Share News

Neeraj Chopra: అమ్మపైనా విమర్శలా

ABN , Publish Date - Apr 26 , 2025 | 03:37 AM

నీరజ్‌ చోప్రా ఆహ్వానించిన పాకిస్థాన్‌ అథ్లెట్‌ అర్షద్‌ నదీమ్‌ విషయమై విమర్శలు ఎదుర్కొన్నాడు.ఈ నేపథ్యంలో తన కుటుంబంపై వ్యక్తిగత దూషణలు వస్తున్నందుకు నీరజ్‌ ఆవేదన వ్యక్తం చేశాడు

Neeraj Chopra: అమ్మపైనా విమర్శలా

  • పహల్గాం దాడికి ముందే పాక్‌ అథ్లెట్‌కు ఆహ్వానం

  • నీరజ్‌ చోప్రా ఆవేదన

న్యూఢిల్లీ : ‘నీరజ్‌ చోప్రా క్లాసిక్‌’ పేరిట వచ్చే నెల 24న బెంగళూరులో అంతర్జాతీయ జావెలిన్‌ త్రో పోటీ జరగనుంది. భారత స్టార్‌ నీరజ్‌ చోప్రా స్వయంగా నిర్వహిస్తున్న ఈ ఈవెంట్‌లో ప్రఖ్యాత అంతర్జాతీయ జావెలిన్‌ త్రోయర్లు బరిలోకి దిగుతున్నారు. ఈ పోటీకి పాకిస్థాన్‌కు చెందిన పారిస్‌ ఒలింపిక్స్‌ స్వర్ణ పతక విజేత అర్షద్‌ నదీమ్‌నూ నీరజ్‌ ఆహ్వానించాడు. దీంతో తన కుటుంబంపై వ్యక్తిగత దూషణకు దిగడంపట్ల నీరజ్‌ ఆవేదన వ్యక్తంజేశాడు. ఈమేరకు శుక్రవారం అతడు ఎక్స్‌లో పోస్ట్‌ చేశాడు. ‘అర్షద్‌ను ఆహ్వానించడంపై నాపై ఎన్నో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంలో నా కుటుంబాన్నీ వదలడంలేదు. అసభ్య పదజాలంతో నిందిస్తున్నారు. టెర్రరిస్టుల దాడికి రెండు రోజుల ముందే అథ్లెట్లందరికీ ఆహ్వానాలు పంపాం. 48 గంటల్లో ఎన్నో పరిణామాలు చోటు చేసుకున్నాయి. నా తల్లిని కూడా లక్ష్యంగా చేసుకొని విమర్శించడం ఎంతో బాధిస్తోంది.


గత ఏడాది పారిస్‌ ఒలింపిక్స్‌లో అర్షద్‌ పసిడి పతకం గెలిచినప్పుడు..అతడు కూడా నా కొడుకులాంటివాడేనని అమ్మ చెప్పింది. అప్పట్లో అమ్మపై అంతా ప్రశంసలు కురిపించారు. కానీ సంవత్సరంలో ఎంత తేడా ! ప్రజలు అంత త్వరగా తమ అభిప్రాయాల్ని ఎలా మార్చుకుంటారో అర్థం కావడంలేదు. కారణం లేకుండా నన్ను, నా కుటుంబాన్ని తిడుతున్న వారికి వివరణ ఇవ్వాల్సి రావడం విచారకరం’ అని ఆర్మీలో పని చేస్తున్న నీరజ్‌ వాపోయాడు.

Updated Date - Apr 26 , 2025 | 03:37 AM