Smriti Mandhana: అతి త్వరలోనే పెళ్లి.. స్పష్టం చేసిన పలాశ్ తల్లి
ABN , Publish Date - Nov 28 , 2025 | 02:22 PM
భారత స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన-పలాశ్ ముచ్చల్ పెళ్లి తాత్కాలికంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. తాజాగా ఈ విషయంపై పలాశ్ తల్లి అమిత స్పందించారు. అతి త్వరలోనే పెళ్లి జరగనున్నట్లు వెల్లడించారు.
ఇంటర్నెట్ డెస్క్: భారత మహిళా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన(Smriti Mandhana) పెళ్లి తాత్కాలికంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఆమె స్నేహితుడు, సంగీత దర్శకుడు పలాశ్ ముచ్చల్(Palash Muchhal)తో ఈ నెల నవంబర్ 23న వివాహం జరగాల్సి ఉంది. కానీ అదే రోజు పెళ్లికి కొన్ని గంటల ముందు స్మృతి తండ్రి శ్రీనివాస్ మంధాన అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయన్ను హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఇలాంటి పరిస్థితుల్లో తాను వివాహం చేసుకోలేనని స్మృతి నిర్ణయం తీసుకున్నట్లు ఆమె మేనేజర్ తెలిపారు.
ఇంతలోనే..
స్మృతికి కాబోయే భర్త పలాశ్ ముచ్చల్ కూడా అనారోగ్యానికి గురై సాంగ్లీలోని ఓ ఆసుపత్రిలో చేరాడు. చికిత్స అనంతరం డిశ్చార్జి కూడా అయ్యాడు. కానీ తిరిగి అనారోగ్య సమస్యలు తీవ్రం కావడంతో ఈ సారి ముంబైలోని ఆసుపత్రిలో చేరాడు. ఒత్తిడి, అసిడిటీ వల్ల పలాశ్ అనారోగ్యానికి గురయ్యాడని వైద్యులు తెలిపారు. అతడికి ఆక్సిజన్ థెరపీని అందించారు. మూడు వారాలు విశ్రాంతిని సూచించారు. మరోవైపు స్మృతి మంధాన తండ్రి ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యాడు. అయితే వీరి వివాహానికి సంబంధించిన అప్‌డేట్ మాత్రం స్మృతి మంధాన వైపు నుంచి రాలేదు.
పలాశ్ తల్లి ఏమన్నారంటే?
పెళ్లి గురించి పలు చర్చలు మొదలైన నేపథ్యంలో పలాశ్ తల్లి అమిత స్పందించారు. ‘స్మృతి మంధాన, పలాశ్ ముచ్చల్ ఇద్దరూ ప్రస్తుతం కష్టాల్లో ఉన్నారు. పలాశ్.. స్మృతిని అర్ధాంగిగా ఇంటికి తీసుకురావాలని కలలు కన్నాడు. నేను కూడా వారికి ప్రత్యేకంగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేసుకున్నా. ఇప్పుడంతా బాగానే ఉంది. వారిద్దరి వివాహం అతి త్వరలో జరుగుతుంది’ అని అమిత స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి:
దీప్తి శర్మకు జాక్‌పాక్.. రూ. కోట్లు కుమ్మరించిన యూపీ