Share News

Sumit Nagal: సుమిత్ నగాల్ వీసా దరఖాస్తును తిరస్కరించిన చైనా

ABN , Publish Date - Nov 11 , 2025 | 06:34 PM

ఇండియా టాప్ టెన్నిస్ ప్లేయర్ సుమిత్ నగాల్‌కు చుక్కెదురైంది. అతడు చైనాలో జరిగే ఆస్ట్రేలియన్ ఓపెన్-2026కు అర్హతగా భావించే వైల్డ్‌కార్డ్ ప్లేఆఫ్‌లో ఆడేందుకు అక్కడకు వెళ్లాల్సి ఉంది. ఈ నేపథ్యంలో వీసాకు దరఖాస్తు చేసుకోగా.. డ్రాగన్ దేశం తిరస్కరించింది. దీనిపై సామాజిక మాధ్యమాల్లో భిన్న ప్రతిస్పందనలు వస్తున్నాయి.

Sumit Nagal: సుమిత్ నగాల్ వీసా దరఖాస్తును తిరస్కరించిన చైనా
Sumit Nagal

ఇంటర్నెట్ డెస్క్: భారత అగ్రశ్రేణి టెన్నిస్ ప్లేయర్ సుమిత్ నగాల్‌(Sumit Nagal)కు చుక్కెదురైంది. అతడు ఆస్ట్రేలియన్ ఓపెన్-2026(Australian Open-2026) అర్హత పోటీలుగా భావించే ఈవెంట్లో పోటీ పడేందుకు చైనాకు వెళ్లాల్సి ఉండటంతో.. వీసాకు దరఖాస్తు చేసుకోగా అది తిరస్కరణకు గురైంది(Visa Rejected). ఇందుకు డ్రాగన్ దేశం ఏ కారణాన్నీ వెల్లడించలేదు. ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికగా భారత ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సాధారణ ప్రజలు సైతం వీసాలు పొందుతుండగా.. అథ్లెట్లకు మద్దతు లేకపోవడాన్ని ప్రశ్నిస్తూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


28 ఏళ్ల సుమిత్.. చైనా ఆతిథ్యమివ్వబోతున్న ఆస్ట్రేలియన్ ఓపెన్ ఆసియా-పసిఫిక్ వైల్డ్‌కార్డ్ ప్లేఆఫ్‌(Asia‑Pacific Wildcard Play‑off)లో పోటీ పడేందుకు సన్నద్ధమవుతున్నాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్-2026కు అర్హతగా భావించే ఈ పోటీలు నవంబర్ 24 నుంచి 29 మధ్య చైనాలోని చెంగ్‌డూ(Chengdu)లో జరగనున్నాయి. ఇందులో చైనా, జపాన్, భారత్ సహా ఆసియా దేశాలకు చెందిన అగ్రశ్రేణి ఆటగాళ్లు మెయిన్ డ్రా వైల్డ్‌కార్డ్ కోసం పోటీపడతారు. సుమిత్ ఇందులో క్వాలిఫైయర్‌గా కాకుండా మెయిన్ డ్రాలో స్థానం సంపాదించుకున్నాడు.


అకారణంగా తిరస్కరణకు గురైన తన వీసా సమస్యను నగాల్ X సోషల్ మీడియా వేదికగా షేర్ చేశాడు. ఈ విషయమై చైనా రాయబారి, సంబంధిత కార్యాలయం నుంచి తక్షణ సాయం కోరుతూ.. భారతదేశంలోని చైనా రాయబారి షు ఫీహాంగ్(Xu Feihong), చైనా రాయబార కార్యాలయ ప్రతినిధి యు జింగ్‌(Yu Jing)లకు ట్యాగ్ చేశాడు.


సోషల్ మీడియాలో వ్యతిరేకత..

సుమిత్ నగాల్ విషయంపై సోషల్ మీడియా వినియోగదారులు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. భారత ప్రభుత్వం ఎందుకు జోక్యం చేస్కోలేదని ఒకరు ప్రశ్నించగా.. సాధారణ వ్యక్తులు సులభంగా చైనాకు వెళ్తున్న తరుణంలో ఓ ప్రముఖ అంతర్జాతీయ టెన్నిస్ ఆటగాడి వీసా తిరస్కరణకు గురికావడం వింతగా ఉందని మరొకరు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిని కేంద్ర విదేశాంగ శాఖకు ట్యాగ్ చేస్తూ.. నగాల్ సమస్యను వెంటనే పరిష్కరించాలని వ్యాఖ్యానించారు. భారత్‌లోని అగ్రశ్రేణి టెన్నిస్ ఆటగాళ్లు టోర్నమెంట్లకు వీసా పొందేందుకు ఇబ్బంది పడుతున్న పరిస్థితి తలెత్తడం శోచనీయం అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

2024లో జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్లో సుమిత్.. తనకంటే మెరుగైన ర్యాంక్సింగ్స్ కలిగిన అలెగ్జాండర్ బుబ్లిక్‌(Alexander Bublik)ను ఓడించాడు. దీంతో అతడు మాస్టర్స్-1000 క్లే ఈవెంట్(Masters 1000 clay event) మ్యాచ్ గెలిచిన తొలి భారతీయుడిగా గుర్తింపు పొందాడు. నగాల్.. ప్రస్తుతం ఏటీపీ ర్యాంకింగ్స్‌(ATP Rankings)లో 275వ స్థానంలో ఉన్నాడు. జులై 2024లో కెరీర్‌లోనే అత్యుత్తమంగా 68 పాయింట్లు సాధించాడు. అతడు ఇటీవల అంతగా ఫామ్‌లో లేనప్పటికీ.. భారత అగ్రశ్రేణి పురుషుల సింగిల్స్(Men's singles) ఆటగాడిగా కొనసాగుతున్నాడు.


ఇవీ చదవండి:

Andhra vs Tamil Nadu: తమిళనాడుపై ఆంధ్ర జట్టు సంచలన విజయం

Naseem Shah: పాకిస్థాన్ క్రికెటర్ ఇంటిపై కాల్పులు

Updated Date - Nov 11 , 2025 | 07:02 PM