతాయి. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. మతిమరుపు తగ్గుతుంది. కొత్త విషయాలు నేర్చుకోవడానికి మంచి దారి ఇది. రకరకాల అంశాలపై జ్ఞానాన్ని పెంచుకోవచ్చు. చదవడమనేది జీవితంపై సానుకూల ప్రభావం చూపుతుంది. రీడింగ్‌ను అలవాటుగా మార్చుకోవాలంటే ఒక పుస్తకాన్ని చదవడంతో ప్రారంభించండి. ఒకటి రెండు రోజుల్లో ఆ పుస్తకం మొత్తాన్ని చదవలేరు. అందుకే రోజూ ఒకటి రెండు పేజీలు మాత్రమే చదవాలి. మీ లక్ష్యం పుస్తకాన్ని చదవడం మాత్రమే.. ఎన్ని రోజుల్లో చదివారనేది కాదు. కాబట్టి రోజూ కాసేపు చదవడమనేది మీ లక్ష్యాన్ని చేరుకునేలా చేస్తుంది. మెదడుకు చక్కటి వ్యాయామం లభిస్తుంది.

కృతజ్ఞత మరవొద్దు..
మనల్ని పెంచి పోషించినందుకు తల్లిదండ్రులకు జీవితాంతం రుణపడి ఉంటాం. మనల్ని కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకున్న శ్రేయోభిలాషుల్ని ఎప్పటికీ మరిచిపోలేం. ఒక మనిషి కృతజ్ఞతతో ఉండటం అంటే.. విశ్వసనీయ వ్యక్తిత్వానికి నిదర్శనం. థాంక్స్ చెప్పడం ఒక చిన్నమాటే కావచ్చు. కానీ చాలా శక్తిమంతమైన అలవాటు. మంచి జ్ఞాపకాలను నిలిపి ఉంచుకోవడానికి ఇది అద్భుతంగా ఉపయోగపడుతుంది. ప్రతికూల ఆలోచనల నుంచి పాజిటివ్ థింకింగ్ వైపు సాగేందుకు దోహదపడుతుంది. అది ఎంత చిన్న విషయమైనా కృతజ్ఞత చెప్పుకోవాలి. ధ్యానం చేయడం ద్వారా కూడా మీ కృతజ్ఞతా భావాన్ని చూపించొచ్చు. మనలోని మంచితనానికి మనకు మనమే సంతృప్తి చెందడమూ ఒక కృతజ్ఞతే!. ఇదొక స్వభావంగా మారితే మన చుట్టూ ఉన్న స్నేహితులు, బంధువులలో మనకున్న విలువ పెరుగుతుంది.
ధ్యానం దినచర్యగా...
ఈ రోజుల్లో మనసును పలు విధాలుగా లాగే అంశాలు, విషయాలు, సంఘటనలు అనేకం. మనోనిగ్రహం పాటించడం చాలా కష్టం. అందుకే ఆ గందరగోళ ఆలోచనలను కట్టడి చేసి.. మానసిక క్రమశిక్షణ అలవర్చుకోవాలి. రోజూ ఐదు నిమిషాలు ధ్యానం చేయడానికి కేటాయిస్తే మీ జీవితంపై సానుకూల ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ఒత్తిడి తగ్గుతుంది. మంచి నిద్ర పడుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది. పనిపై ఫోకస్ చేయగలుగుతారు. సమయం లేని వాళ్లు గంటల తరబడి ధ్యానం చేయలేదని బాధపడక్కర్లేదు. ఐదు నిమిషాలు టైమ్ సెట్ చేసుకుని శ్వాసపై దృష్టి పెట్టి ధ్యానం చేసినా చాలు. క్రమం తప్పకుండా ధ్యానం చేయడం వల్ల మనస్సుపై నియంత్రణ సాధిస్తారు. ధ్యానాన్ని దినచర్యగా చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు సొంతమవుతాయి.
చెత్తను తొలగించండి...
మెదడు నిండా పిచ్చి పిచ్చి ఆలోచనలు ఉన్నట్లే.. మనం కూర్చున్న డెస్క్, ఉంటున్న ఇల్లు చెత్తతో నిండిపోకూడదు. వెంటనే శుభ్రం చేసేందుకు సిద్ధం కండి. పది నిమిషాలు చాలా తక్కువ సమయం అనిపించొచ్చు. కానీ ఈ సమయంలో చాలా పనులు చేయవచ్చు. మీ డెస్క్‌పై ఉన్న అనవసర వస్తువులు తొలగించవచ్చు. ఫలితంగా మీ మూడ్‌లో మార్పును గమనించవచ్చు. ప్రొడక్టివిటీ పెరుగుతుంది. ఇంటి బీరువాలో అస్తవ్యస్తంగా ఉన్న బట్టలు సర్దడం వంటి పనిచేయవచ్చు. పదినిమిషాలు టైమర్ సెట్ చేసుకోవడం ద్వారా ఇలాంటి పనులు చేయడాన్ని అలవాటు చేసుకోవాలి. తక్కువ సమయంలో ఎంత మార్పును సాధించారో చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. ఇదే అలవాటును వ్యాపారంలో, వృత్తిలో జోడిస్తే అద్భుతమైన ఫలితాలు పొందుతారు. చెత్తను వదిలించుకోవడం కొత్తను ఆహ్వానించడమే!.
పొగడ్తలు మంచివే!
అభినందన... అద్భుత ఔషధం. ఇతరులకు ఇవ్వడం, మనం తీసుకోవడం మంచిదే! కానీ, అతిగా పొగడ్తలు చేసినా.. తీసుకున్నా మంచిది కాదు. అదొక్కటి గుర్తుపెట్టుకోవాలి. ఇతరులను అప్పుడప్పుడు పొగడటం చాలా చిన్న విషయమే. కానీ పొగడ్త చాలా శక్తిమంతమైనది. జీవితంపై అది అద్భుతమైన ప్రభావాన్ని చూపిస్తుంది. మీ చుట్టూ ఉన్న వారి జీవితాలపై కూడా ప్రభావం చూపిస్తుంది. ఒక నిజమైన పొగడ్త ఆనందాన్నిస్తుంది. పొగడటం వల్ల మెదడు ఉత్తేజితమవుతుంది. సామాజిక సంబంధాలు మెరుగుపడతాయి. ఆత్మగౌరవం పెరుగుతుంది. నిజాయితీగా ఉన్న వారినే పొగడ్తల్లో ముంచెత్తాలని గుర్తుపెట్టుకోండి. లేకపోతే ఇతరులు ఆ విషయాన్ని గుర్తిస్తారు. దైనందిన జీవితంలో పాజిటివిటీని వ్యాప్తి చేయడం, దయతో ఉండటం వంటివి అద్భుతమైన ఫలితాలను అందిస్తాయి.
పాడ్‌కాస్ట్ వినండి..
నిత్యం మీరు చెప్పడమే కాదు.. వినడమూ నేర్చుకోవాలి. అందుకు ఓపిక అవసరం. ఇప్పుడన్నీ దృశ్యమాధ్యమాలే కాబట్టి .. చూడటానికి ఎక్కువ ఏకాగ్రత ఖర్చుచేయాల్సి వస్తున్నది. వినడం తగ్గిపోతోంది. కొత్త విషయాలు నేర్చుకోవడానికి, కరెంట్ ఈవెంట్స్ గురించి తెలుసుకోవడానికి పాడ్‌కాస్ట్‌లు బాగా ఉపయోగపడతాయి. వినే అవకాశం లభిస్తుంది. ప్రయాణంలో ఉన్నప్పుడు, ఇంటి పనులు చేస్తున్నప్పుడు, వాకింగ్‌లో ఉన్నప్పుడు పాడ్‌కాస్ట్ వినొచ్చు. మీకిష్టమైన పాలిటిక్స్, సైన్స్, చరిత్ర, పాప్ కల్చర్‌కు సంబంధించిన విషయాలు వినొచ్చు. లిజనింగ్ స్కిల్స్ పెంచుకోవడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఆయా రంగాల్లోని అనుభవజ్ఞుల సలహాలు, సూచనలు తెలుసుకోవచ్చు. మ్యూజిక్‌యాప్స్, యూట్యూబ్, పాడ్‌కాస్ట్ యాప్స్‌లో వినే సౌకర్యం ఉంది.
మనసు చెప్పే మాట
నిర్ణయాలు తీసుకునే సమయంలో మనసు చెప్పే మాటను వినాలి. ఏం తినాలో... ఎవరిని నమ్మాలో... ఏ మార్గాన్ని ఎంచుకోవాలో లాజిక్, రీజన్ ఒక మార్గాన్ని సూచిస్తే... అది సరైనదో కాదో మీకు మనస్సు చెబుతుంది. ఛాయిస్ సంక్లిష్టంగా ఉన్నప్పుడు మనసు సహాయపడుతుంది. ఆపదలను నివారించి సరైన మార్గంలో నడిచేలా చూస్తుంది. నెగెటివ్ ఎమోషన్స్ మన మనసు చెప్పే విషయాలపై ప్రభావం చూపిస్తాయి. అంటే ప్రతికూల ఆలోచనలు గట్ ఫీలింగ్స్‌ని ప్రభావితం చేస్తాయి. రకరకాల అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. శరీరం, మెదడు, మనసుపైన ప్రభావం చూపిస్తాయి.
నియంత్రణలో లేకపోతే...
ప్రతి వ్యక్తికి, వ్యవస్థకు ఒక పరిమితి ఉంటుంది. దాన్ని అతిక్రమించి వెళ్లలేం. అన్నింటినీ నియంత్రిస్తామనుకోవడం పొరపాటు. అన్నీ మనకు నచ్చినట్లే ఉండాలనుకోవడమూ అత్యాశే అవుతుంది. కొన్ని అంశాలు మన నియంత్రణలో ఉండవు. అలాంటి నియంత్రణలో లేని వాటిని గుర్తించడం చాలా ముఖ్యం. వాటిని మార్చేందుకు విలువైన సమయాన్ని కేటాయించడం, ఎనర్జీని వేస్ట్ చేసుకోవడానికి బదులుగా వాటికి సరెండర్ కావాలి. అవి ఎలా ఉంటే అలా యాక్సెప్ట్ చేయాలి. దీనివల్ల ఒత్తిడి, నిరాశ నుంచి విముక్తి లభిస్తుంది. సరెండర్ కావడమంటే పరిస్థితులను మెరుగుపరుచుకునేందుకు ప్రయత్నించడం ఆపేయాలని కాదు. పరిమితులను తెలుసుకుని ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించాలి. సరెండర్ కావడం వల్ల మీరు నియంత్రించగలిగే వాటిపై పూర్తి దృష్టి పెట్టే వీలు దొరుకుతుంది. సరెండర్ కావడమంటే లక్ష్యాలను, కలలను వదులుకోవడం కాదు. మీ నియంత్రణలో లేని అంశాలను వదిలేసి, నియంత్రణలో ఉండే అంశాలపై దృష్టి పెట్టడం మాత్రమే. ఈ చిన్న కిటుకు అనుసరిస్తే ఎంతో మేలు కలుగుతుంది.
దయతో ప్రవర్తించడం...
దయతో ఉండటం చాలా శక్తిమంతమైన అలవాటు. దయ చూపే వారిపైన, దయపొందే వారిపైన ఇది పాజిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది. ఒక అపరిచితుడికి భోజనం డబ్బులు ఇవ్వడం ఆ కోవకు చెందినదే. ఇలాంటి చిన్న చిన్న వాటికి పెద్ద మొత్తంలో డబ్బు అవసరం లేదు. ఎక్కువ సమయం వెచ్చించాల్సిన పనిలేదు. ఇక, సహనమూ ఒక శక్తివంతమైన సాధనమే! ప్రశాంతంగా ఉండటం చాలా మేలు చేస్తుంది. ప్రతి దానికి అతిగా స్పందించడం అనర్థాలకు దారి తీస్తుంది. ఒక నిర్ణయం తీసుకునే ముందు దానివల్ల కలిగే పరిణామాల గురించి ఆలోచించడం అవసరం. కార్పొరేట్ కార్యాలయాల్లో సహనం అనేది ఒక విలువైన ఆస్తి. ఇది కొలీగ్స్‌తో సత్సంబంధాలు కలిగి ఉండటంలో సహాయపడుతుంది. ప్రొడక్టివిటీని పెంచుతుంది. ఇతర అలవాట్లు ఉన్నట్టే సహనాన్ని ఒక అలవాటుగా చేసుకోవాలి. ఇది కాస్త కష్టమే అయినా సాధనతో సాధించవచ్చు.
రోజును అర్థవంతంగా..
ప్రతీ రోజూ మీ చేతుల్లో ఉండాలి. ఏం చేయాలి? ఎక్కడికి వెళ్లాలి? ఎవరిని కలవాలి? అనే అంశాల మీద కచ్చితత్వం ఉండితీరాలి. అప్పుడే ఆ రోజు ఫలప్రదంగా ముగుస్తుంది. నెల, ఏడాది అలాగే ముందుకెళితే అద్భుత ఫలితం లభిస్తుంది. అందుకని ఆ రోజు ఎలా ఉండాలనుకుంటున్నారో ఉదయాన్నే నిర్దేశించుకోండి. పాజిటివ్ ఆటిట్యూడ్‌తో పనిని ప్రారంభించేందుకు ఇది ఉపయోగపడుతుంది. మీ చుట్టూ ఉండే వారితో ఓపికతో కలిసి పని చేసేందుకు తోడ్పడుతుంది. రోజు ఎలా ఉండాలనుకుంటున్నారో నిర్దేశించుకుంటే లక్ష్యాన్ని చేరుకోవడం సులువవుతుంది. దీన్ని అలవాటుగా చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఫోన్‌లో హ్యాబిట్ ట్రాకర్ వంటివి ఉపయోగించి పనితీరును ట్రాక్ చేయాలి.
ఈ అలవాటుతో పాటు.. రివ్యూ కోసం ఐదు నిమిషాలు కేటాయించాలి. రోజూ ఆఫీసు ముగిశాక ఒకసారి పునఃపరిశీలన చేసుకుంటే మంచిది. ఏ పని బాగా చేశారు. ఇంకా ఎక్కడ మెరుగుపడాలో రివ్యూ చేసుకోవాలి. ఈ రివ్యూ మరింత ఫోకస్‌గా పనిచేయడానికి పనికొస్తుంది. మీరు గాడి తప్పేలా చేసే అంశమేమిటో తెలుస్తుంది. ఈ అలవాటును దినచర్యలో భాగంగా చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు సొంతం చేసుకుంటారు.
మీతో మీరు మాట్లాడండి..
ఇల్లు, ఆఫీసు, సమాజం.. నిరంతరం ఇతరులతో మాట్లాడటమే సరిపోతుంది. మీతో మీరు మౌనంగా మాట్లాడుకుని ఎన్ని రోజులు అయ్యింది? ఇప్పుడు సైలెంట్‌గా ఆ పని చేయండి. ఆత్మవలోకనం.. మనలోకి మనం తొంగి చూసుకోవడం.. మాట్లాడుకోవడం అవసరం. ‘‘ఈ రోజు తప్పు చేశాను’ అనుకున్నప్పుడు ‘ఈ రోజు నేను చాలా విలువైనది నేర్చుకున్నాను’’ అని రీఫ్రేమ్ చేసుకోవాలి. ‘ఈ వారం కనీసం 5 శాతం ఎలా మెరుగుపడాలి?’ అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి. ఇలాంటివి మీ మైండ్‌సెట్‌ను మారుస్తాయి.
ప్రముఖ సైకాలజిస్టు కారోల్ డ్వెక్ పరిశోధన ప్రకారం గ్రోత్ మైండ్‌సెట్ కలిగిన వారు వైఫల్యాలను తీర్పులుగా కాకుండా, విలువైన అవకాశాలుగా చూస్తారు. సవాళ్లను సులభంగా స్వీకరిస్తారు. ఎదురుదెబ్బలను ఎక్కువ కాలం ఎదుర్కోగలుగుతారు. ప్రతిరోజూ ఈ అలవాటును ప్రాక్టీస్ చేయడం ద్వారా అద్భుతాలు సాధిస్తారు.
..ఇవన్నీ పెద్ద పెద్ద పనులు అసలే కాదు. చాలా చిన్న చిన్న మార్పులు. గంటలు గంటలు శ్రమించాల్సిందేమీ లేదు. మీ రొటీన్ జీవితానికి కాస్త బ్రేకులు వేసి.. ఈ చిన్న మార్పులు చేసుకోండి. భవిష్యత్తులో పెద్ద పెద్ద అద్భుతాలే జరుగుతాయ్!. నమ్మండి.. ఈ రోజే ప్రారంభించండి!!.
- పన్యాల నరేందర్‌రెడ్డి