Indian Hockey: భారత హాకీకి వందేళ్లు!
ABN , Publish Date - Nov 07 , 2025 | 01:42 PM
1925లో అంతర్జాతీయ హాకీలో అడుగుపెట్టిన భారత హాకీ నేటికి వందేళ్లు పూర్తి చేసుకుంది. స్వర్ణయుగం నుంచి టోక్యో, పారిస్ కాంస్యాలతో తిరిగి పాత వైభవం దిశగా సాగుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: హాకీ.. క్రీడా సంస్కృతే లేని భారత దేశాన్ని ఒలింపిక్స్ మెరుపులతో అగ్రస్థానంలో నిలిపింది. ఇప్పుడంటే క్రికెట్ మాయలో పడి దీన్ని మర్చిపోయాం కానీ ఒకప్పుడు హాకీ ఈ దేశపు గుండె చప్పుడు. మేజర్ ధ్యాన్‌చంద్, బల్బీర్ సింగ్ సీనియర్, ధన్రాజ్ పిళ్లై వంటి దిగ్గజాలను ప్రపంచానికి పరిచయం చేసింది. భారత హాకీ జట్టు అంతర్జాతీయ హాకీ(1925-2025)లో అడుగు పెట్టి నేటికి వందేళ్లు పూర్తయింది.
హాకీ ప్రస్థానమిది..!
1850లో ఆంగ్లేయులు భారత్‌కు హాకీని పరిచయం చేశారు. దాదాపు 75 ఏళ్ల తర్వాత.. 1925 నవంబర్‌లో భారత హాకీ(Indian hockey)కి తనకంటూ ఓ పాలకవర్గాన్ని ఏర్పాటు చేయడం కోసం కొంత మంది వ్యక్తులు గ్వాలియర్‌లో సమావేశం అయ్యారు. అలా మొదలైందే ఇండియన్ హాకీ ఫెడరేషన్(ఐహెచ్ఎఫ్). ఇందులో సభ్యత్వం పొందిన తొలి దేశం యూరప్ కానీ.. జట్టు మాత్రం భారత్‌దే. ఈ హాకీ సమాఖ్య అధికారికంగా ఏర్పడిన తర్వాత భారత హాకీ సత్తా ఏంటో ప్రపంచానికి తెలిసింది. 1926లో తొలిసారిగా న్యూజిలాండ్ టూర్‌కు వెళ్లిన భారత జట్టు 21 మ్యాచ్‌లు ఆడగా.. 18 గెలిచింది. ఈ పర్యటనలోనే హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్‌చంద్(Dhyan Chand) ప్రపంచానికి పరిచయమయ్యాడు.
క్రమంగా వెనకపడింది..
భారత హాకీ జట్టు క్రమంగా వెనకపడుతూ వచ్చింది. 1975లో ఎఫ్ఐహెచ్ ఆస్ట్రో టర్ఫ్‌ను ప్రవేశ పెట్టడం కూడా ఆట దెబ్బతినడానికి కారణమైంది. టర్ఫ్‌లపై ఆడటానికి జట్టు త్వరగా అలవాటు పడలేకపోయింది. దీనికి తోడు నిధుల లేమి.. టర్ఫ్‌లపై ఆడటంలో భారత హకీ జట్టు నైపుణ్యం సాధించేలోపే మిగతా జట్లు చాలా ముందుకు వెళ్లిపోయాయి. ఎంతో వేగంగా హాకీ జట్టు తన ప్రాభవాన్ని కోల్పోయింది. 1984 నుంచి 2016 వరకు ఒలింపిక్స్‌లో ఒక్క పతకం కూడా గెలవలేకపోయింది. ఈ క్రమంలో దేశంలో క్రికెట్ ఆదరణ పెరిగింది. క్రికెట్‌పై అభిమానం కాస్తా మతంలా మారిపోయింది. ఈ నేపథ్యంలో హాకీ ప్రమాణాలను అభిమానులు కూడా పట్టించుకోవడం మర్చిపోయారు.
40 దశాబ్దాల నిరీక్షణకు తెర..
1928లో జరిగిన తొలి ఒలింపిక్స్‌లోనే భారత్ పసిడి సాధించింది. ఆ తర్వాత 1928 నుంచి 1956 వరకు ఒలింపిక్స్‌లో వరుసగా ఆరు స్వర్ణాలు సాధించి.. తన ఆధిపత్యాన్ని ప్రపంచానికి చాటింది. ఇప్పటి వరకు భారత హాకీ 8 ఒలింపిక్ బంగారు పతకాలు, నాలుగు కాంస్యాలు గెలుచుకుంది. అయితే 1984 నుంచి 2016 వరకు ఒలింపిక్స్‌లో ఒక్క పతకం కూడా గెలవలేకపోయింది. ఎట్టకేలకు 40 దశాబ్దాల నిరీక్షణకు తెరదింపుతూ 2020 టోక్యో ఒలింపిక్స్(Tokyo Olympics)లో కాంస్య పతకం గెలిచిన భారత జట్టు.. పూర్వ వైభవం దిశగా తొలి అడుగు వేసింది. తిరిగి పారిస్(2024) క్రీడల్లోనూ కాంస్యాన్ని గెలిచి ఉజ్వల భవిష్యత్తుపై ఆశలు రేపింది. ఇప్పుడు భారత్ నంబర్ వన్ జట్టు కాకపోయినా.. బలమైన ప్రత్యర్థే.
ఈ వార్తలు కూడా చదవండి:
మాజీ సెలెక్టర్ లైంగికంగా వేధించాడు: జహనారా ఆలమ్
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి