Share News

India vs England: హనుమాన్‌ చాలీసా నుంచి పాప్‌ గీతాల వరకు..

ABN , Publish Date - Jul 19 , 2025 | 05:20 AM

నాలుగో టెస్టు కోసం భారత జట్టు కెంట్‌ కౌంటీ క్రికెట్‌ గ్రౌండ్‌లో జోరుగా ప్రాక్టీస్‌ చేస్తోంది.

India vs England: హనుమాన్‌ చాలీసా నుంచి పాప్‌ గీతాల వరకు..
India vs England

మాంచెస్టర్‌: నాలుగో టెస్టు కోసం భారత జట్టు కెంట్‌ కౌంటీ క్రికెట్‌ గ్రౌండ్‌లో జోరుగా ప్రాక్టీస్‌ చేస్తోంది. లండన్‌ నుంచి బెకెన్‌హామ్‌లోని ఈ మైదానం కోసం ఆటగాళ్లంతా గంటపాటు ప్రయాణించారు. ఈక్రమంలో అలిసిపోయినట్టు కనిపించిన వీరంతా డ్రెస్సింగ్‌ రూమ్‌లో తమకిష్టమైన సంగీతాన్ని వింటూ సేద తీరారు. ఇందులో హనుమాన్‌ చాలీసా నుంచి ఇంగ్లిష్‌ పాప్‌ గీతాలు, పంజాబీ హిట్స్‌ కూడా ఉన్నాయి. ఇక పంత్‌, బుమ్రా వామప్‌ చేసి కొంచెం సేపు జిమ్‌లో గడిపారు. బుమ్రాతో పాటు సిరాజ్‌ మాత్రం బౌలింగ్‌ వేయలేదు.

‘కుల్దీప్‌ను ఆడించాలి’

ఇంగ్లండ్‌తో జరిగే నాలుగో టెస్టులో స్పెషలిస్ట్‌ స్పిన్నర్‌ కుల్దీ్‌పతో పాటు పేసర్‌ అర్ష్‌దీ్‌పలను ఆడించాలని మాజీ కెప్టెన్‌ వెంగ్‌సర్కార్‌ సూచించాడు. ‘అర్ష్‌దీప్‌ బంతిని చక్కగా స్వింగ్‌ చేయగలడు. అలాగే పాత బంతితో రివర్స్‌ స్వింగ్‌ను కూడా రాబట్టగలడు. ఇంగ్లండ్‌ పిచ్‌లపై ఇలా చేయగలగడం భారత్‌కు లాభిస్తుంది. అలాగే స్పిన్నర్‌ కుల్దీప్‌ సైతం జట్టుకు కీలకంగా మారతాడు. ఇక వీరిని భర్తీ చేసేందుకు నితీశ్‌ కుమార్‌, సుందర్‌లను పక్కకు తప్పించవచ్చు. టెస్టుల్లో గెలవాలంటే కచ్చితంగా ఐదుగురు బౌలర్లు ఉండాల్సిందే. ఎందుకంటే ఆరుగురు బ్యాటర్లు భారీ స్కోరు సాధించలేకపోతే, కనీసం బౌలర్లయినా బాధ్యత తీసుకుంటారు. పార్ట్‌ టైమ్‌ బౌలర్లతో మ్యాచ్‌లు గెలవలేం’ అని వెంగీ తెలిపాడు.

డ్యూక్‌ బంతుల నాణ్యతపై చర్చ

భారత్‌-ఇంగ్లండ్‌ జట్ల మధ్య జరుగుతున్న ఐదు టెస్టుల సిరీ్‌సలో డ్యూక్‌ బంతుల నాణ్యతపై అధికంగా చర్చ సాగుతోంది. ఇప్పటిదాకా జరిగిన మూడు టెస్టుల్లోనూ బంతి ఆకారంపై భారత ఆటగాళ్లు అంపైర్లకు పదేపదే ఫిర్యాదు చేయడం తెలిసిందే. ముఖ్యంగా 30 ఓవర్ల తర్వాత ఈ సమస్య ఎక్కువగా వస్తోంది. దీంతో పదే పదే బంతులను మార్చుతుండడంతో ఆటకు కూడా అంతరాయం కలుగుతోంది. అటు విశ్లేషకులు సైతం డ్యూక్‌ బంతుల పనితీరుపై సందేహాలు వ్యక్తం చేశారు. తొలి టెస్టు ముగిశాక భారత కెప్టెన్‌ గిల్‌ బాహాటంగానే ఈ విషయమై తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. డ్యూక్‌ బాల్స్‌ త్వరగా గట్టితనాన్ని కోల్పోతున్నట్టు, దీంతో బ్యాటర్లకు అనుకూలంగా మారుతున్నాయని ఆరోపించాడు. బంతి మెత్తబడితే పేసర్లకు ఉపయోగం ఉండదని, ఎందుకు ఇలా అవుతున్నాయో అర్థం కావడం లేదని చెప్పాడు.


అటు ఇంగ్లండ్‌ కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ సైతం డ్యూక్‌ బంతులపై ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. తాము విదేశాలకు వెళ్లినప్పుడు ఇలాంటి సమస్య వచ్చేదని, కానీ ఇప్పుడు డ్యూక్‌ బంతులు కూడా మృదువుగా మారి ఆకారం కోల్పోవడం బాగాలేదన్నాడు. దీనిపై ఏదో ఒక పరిష్కారం కనుక్కోవాలని సూచించాడు. ఇలా అన్ని వైపుల నుంచి విమర్శలు వ్యక్తమవుతుండడంతో డ్యూక్‌ బంతుల తయారీదారులు స్పందించారు. ఆ బంతులను క్షుణ్ణంగా పరిశీలిస్తామని బ్రిటిష్‌ క్రికెట్‌ బాల్స్‌ లిమిటెడ్‌ యజమాని దిలీప్‌ జజోడియా తెలిపాడు. ‘మేం ఇప్పటిదాకా జరిగిన మూడు మ్యాచ్‌ల్లో వాడిన బంతులను పరిశీలిస్తాం. తయారీ నిపుణులతో సమీక్షించడమే కాకుండా, బంతుల తయారీకి వాడే ముడిసరుకులపై కూడా రివ్యూ నిర్వహిస్తాం’ అని చెప్పాడు.

ఇవి కూడా చదవండి

యూట్యూబ్ హైప్‌ ప్రారంభం.. ఎలా ఉపయోగించాలో తెలుసా..

ఎయిర్ పోర్టులో 10వ తరగతితో ఉద్యోగాలు..లాస్ట్ డేట్ ఎప్పుడంటే

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 19 , 2025 | 05:20 AM