India vs England: తొలి రోజు తడబ్యాటు
ABN , Publish Date - Aug 01 , 2025 | 06:11 AM
గత మ్యాచ్‌లో అద్భుత పోరాటంతో అంచనాలు పెంచిన భారత బ్యాటర్లు అంతలోనే ఉసూరుమనిపించారు

అర్ధ శతకంతో ఆదుకొన్న కరుణ్ నాయర్
వోక్స్‌కు గాయం ఫ ఇంగ్లండ్‌తో ఐదో టెస్ట్
లండన్: గత మ్యాచ్‌లో అద్భుత పోరాటంతో అంచనాలు పెంచిన భారత బ్యాటర్లు అంతలోనే ఉసూరుమనిపించారు. పేసర్లకు సహకరిస్తున్న పిచ్‌పై ఇంగ్లండ్ ద్వితీయ శ్రేణి బౌలర్లను ఎదుర్కోవడంలో టాపార్డర్ బ్యాటర్లు విఫలమైన చోట.. అనూహ్యంగా రీఎంట్రీ ఇచ్చిన కరుణ్ నాయర్ (52 బ్యాటింగ్) అర్ధ శతకంతో జట్టును ఆదుకొన్నాడు. దీంతో గురువారం ఆరంభమైన వర్ష ప్రభావిత ఐదవ, ఆఖరి టెస్ట్‌లో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 64 ఓవర్లలో 6 వికెట్లకు 204 పరుగులు చేసింది. రోజు ఆఖరుకు నాయర్‌తోపాటు సుందర్ (19 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. సాయి సుదర్శన్ (38), శుభ్‌మన్ గిల్ (21) భారీ స్కోర్లు చేయలేక పోయారు. అట్కిన్సన్, జోష్ టంగ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఓవరాల్‌గా మొదటి రోజు ఇంగ్లండ్‌దే పైచేయిగా నిలిచింది. కాగా, ప్రధాన పేసర్ వోక్స్ ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డాడు.
జైస్వాల్ మళ్లీ ఫ్లాప్..: పచ్చని పిచ్.. మేఘావృతమైన ఆకాశం. దీంతో మరో ఆలోచన లేకుండా ఇంగ్లండ్ కెప్టెన్ పోప్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకొన్నారు. అతడి అంచనా తప్పుకాదన్నట్టు తొలి సెషన్‌లోనే భారత ఓపెనర్లు జైస్వాల్ (2), రాహుల్ (14)ను అవుట్ చేసి ఇంగ్లండ్ దెబ్బకొట్టినా.. సుదర్శన్ నిలకడగా ఆడుతూ జట్టును ఆదుకొనే ప్రయత్నం చేశాడు. తన రెండో ఓవర్‌లోనే జైస్వాల్‌ను అట్కిన్సన్ ఎల్బీగా వెనక్కిపంపాడు. అంపైర్ స్పందించక పోవడంతో.. రివ్యూకు వెళ్లిన ఇంగ్లండ్ ఫలితాన్ని సాధించింది. ఇతర పేసర్లు టంగ్, ఓవర్టన్ బౌలింగ్ గతి తప్పడంతో మరో ఓపెనర్ రాహుల్, వన్‌డౌన్‌లో వచ్చిన సాయి సుదర్శన్ క్రీజులో పాతుకుపోయేందుకు ప్రయత్నించారు. వీరిద్దరి భాగస్వామ్యం బలపడుతున్న సమయంలో కీలక రాహుల్‌ను వోక్స్ పెవిలియన్ చేర్చాడు. అయితే, సుదర్శన్, గిల్ ఆచితూచి ఆడుతూ స్కోరు బోర్డును నడిపించారు. టంగ్, వోక్స్ బౌలింగ్‌లో సుదర్శన్ రెండు ఫోర్లు కొట్టగా.. గిల్ కూడా చూడముచ్చటైన షాట్లతో బౌండ్రీలు సాధించాడు. అకస్మాత్తుగా వర్షం
కురవడంతో.. ముందుగానే లంచ్‌కు వెళ్లాల్సి వచ్చింది. ఈ సమయానికి భారత్ 72/2తో నిలిచింది.
గిల్ తొందరపాటు..: వర్షం కారణంగా రెండో సెషన్‌లో ఆరు ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైనా.. గిల్ వికెట్ చేజార్చుకోవడం భారత్‌కు కోలుకోలేని దెబ్బ. వరుణుడి కారణంగా రెండో సెషన్ ఆలస్యంగా ఆరంభమైంది. అయితే, 27వ ఓవర్‌లో అట్కిన్సన్ బౌలింగ్‌లో డిఫెన్స్ ఆడిన గిల్.. లేని సింగిల్ కోసం యత్నించి రనౌట్ కావడంతో.. మూడో వికెట్‌కు 45 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. మళ్లీ వర్షం కురవడంతో.. టీ సమయానికి భారత్ 85/3 స్కోరు చేసింది.
భారత్ 119/3: ఆఖరి సెషన్‌లో సుదర్శన్‌తోపాటు ఫామ్‌లో ఉన్న జడేజా (9)ను టంగ్ అవుట్ చేయడంతో.. ఇంగ్లండ్ పైచేయి సాధించింది. అయితే, నాయర్, సుందర్ ఏడో వికెట్‌కు అజేయంగా 51 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో.. ఈ ఒక్క సెషన్‌లో 3 వికెట్లు కోల్పోయిన భారత్ 119 పరుగులు జోడించింది. వర్షం ఆగడంతో ఈ సెషన్‌ను అరగంటపాటు పొడిగించారు. నాయర్ ఇంగ్లండ్ పేసర్ల సహనాన్ని పరీక్షించగా.. రెండు బౌండ్రీలతో గేర్ మార్చే ప్రయత్నం చేసిన సుదర్శన్ టీమ్ స్కోరును సెంచరీ మార్క్ దాటించాడు. కానీ, టంగ్ అద్భుతమైన అవుట్ స్వింగర్‌తో పెవిలియన్ చేర్చాడు. జడేజాను కూడా టంగ్ అవుట్ చేయడంతో.. భారత్ 123/5తో ఇబ్బందుల్లో పడింది. ఈ దశ నాయర్‌కు జత కలసిన ధ్రువ్ జురెల్ (19) రక్షణాత్మకంగా ఆడుతూ ఆరో వికెట్‌కు 30 పరుగుల భాగస్వామ్యంతో ఆదుకొనే ప్రయత్నం చేశారు. జురెల్‌ను అట్కిన్సన్ వెనక్కిపంపాడు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన సుందర్‌తో కలసి నాయర్ పోరాటాన్ని కొనసాగించాడు. వీలుచిక్కినప్పుడల్లా షాట్లు ఆడిన కరుణ్ ఫిఫ్టీ పూర్తి చేసుకోగా.. స్కోరు 200 మార్క్ దాటింది.