Indian Athletes Reaction: పాకిస్థాన్‌తో ఆటలు వద్దే వద్దు
ABN , Publish Date - Apr 24 , 2025 | 04:21 AM
పహల్గాం ఉగ్రదాడిని ఖండించిన క్రీడా ప్రముఖులు పాకిస్థాన్‌తో అన్ని క్రీడా సంబంధాలు తెంచాలని డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు

అథ్లెట్ల డిమాండ్
పహల్గాం ఉగ్ర దాడికి ఖండన
న్యూఢిల్లీ: పహల్గాంలో ఉగ్ర దాడిని దేశ క్రీడారంగం తీవ్రంగా ఖండించింది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది. ఉగ్ర దాడి నేపథ్యంలో పాకిస్థాన్‌తో క్రీడా సంబంధాలను తక్షణమే తెంచుకోవాలని కొందరు అథ్లెట్లు డిమాండ్ చేశారు. పహల్గాంలోని పర్యాటక ప్రదేశంపై మంగళవారం టెర్రరిస్టులు దాడి చేసి ఎంతోమందిని పొట్టనబెట్టుకున్న సంగతి తెలిసిందే. పాకిస్థాన్‌కు చెందిన నిషేధిత లష్కర్-ఎ-తాయిబా అనుబంధ సంస్థ ‘ద రెసిస్టెన్స్ ఫోర్స్’ తామే ఈ చర్యకు పాల్పడినట్టు ప్రకటించుకుంది.
ఆ ఘటన షాక్‌కు గురిచేసింది. మృతుల కుటుంబాలకు సానుభూతి. ఆ కుటుంబాలు ఎంత వేదనకు లోనవుతున్నాయో..
-సచిన్ టెండూల్కర్
మృతుల ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నా. ఈ ఘోర ఘటనలో బాధితులకు న్యాయం జరగాలి.
-విరాట్ కోహ్లీ, బుమ్రా, సూర్యకుమార్
మతం పేరిట మారణహోమం సృష్టించి అమాయకులను బలిగొనడం దారుణం. ఇది క్షమార్హం కాదు.
-మహ్మద్ సిరాజ్
మృతుల కుటుంబాలకోసం ప్రార్థిస్తున్నా. ఈ ఘటనకు భారత్ తప్పకుండా ప్రతి దాడి చేస్తుంది.
-బీజేపీ మాజీ ఎంపీ, భారత జట్టు కోచ్ గంభీర్
అమాయక భారతీయులను హత్య చేయడమే పాకిస్థాన్ జాతీయ క్రీడలా ఉంది. ఆ దేశంతో అన్ని క్రీడా సంబంధాలను నిలిపి వేయాలి.
-మాజీ క్రికెటర్ శ్రీవత్స గోస్వామి
ఈ ఘటనతో నా హృదయం గాయపడింది. మృతుల కుటుంబాల బాధ వర్ణించలేనిది.
-సింధు
జమ్మూకశ్మీర్ ఉదంతంతో నా గుండె బద్దలైంది.
-నీరజ్ చోప్రా
పిరికి పందల చర్య. ఇందుకు కారణమైన వారిని వదలకూడదు.
-రవిశాస్త్రి