Share News

Test Cricket: ఇంగ్లండ్‌ పోరాడినా..భారత్‌దే ఆధిక్యం

ABN , Publish Date - Jul 05 , 2025 | 04:08 AM

ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టును టీమిండియా శాసించే దిశగా సాగుతోంది. ప్రస్తుతం గిల్‌ సేన 244 పరుగుల స్పష్టమైన ఆధిక్యంలో ఉంది. శనివారం ఆటలో వేగంగా ఆడి భారీ లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందుంచితే మ్యాచ్‌ ఫలితాన్ని ఆశించవచ్చు.

 Test Cricket: ఇంగ్లండ్‌ పోరాడినా..భారత్‌దే ఆధిక్యం

బర్మింగ్‌హామ్‌: ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టును టీమిండియా శాసించే దిశగా సాగుతోంది. ప్రస్తుతం గిల్‌ సేన 244 పరుగుల స్పష్టమైన ఆధిక్యంలో ఉంది. శనివారం ఆటలో వేగంగా ఆడి భారీ లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందుంచితే మ్యాచ్‌ ఫలితాన్ని ఆశించవచ్చు. అయితే మూడో రోజు శుక్రవారం రెండు సెషన్లపాటు ఇంగ్లండ్‌ జట్టే ఆధిపత్యం చూపింది. ఓ దశలో 84/5తో ఇబ్బందుల్లో పడిన ఇంగ్లండ్‌ను జేమీ స్మిత్‌ (184 నాటౌట్‌), హ్యారీ బ్రూక్‌ (158) అసాధారణ ఇన్నింగ్స్‌తో గట్టెక్కించే ప్రయత్నం చేశారు. ఆరో వికెట్‌కు ఈ జోడీ 303 పరుగులను జత చేయడం విశేషం. అయితే చివరి సెషన్‌లో పేసర్లు సిరాజ్‌ (6/70), ఆకాశ్‌ (4/88) దెబ్బతీయడంతో ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 89.3 ఓవర్లలో 407 పరుగులకు ఆలౌటైంది. అనంతరం 180 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన భారత్‌ ఆట ముగిసే సమయానికి 13 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 64 పరుగులతో ఆడుతోంది. జైస్వాల్‌ (28) వేగంగా ఆడగా, క్రీజులో రాహుల్‌ (28 బ్యాటింగ్‌), కరుణ్‌ (7 బ్యాటింగ్‌) ఉన్నారు.


స్మిత్‌ మెరుపు శతకం: 77/3 ఓవర్‌నైట్‌ స్కోరుతో ఇన్నింగ్స్‌ ఆరంభించిన ఇంగ్లండ్‌ ఆరంభంలోనే మరో రెండు వికెట్లు కోల్పోయింది. పేసర్‌ సిరాజ్‌ వరుస బంతుల్లో రూట్‌ (22), కెప్టెన్‌ స్టోక్స్‌ (0)లను అవుట్‌ చేయడంతో ఆతిథ్య జట్టు 84/5 స్కోరుతో దయనీయ స్థితిలో నిలిచింది. కానీ జేమీ స్మిత్‌ ఎదురుదాడిని భారత బౌలర్లు ఊహించలేదు. వన్డే తరహాలో అతడు బ్యాట్‌ ఝుళిపించడంతో పరుగుల వరద పారింది. అయితే పేసర్‌ ప్రసిద్ధ్‌ షార్ట్‌ పిచ్‌ బంతులతో ఇబ్బందిపెట్టాలని చూశాడు. కానీ స్మిత్‌ ధాటికి అతడి వ్యూహం పనిచేయలేదు. పైగా అతడి ఓవర్‌లోనే 4,6,4,4,4తో 23 పరుగులు రాబట్టాడు. అటు స్పిన్నర్లు జడేజా, సుందర్‌లను సైతం స్మిత్‌ వదలకుండా బౌండరీలతో జోరును చూపాడు. ఈ బాదుడుకు లంచ్‌ బ్రేక్‌కు కాస్త ముందుగానే 80 బంతుల్లోనే కెరీర్‌లో రెండో శతకం కూడా పూర్తి చేశాడు. అటు చక్కటి సహకారం అందించిన బ్రూక్‌ 91 పరుగులు సాధించగా, తొలి సెషన్‌లో ఇంగ్లండ్‌ 27 ఓవర్లలో ఏకంగా 172 పరుగులు రాబట్టింది.


thrht.jpg

వికెట్‌ లేకుండానే..: రెండో సెషన్‌లోనూ స్మిత్‌-బ్రూక్‌ జోడీని విడదీసేందుకు భారత బౌలర్లు చెమటోడ్చినా ఫలితం లేకపోయింది. ఇక తొలి టెస్టులో 99 పరుగుల వద్ద వెనుదిరిగిన హ్యారీ బ్రూక్‌ ఈసారి ఎలాంటి పొరపాటూ చేయలేదు. తన తొమ్మిదో శతకాన్ని పూర్తి చేశాడు. మరోవైపు నితీశ్‌ ఓవర్‌లో స్మిత్‌ క్లిష్టమైన క్యాచ్‌ను పంత్‌ డైవ్‌ చేసి పట్టాలనుకున్నా బంతి అందలేదు. ఈ సెషన్‌లో భారత్‌కు దక్కిన అవకాశం ఇదొక్కటే. ఇద్దరూ చెత్త బంతుల కోసం ఓపిగ్గా ఎదురుచూసి బౌండరీలు రాబట్టారు. చివరకు 355/5 స్కోరుతో ఇంగ్లండ్‌ టీ బ్రేక్‌కు వెళ్లగా.. అప్పటికి స్మిత్‌-బ్రూక్‌ జోడీ ఆరో వికెట్‌కు అజేయంగా 271 పరుగులు అందించింది. మొత్తంగా ఈ సెషన్‌లో జట్టు 28 ఓవర్లలో 106 పరుగులు సాధించింది.


కొత్త బంతితో..: వికెట్ల కోసం ఎదురుచూస్తున్న భారత్‌కు చివరి సెషన్‌ అవకాశం కల్పించింది. కొత్త బంతితో పేసర్లు ఆకాశ్‌, సిరాజ్‌ చెలరేగడంతో ఎదురుచూపులు ఫలించాయి. ముందుగా బ్రూక్‌ను ఆకాశ్‌ బౌల్డ్‌ చేశాడు. దీంతో ఆరో వికెట్‌కు 303 పరుగుల భారీ భాగస్వామ్యం ముగిసింది. కాసేపటికే వోక్స్‌ (5)ను ఆకాశ్‌.. కార్స్‌ (0)ను సిరాజ్‌ వరుస ఓవర్లలో అవుట్‌ చేశారు. ఓవైపు స్మిత్‌ క్రీజులో నిలిచినా మరో ఎండ్‌లో మిగిలిన ఇద్దరినీ సిరాజ్‌ అవుట్‌ చేసి 6 వికెట్లతో అదుర్స్‌ అనిపించాడు.

గిల్‌ తలకుబలంగా..

మూడో రోజు తొలి సెషన్‌లో కెప్టెన్‌ గిల్‌ తలకు బంతి బలంగా తాకడం ఆందోళన కలిగించింది. జడేజా ఓవర్‌లో హ్యారీ బ్రూక్‌ ఆడిన బంతి తొలి స్లిప్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న గిల్‌ వైపు వెళ్లింది. దీన్ని అందుకోవడంలో తను కాస్త ఆలస్యంగా స్పందించగా ఆ బంతి అతడి తలకు తాకి పైకి లేచింది. వెంటనే నొప్పితో విలవిల్లాడిన గిల్‌ను ముందుగా కీపర్‌ పంత్‌ వచ్చి పరిశీలించాడు. ఆ తర్వాత ఫిజియో వచ్చి చికిత్స అందించడంతో గిల్‌ తిరిగి ఫీల్డింగ్‌ కొనసాగించడం ఊరటనిచ్చింది.


  • 148 ఏళ్ల టెస్టు చరిత్రలోనే అత్యంత చెత్త బౌలింగ్‌ (618 బంతుల్లో 5.14 ఎకానమీ)ను నమోదు చేసిన పేసర్‌ ప్రసిద్ధ్‌.

  • భారత్‌ తరఫున వేగంగా (40 ఇన్నింగ్స్‌) 2 వేల టెస్టు పరుగులు సాధించి ద్రవిడ్‌, సెహ్వాగ్‌ల సరసన చేరిన జైస్వాల్‌.

  • ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌లో ఆరుగురు డకౌట్లు కావడం ఇదే తొలిసారి.

  • టెస్టుల్లో 300+ భాగస్వామ్యం నమోదైనా తక్కువ స్కోరు (407)కే ఆలౌటైన జట్టుగా ఇంగ్లండ్‌

  • బెన్‌ స్టోక్స్‌ ఆడిన 113 టెస్టుల్లో తొలి బంతికే వెనుదిరగడం ఇదే తొలిసారి. సిరాజ్‌ ఈ వికెట్‌ తీశాడు.

  • టెస్టుల్లో వంద పరుగుల్లోపే ఐదు వికెట్లు కోల్పోయినా ఓ జట్టు (ఇంగ్లండ్‌) ఆరో వికెట్‌కు 300+ పరుగులు (ఇంగ్లండ్‌) జత చేర్చడం ఇది మూడోసారి మాత్రమే.


తొలి సెషన్‌లోనే శతకం చేసిన ఇంగ్లండ్‌ బ్యాటర్‌గా జేమీ స్మిత్‌. అలాగే భారత్‌-ఇంగ్లండ్‌ మధ్య జరిగిన టెస్టుల్లో ఫాస్టెస్ట్‌ (80 బంతుల్లో) శతకం బాదిన బ్యాటర్‌గానూ నిలిచాడు. ఈక్రమంలో తను కపిల్‌ దేవ్‌ (86 బంతుల్లో)ను అధిగమించాడు. ఇక టెస్టుల్లో అత్యధిక స్కోరు (184 నాటౌట్‌) సాధించిన ఇంగ్లండ్‌ కీపర్‌గా స్టివార్ట్‌ (173)ను అధిగమించాడు. అలాగే ఈ జట్టు తరఫున ఏడు అంతకంటే దిగువ బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ఎక్కువ పరుగులు సాధించిన బ్యాటర్‌గా రంజిత్‌ సింగ్‌ (1897లో 175 పరుగులు) రికార్డును బ్రేక్‌ చేశాడు.

Updated Date - Jul 05 , 2025 | 04:09 AM