Share News

Sunrisers Hyderabad Loss: తీరు మారని రైజర్స్‌

ABN , Publish Date - Apr 24 , 2025 | 04:51 AM

ఆరో ఓటమితో ప్లేఆఫ్స్‌ ఆశలు మరింత దూరంగా ఉన్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను ముంబై ఇండియన్స్‌ 7 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ట్రెంట్‌ బౌల్ట్‌ నాలుగు వికెట్లు, రోహిత్‌ శర్మ అర్ధశతకంతో ముంబై గెలుపొందింది

Sunrisers Hyderabad Loss: తీరు మారని రైజర్స్‌

  • ఆరో ఓటమితో ప్లేఆఫ్స్‌ ఆశలు సంక్లిష్టం

  • క్లాసెన్‌ పోరాటం వృథా

  • బౌల్ట్‌కు 4 వికెట్లు

  • 7 వికెట్లతో ముంబై విజయం

  • అదరగొట్టిన రోహిత్‌

హైదరాబాద్‌: పేలవ ప్రదర్శనను కొనసాగిస్తున్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఆరో ఓటమితో నాకౌట్‌ అవకాశాలను మరింత సంక్లిష్టం చేసుకోగా.. క్రమంగా జోరు పెంచిన ముంబై ఇండియన్స్‌ ఏకంగా మూడో స్థానానికి ఎగబాకింది. రోహిత్‌ శర్మ (46 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లతో 70) వరుసగా రెండో అర్ధ శతకం నమోదు చేయగా.. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ ట్రెంట్‌ బౌల్ట్‌ (4/26) బంతితో విజృంభించడంతో.. ముంబై ఇండియన్స్‌ వరుసగా నాలుగో విజయాన్ని నమోదు చేసింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో ముంబై 7 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను చిత్తు చేసింది. తొలుత హైదరాబాద్‌ 20 ఓవర్లలో 143/8 స్కోరు చేసింది. క్లాసెన్‌ (44 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 71), అభినవ్‌ మనోహర్‌ (37 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 43) పోరాటం వృథా అయింది. దీపక్‌ చాహర్‌ 2 వికెట్లు పడగొట్టాడు. ఛేదనలో ముంబై 15.4 ఓవర్లలో 3 వికెట్లకు 146 పరుగులు చేసి గెలిచింది. సూర్యకుమార్‌ యాదవ్‌ (40 నాటౌట్‌) రాణించాడు. ఉనాద్కట్‌, ఇషాన్‌ మలింగ చెరో వికెట్‌ పడగొట్టారు.


కష్టపడకుండానే..: ఫామ్‌లోకి వచ్చిన ఓపెనర్‌ రోహిత్‌ మరోసారి చెలరేగడంతో.. ముంబై అలవోకగా గెలిచింది. ఛేదనలో ఓపెనర్‌ రికెల్టన్‌ (11)ను స్వల్ప స్కోరుకే ఉనాద్కట్‌ పెవిలియన్‌ చేర్చడంతో.. సన్‌రైజర్స్‌ ఏదైనా అద్భుతం చేస్తుందా? అనిపించింది. కానీ, వన్‌డౌన్‌లో వచ్చిన విల్‌ జాక్స్‌ (22)తో కలసి రెండో వికెట్‌కు 64 పరుగులు జోడించిన రోహిత్‌.. మూడో వికెట్‌కు సూర్యకుమార్‌తో కలసి 53 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. దీంతో ముంబై 26 బంతులు మిగిలుండగానే విజయాన్ని అందుకొంది. పవర్‌ప్లేలో ముంబై 56/1తో నిలిచింది. అయితే, 10వ ఓవర్‌లో అన్సారీ బౌలింగ్‌లో జాక్స్‌ క్యాచవుట్‌ అయ్యాడు. హర్షల్‌ వేసిన 14వ ఓవర్‌లో రోహిత్‌ మూడు బౌండ్రీలతో 15 పరుగులు రాబట్టడంతో.. లక్ష్యం 36 బంతుల్లో 23 పరుగులకు దిగివచ్చింది. రోహిత్‌ను మలింగ క్యాచౌట్‌ చేసినా.. సూర్య 6,4,4తో మ్యాచ్‌ను ముగించాడు.


టాపార్డర్‌ విలవిల..: సొంతగడ్డపై సన్‌రైజర్స్‌ మరోసారి విధ్వంసం సృష్టిస్తుందనుకొంటే.. తుస్సుమంది. టాపార్డర్‌ వైఫల్యంతో 13/4తో పీకల్లోతు కష్టాల్లో పడింది. అయితే, క్లాసెన్‌, మనోహర్‌ ఆరో వికెట్‌కు 99 పరుగుల భాగస్వామ్యంతో గౌరవప్రద స్కోరు అందించారు. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌.. ముంబై పేసర్లు చాహర్‌, బౌల్ట్‌ దెబ్బకు విలవిల్లాడింది. రెండో ఓవర్‌లో ఓపెనర్‌ హెడ్‌ (0)ను డకౌట్‌ చేసిన బౌల్ట్‌.. తన తర్వాతి ఓవర్‌లో అభిషేక్‌ శర్మ (8)ను పెవిలియన్‌ చేర్చాడు. వన్‌డౌన్‌లో వచ్చిన ఇషాన్‌ కిషన్‌ (1) చాహర్‌ బౌలింగ్‌లో అవుట్‌గా వెనుదిరిగిన తీరు అందరినీ ఆశ్చర్యపర్చింది. ఎవరూ అప్పీలు కూడా చేయకపోయినా.. అతడు వికెట్లను వదిలేసి వెళ్లడంతో వైడ్‌ ఇవ్వాల్సిన అంపైర్‌ అవుట్‌గా ప్రకటించాడు. బ్యాట్‌ను బంతి తాకలేదని రీప్లేలో నిర్ధారణ అయింది. నితీశ్‌ కుమార్‌ (2)ను కూడా చాహర్‌ అవుట్‌ చేయడంతో.. పవర్‌ప్లేలో రెండు బౌండ్రీలు మాత్రమే బాదిన హైదరాబాద్‌ 24/4తో నిలిచింది. కానీ, అనికేత్‌ను అవుట్‌ చేసి హార్దిక్‌ దెబ్బకొట్టాడు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన మనోహర్‌.. క్లాసెన్‌కు సహకారం అందించడంతో హైదరాబాద్‌ క్రమంగా కోలుకొంది. బుమ్రా బౌలింగ్‌లో సిక్స్‌తో వావ్‌ అనిపించిన మనోహర్‌.. డెత్‌ ఓవర్లలో జోరు పెంచాడు. మరోవైపు క్లాసెన్‌ ఈ సీజన్‌లో తొలి ఫిఫ్టీ పూర్తి చేసుకొన్నాడు. 19వ ఓవర్‌లో బుమ్రా బౌలింగ్‌లో సిక్స్‌ బాదిన క్లాసెన్‌.. ఆ తర్వాతి బంతికి క్యాచవుటయ్యాడు. మనోహర్‌, కమిన్స్‌ (1)ను అవుట్‌ చేసిన బౌల్ట్‌.. హైదరాబాద్‌ స్కోరును 150 మార్క్‌ చేరకుండా అడ్డుకొన్నాడు.


  • స్కోరుబోర్డు

సన్‌రైజర్స్‌: హెడ్‌ (సి) నమన్‌ (బి) బౌల్ట్‌ 0, అభిషేక్‌ (సి) విఘ్నేష్‌ (బి) బౌల్ట్‌ 8, ఇషాన్‌ (సి) రికెల్టన్‌ (బి) చాహర్‌ 1, నితీశ్‌ (సి) శాంట్నర్‌ (బి) చాహర్‌ 2, క్లాసెన్‌ (సి) తిలక్‌ (బి) బుమ్రా 71, అనికేత్‌ (సి) రికెల్టన్‌ (బి) హార్దిక్‌ 12, అభినవ్‌ మనోహర్‌ (హిట్‌ వికెట్‌) బౌల్ట్‌ 43, కమిన్స్‌ (బి) బౌల్ట్‌ 1, హర్షల్‌ (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు: 4; మొత్తం: 20 ఓవర్లలో 143/8; వికెట్ల పతనం: 1-2, 2-9, 3-13, 4-13, 5-35, 6-134, 7-142, 8-143; బౌలింగ్‌: చాహర్‌ 4-0-12-2, బౌల్ట్‌ 4-0-26-4, బుమ్రా 4-0-39-1, శాంట్నర్‌ 4-0-19-0, హార్దిక్‌ 3-0-31-1, విఘ్నేష్‌ 1-0-15-0.

ముంబై: రికెల్టన్‌ (సి అండ్‌ బి) ఉనాద్కట్‌ 11, రోహిత్‌ (సి) అభిషేక్‌ (బి) మలింగ 70, జాక్స్‌ (సి) మనోహర్‌ (బి) అన్సారి 22, సూర్యకుమార్‌ (నాటౌట్‌) 40, తిలక్‌ వర్మ (నాటౌట్‌) 2, ఎక్స్‌ట్రాలు 1, మొత్తం: 15.4 ఓవర్లలో 146/3, వికెట్లపతనం: 1-13, 2-77, 3-130, బౌలింగ్‌: కమిన్స్‌ 3-0-31-0, ఉనాద్కట్‌ 3-0-25-1, హర్షల్‌ పటేల్‌ 3-0-21-0, మలింగ 3-0-33-1, జీషన్‌ అన్సారి 3.4-0-36-1.

Updated Date - Apr 24 , 2025 | 05:01 AM